రైతులకు నీళ్లు సకాలంలో ఇస్తే బంగారం పండిస్తారు: సీఎం చంద్రబాబు

0

 నెల్లూరు జిల్లా

రైతులకు నీళ్లు సకాలంలో ఇస్తే బంగారం పండిస్తారు: సీఎం చంద్రబాబు

రాష్ట్రంలో కరవు అనే మాట వినపడకూడదని సీఎం చంద్రబాబు తెలిపారు

నదుల అనుసంధానం ద్వారా కరవు అనే మాటను రూపుమాపుతామని చెప్పారు

నెల్లూరు జిల్లాలో సోమశిల ప్రాజెక్టును చంద్రబాబు పరిశీలించారు.

అనంతరం ప్రజావేదికలో ప్రజలు, అధికారులతో సమావేశమయ్యారు

రైతులకు నీళ్లు సకాలంలో ఇస్తే బంగారం పండిస్తారని సీఎం చంద్రబాబు అన్నారు. నెల్లూరు జిల్లా సోమశిల ప్రాజెక్టును సీఎం పరిశీలించారు. గత వరదల్లో దెబ్బతిన్న స్పిల్‌వే, దెబ్బతిన్న రక్షణ కట్టడాల పరిశీలించారు. సోమశిలలో ప్రజలు, అధికారులతో ప్రజావేదికలో పాల్గొన్నారు. ఉన్మాద, రాక్షస పాలన నుంచి బయటికొచ్చామన్న సీఎం, ప్రజలంతా స్వాతంత్య్రం వచ్చిందని హాయిగా ఉన్నారని వ్యాఖ్యానించారు.

ప్రజాస్వామ్యంలో బాధ్యత గుర్తెరిగి పనిచేయాల్సిందే అని స్పష్టం చేశారు. రాష్ట్రంలో కరవు అనే మాట వినపడకూడదన్న చంద్రబాబు, భూమినే జలాశయంగా చేయగలిగితే నీటి సమస్యే ఉండదన్నారు. రైతులకు నీళ్లు సకాలంలో ఇస్తే బంగారం పండిస్తారని, ఒకప్పుడు దేశానికే అన్నపూర్ణ ఆంధ్రప్రదేశ్‌ అని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌లోనే వ్యవసాయానికి గడ్డు పరిస్థితి వచ్చిందన్న సీఎం, మొత్తం రిజర్వాయర్లలో 983 టీఎంసీలు నిల్వ చేసుకోవచ్చని తెలిపారు.రాష్ట్రంలో ఇప్పటివరకు 692 టీంసీలు నిల్వ చేసుకున్నామని, 20 ఏళ్ల తర్వాత ఏపీలో ఆగస్టులో రిజర్వాయర్లు కళకళలాడుతున్నాయని వెల్లడించారు. వరుణ దేవుడు కూడా మనల్ని ఆశీర్వదిస్తున్నాడని, 70 శాతం ప్రాజెక్టుల్లో నీళ్లు వచ్చాయని వ్యాఖ్యానించారు. తుంగభద్రలో గేటు కొట్టుకుపోతే వెంటనే ఇంజినీర్‌ను పంపామని గుర్తు చేశారు. కర్ణాటకకు మన మంత్రులు వెళ్లి మాట్లాడారని, మన వద్ద ఉన్న ఇంజినీర్‌ కన్నయ్యనాయుడును పంపామని తెలిపారు. మూడు, నాలుగు రోజుల్లోనే గేటు పెట్టి నీటిని నిల్వచేయగలిగామన్నారు.

నీటిని కాపాడుకోవడం మనందరి బాధ్యత అన్న చంద్రబాబు, డబ్బులివ్వకపోతే కాంట్రాక్టర్‌ పనిచేస్తారా అని ప్రశ్నించారు. గేటు పెట్టలేని ప్రభుత్వం ఐదేళ్లు పాలించిందని సీఎం చంద్రబాబు మండిపడ్డారు. ప్రాధాన్యతలు తెలిసిన ప్రభుత్వమిదని తెలిపారు. కష్టాలున్నా ఖాళీ ఖజానా ఉన్నా ప్రాజెక్టులు పూర్తిచేసే బాధ్యత తమదని స్పష్టం చేశారు. పాత రోజులు మరచిపోవాలని అందరికీ చెబుతున్నానన్న చంద్రబాబు, బాధ్యతగా పనిచేయాలని, సకాలంలో పనులు పూర్తిచేయాలన్నారు.గత ప్రభుత్వంలో సర్వేరాళ్లపై బొమ్మలకు రూ.700 కోట్లు ఖర్చుపెట్టారని మండిపడ్డారు. పేపర్లకు ప్రకటనల కోసం రూ.403 కోట్లు ఖర్చుపెట్టారని, ఈ డబ్బుల్లో 200 కోట్లు ఖర్చుపెట్టినా ఈ ప్రాజెక్టులు పూర్తయ్యేవన్నారు. రుషికొండ కొట్టేసి రూ.500 కోట్లతో ప్యాలెస్‌ కట్టించుకున్నారని ధ్వజమెత్తారు. 

అంతకుముందు తిరుపతి జిల్లా ప్రత్యేక ఆర్థిక మండలి శ్రీసిటీలో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటించారు. 15 వందల 70 కోట్ల రూపాయలతో నిర్మించిన 16 పరిశ్రమలను ఆయన ప్రారంభించారు. 900 కోట్లతో నిర్మించనున్న 7 పరిశ్రమలకు శంకుస్థాపన చేశారు. 200 కోట్ల రూపాయలతో ఐదు పరిశ్రమలు నిర్మించేందుకు ఆయా సంస్థలతో ఒప్పందాలు చేసుకున్నారు. అనంతరం పరిశ్రమల సీఈవోలతో నిర్వహించిన సమావేశంలో చంద్రబాబు పాల్గొన్నారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version