ఎన్‌టీఆర్ జిల్లా, జులై 02, 2025
రహదారుల నిర్వహణపై ప్రత్యేక దృష్టిపెట్టండి
- ఎన్‌హెచ్‌తో పటిష్ట సమన్వయంతో పనిచేయండి
- ప్రమాదాలు రహిత రహదారుల సాకారానికి కృషిచేయాలి
- గన్నవరం విమానాశ్రయం వరకు క్షేత్రస్థాయి పరిశీలన
- జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ
విజయవాడ నగరంలోని రహదారులతో పాటు గన్నవరం విమానాశ్రయం వరకు ఉన్న రహదారిపై ప్రత్యేకంగా దృష్టిసారించాలని, వాహనదారులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా సాఫీ ప్రయాణానికి వీలుకల్పించేలా జాతీయరహదారుల ప్రాధికార సంస్థ (ఎన్‌హెచ్ఏఐ) అధికారులతో మునిసిపల్, పంచాయతీరాజ్ తదితర శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ డా. జి.లక్ష్మీశ ఆదేశించారు.
బుధవారం కలెక్టర్ లక్ష్మీశ.. కృష్ణా కలెక్టర్ డీకే బాలాజీ, విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర హెచ్ఎంతో కలిసి గన్నవరం విమానాశ్రయం వరకు రహదారులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. రహదారులు ఎక్కడైనా దెబ్బతిన్నాయా? విద్యుత్ స్తంభాలు, విద్యుత్ దీపాల నిర్వహణ ఎలా ఉంది? డ్రెయిన్లు, వంతెనలు, పారిశుద్ధ్యం, రహదారుల వెంబడి పచ్చదనం తదితరాలను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ వర్షాకాలం నేపథ్యంలో డ్రెయిన్లలోని మురుగునీరు రహదారులపై పొంగిపొర్లకుండా ప్రణాళికాయుత చర్యలు తీసుకోవాలని, ఏవైనా సమస్యలు ఉంటే పరిష్కారానికి యుద్ధప్రాతిపదికన పనులు చేపట్టాలని ఆదేశించారు. ఎక్కడా గుంతలు అనేవి కనిపించకూడదని.. రాత్రిపూట పూర్తిస్థాయిలో విద్యుత్ దీపాలు వెలిగేలా చూడాలని సూచించారు. నవ్య రాజధాని అమరావతికి ముఖద్వారమైన విజయవాడ రహదారులు అత్యంత కీలకమైనవని.. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని సమన్వయ శాఖలు పనిచేయాలని ఆదేశించారు. ఎక్కడా ట్రాఫిక్ సమస్య అనేది లేకుండా చూడాలని.. ప్రమాదాల రహిత రహదారులు లక్ష్యంగా కృషిచేయాలని కలెక్టర్ లక్ష్మీశ అధికారులకు సూచించారు. కలెక్టర్ వెంట ఎన్‌హెచ్ పీడీ ఎం.విద్యాసాగర్, డీపీవో పి.లావణ్య కుమారి తదితరులు ఉన్నారు.