రచనలు కలకాలం నిలిచేలా ఉండాలి సుప్రీంకోర్టు పూర్వపు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ నూతలపాటి వెంకటరమణ

0

 రచనలు కలకాలం నిలిచేలా ఉండాలి 

సుప్రీంకోర్టు పూర్వపు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ నూతలపాటి వెంకటరమణ

సామాజిక పరిస్థితులు, మానవ సంబంధాలకు అద్దం పట్టే రచనలు కలకాలం నిలిచి ఉంటాయని సుప్రీంకోర్టు పూర్వపు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ నూతలపాటి వెంకటరమణ అన్నారు. శనివారం విజయవాడ కేబీఎన్ కళాశాలలో ప్రపంచ తెలుగు రచయితల మహాసభలో ఆయన ప్రసంగిస్తూ తెలుగు భాష అభివృద్ధికి కృషి చేసిన జలగం వెంగళరావు, ఎన్టీఆర్, మండలి వెంకట కృష్ణారావు కృషి చిరస్మరణీయమన్నారు. కొన్ని దశాబ్దాలుగా తెలుగు భాష పరిరక్షణ కోసం మండలి బుద్ధప్రసాద్ చేస్తున్న కృషి ప్రశంసనీయమన్నారు. 

తెలుగు భాష అభివృద్ధికి, పరిరక్షణకు పత్రికలు, చానళ్ళు కృషి చేయాలని పిలుపునిచ్చారు. తెలుగు వారు సంస్కృతి భాష మరువకుండా దేదీప్యమానంగా వెలుగొందేలా కృషి చేయాలన్నారు. 

ప్రపంచంలో వంద మిలియన్ల మంది తెలుగు మాట్లాడే వారు ఉన్నారన్నారు. భారతదేశంలో తెలుగు భాష మూడవ స్థానంలో, ప్రపంచంలో 13వ స్థానంలో ఉందన్నారు. క్రీస్తు పూర్వం 400ల క్రితమే తెలుగు భాష ఉన్నట్లు భట్టిప్రోలు శాసనం ద్వారా తెలుస్తోందన్నారు. తెలుగు లిపి స్వంత నుడి నుడికారాలు చేకూర్చుకుని వైభవం సంతరించుకుందన్నారు. అనేక కావ్యాలు, పురాణాలు, ఇతిహాసాలు, ప్రభంధాలు దాటి ప్రజల భాషగా మారి నవల, కథ, పద్యం, కథానిక, గేయ రూపాల్లో జన బాహుళ్యంలో వృద్ధి చెందిందన్నారు. తెలుగు భాష పలుకుబడి వినసొంపైనదన్నారు. సామాన్య ప్రజలు సైతం కవితా ధోరణిలో మాట్లాడేలా ఉంటుందన్నారు. అయితే వ్యాపార, రాజకీయ ప్రయోజనాల కోసం తెలుగు భాషను ఇతర భాషలు కొల్లగొట్టడాన్ని సహించకూడదన్నారు. స్వాతంత్య్రం అనంతరం కూడా ఆంధ్రులు మద్రాసులో కలిసి ఉండటంతో తెలుగు భాష, సంస్కృతి అణగదొక్కబడిందన్నారు. దీంతో ఆంధ్ర ప్రాంత స్వాతంత్ర సమరయోధులు కూడా గుర్తింపునకు నోచుకోలేదన్నారు. 

తెలుగు భాషను వాడుక భాషగా మార్చి ప్రజలకు అందించేందుకు గిడుగు రామ్మూర్తి, గురజాడ అప్పారావు, రఘుపతి వెంకయ్య నాయుడు, త్రిపురనేని రామస్వామి, కందుకూరి వీరేశలింగం భాషను పరిపుష్టి చేశారన్నారు. 

ప్రపంచంలో అనేక దేశాలు తమ మాతృభాషను అభివృద్ధి చేసి లాభాలు గడిస్తున్నాయన్నారు. ఆంగ్ల భాష వస్తేనే ఉద్యోగాలు వస్తాయనే భావన విడనాడాలని, ఆంగ్ల దేశాల్లో కూడా నిరుద్యోగులు ఉన్నారని గ్రహించాలన్నారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version