యువతలో ఎఐ నైపుణ్యాలకు మైక్రో సాఫ్ట్ తో కీలక ఒప్పందం

0

 యువతలో ఎఐ నైపుణ్యాలకు మైక్రో సాఫ్ట్ తో కీలక ఒప్పందం

ఎఐ, అధునాతన సాంకేతిక పరిజ్జానాల్లో 2లక్షలమందికి శిక్షణ

మంత్రి లోకేష్ సమక్షంలో మైక్రోసాఫ్ట్, ఎపిఎస్ఎస్ డి నడుమ అవగాహన

అమరావతి: రాష్ట్రంలోని యువతకు ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ (ఎఐ), అధునాతన సాంకేతిక పరిజ్ఞానాల్లో నైపుణ్యాభివృద్ధి కోసం అంతర్జాతీయస్థాయి ప్రఖ్యాత సంస్థ మైక్రోసాఫ్ట్ తో ఎపి ప్రభుత్వం కీలకమైన ఒప్పందం చేసుకుంది. అమరావతి సచివాలయంలో రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ సమక్షంలో మైక్రోసాఫ్ట్ ప్రతినిధులు, ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ అధికారులు ఎంఓయుపై సంతకాలు చేశారు. వృత్తి విద్య, మాధ్యమిక పాఠశాల పిల్లలు, యువతలో ఎఐ, అధునాతన సాంకేతిక పరిజ్ఞానాలలో ప్రాథమిక నైపుణ్యాలను పెంపొందించి రాష్ట్రంలో ఐటి ఆధారిత, ఇతర పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యవంతమైన సిబ్బందిని తయారు చేయడం ఈ ఒప్పందం ముఖ్యోద్దేశం. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ… ఈ ఒప్పందం ప్రకారం ఎపిలో ఏడాది వ్యవధిలో 2లక్షలమంది యువతకు మైక్రోసాఫ్ట్ సంస్థ స్కిల్ డెవలప్ మెంట్ శిక్షణ ఇస్తుందని తెలిపారు. అంతర్జాతీయంగా ఎఐ, అధునాతన టెక్నాలజీల్లో వస్తున్న అవకాశాలను అందిపుచ్చుకొని, ఉద్యోగావకాశాలు పొందేందుకు మైక్రోసాఫ్ట్ శిక్షణ ఉపకరిస్తుందని తెలిపారు. రాష్ట్రంలోని 50 గ్రామీణ ఇంజనీరింగ్ కళాశాలల్లో 500మంది అధ్యాపకులు, 10వేలమంది ఇంజనీరింగ్ విద్యార్థులకు ఎఐ, క్లౌడ్ కంప్యూటింగ్ పై మైక్రోసాఫ్ట్ శిక్షణ ఇస్తుంది . గ్రామీణ ప్రాంతాల్లో నెలకొని ఉన్న 30 ఐటిఐలలో 30వేలమంది విద్యార్థులకు డిజిటల్ ప్రొడక్టివిటీలో ఎఐ శిక్షణను అందిస్తారు. ఎపిలో యునిసెఫ్ భాగస్వామ్యంతో పాస్ పోర్ట్ టు ఎర్నింగ్ 2.0ని ప్రవేశపెట్టేందుకు వీలుగా 40వేలమందికి, కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రిత్వశాఖ సహకారంతో మరో 20వేలమందికి ఎఐ నైపుణ్యాల్లో శిక్షణ ఇస్తారు. ప్రభుత్వ పౌర సేవలను మెరుగుపర్చడంతోపాటు ప్రభుత్వాధికారుల్లో సామర్థ్యం పెంపుదలకు 50వేల మందికి 100 గంటలపాటు AI శిక్షణను అందిస్తుంది. తద్వారా APSSDCతో సివిల్ సర్వీసెస్ కెపాసిటీ బిల్డింగ్ ప్రోగ్రామ్‌ను అమలు చేస్తారు. శాఖల మధ్య సహకారంపై స్వీయ-అభ్యసన మార్గాలు, వర్క్‌షాప్‌లు, వెబినార్‌ల ద్వారా 20వేలమంది మంది సిబ్బందికి AI అప్‌స్కిల్లింగ్, రీస్కిల్లింగ్‌ను అందిస్తారు. ఆయా ప్రాంతాల్లో ఎఐ శిక్షణకు అవసరమైన భౌతిక మౌలిక సదుపాయాలను ఎపి స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ సమకూరుస్తుంది. ఎఐ శిక్షణ అందించడానికి ఆయా విభాగాలను సమన్వయ పరుస్తుంది. విద్యాసంస్థల్లో ఎఐ పాఠ్యాంశాలను ప్రవేశపెట్టేందుకు అవసరమైన శిక్షణ, సర్టిఫికేషన్ ను మైక్రోసాఫ్ట్ అందజేస్తుందని మంత్రి లోకేష్ చెప్పారు. ఈ కార్యక్రమంలో విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్, స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ఎండి గణేష్ కుమార్, ఎగ్జిక్యూటివ్ డైరక్టర్ దినేష్ కుమార్, మైక్రోసాఫ్ట్ సౌత్ హెడ్ ఫర్ గవర్నమెంట్ బిజినెస్ దినేష్ కనకమేడల, మైక్రోసాఫ్ట్ ఇండియా – సౌత్ ఏషియా డైరక్టర్ సందీప్ బంద్వేద్కర్ తదితరులు పాల్గొన్నారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version