మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై మంత్రి అచ్చెన్నాయుడు వ్యాఖ్యలు

0

మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై మంత్రి అచ్చెన్నాయుడు వ్యాఖ్యలు

ఐదు రకాల బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయం కల్పిస్తామన్న మంత్రి అచ్చెన్నాయుడు

ఆగస్టు 15 నుంచి ఈ పథకం అమలు చేస్తున్నట్లు వెల్లడి

మహిళలు రాష్ట్ర వ్యాప్తంగా ఉచితంగా ప్రయాణించేలా పథకం రూపొందించామన్న మంత్రి అచ్చెన్నాయుడు

కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన సూపర్‌ సిక్స్‌ హామీలలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం ఒకటి. ఈ పథకం కోసం ఆంధ్రప్రదేశ్‌లోని మహిళలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే రాష్ట్ర అధికారులు, మంత్రులు ఇతర రాష్ట్రాల్లో అమలవుతున్న ఉచిత బస్సు ప్రయాణ పథకాలపై అధ్యయనం చేయడానికి తెలంగాణ, కర్ణాటక, ఢిల్లీ రాష్ట్రాల్లో పర్యటించారు.

చివరికి ఆగస్టు 15 నుంచి ఈ పథకాన్ని ఏపీలో ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సైతం ప్రకటించారు. తాజాగా మంత్రి అచ్చెన్నాయుడు ఈ అంశంపై ఒక ముఖ్యమైన విషయాన్ని వెల్లడించారు.

ప్రత్తిపాడు నియోజకవర్గంలోని అన్నవరంలో స్థానిక ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ ఆధ్వర్యంలో నిర్వహించిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ, రాష్ట్ర వ్యాప్తంగా ఐదు రకాల బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయం కల్పించబోతున్నట్లు తెలిపారు. ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించనున్నట్లు ఆయన పునరుద్ఘాటించారు.

మహిళలు రాష్ట్రమంతా ఉచితంగా ప్రయాణించేలా ఈ పథకం రూపొందించామని, ఐదు రకాల బస్సుల్లో ఉచితంగా ప్రయాణం కల్పిస్తామని ఆయన పేర్కొన్నారు. అదే సమయంలో ఆటో డ్రైవర్లకు ఆగస్టు 15న ఆర్థిక సహాయం అందిస్తామని ప్రకటించారు. అయితే, జిల్లా పరిధిలోనే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో, మంత్రి అచ్చెన్నాయుడు రాష్ట్ర వ్యాప్తంగా ఈ పథకం వర్తిస్తుందని స్పష్టతనిచ్చారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version