ప్రజలకు జవాబుదారీతనంతో కూడిన పాలన అందిస్తున్న కూటమి ప్రభుత్వం.
ఏడాది పాలనలో సాధించిన విజయాలపై విస్తృత ప్రచారం.
గొల్లపూడిలో ‘సుపరిపాలనలో తొలిఅడుగు.’
పాల్గొన్న హోంమంత్రి అనిత శాసనసభ్యులు కృష్ణప్రసాదు
ఎన్టీఆర్ జిల్లా, విజయవాడ రూరల్, 29.07.2025.
ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో అమలు చేసిన సంక్షేమ పథకాలు, చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలపై విస్తృత ప్రచారం నిర్వహించారు.
విజయవాడ రూరల్ మండలంలోని గొల్లపూడి గ్రామంలో ‘సుపరిపాలనలో తొలిఅడుగు’ కార్యక్రమాన్ని మంగళవారం సాయంత్రం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోం శాఖ మంత్రివర్యులు వంగలపూడి అనిత మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణప్రసాదు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వారు ప్రతి ఇంటికి వెళ్లి వారిని ఆప్యాయంగా పలుకరిస్తూ వారి యోగక్షేమాలు తెలుసుకుంటూ వారికి వర్తింప చేసిన సంక్షేమ పథకాలపై వాకబు చేశారు. పిల్లల విద్యాభ్యాసం గురించి ప్రశ్నించారు. అనారోగ్యంతో బాధపడుతున్న వారిని పరామర్శించారు. సుపరిపాలనలో తొలి అడుగు కరపత్రాలు పంపిణీ చేశారు.
పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులను పలుకరించారు. స్వచ్ఛంధ్ర-స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో పారిశుధ్య కార్మికుల పాత్ర కీలకమన్నారు.
ఎన్టీఆర్ భరోసా పింఛన్లు, తల్లికి వందనం, దీపం పథకం కింద గ్యాస్ సిలిండర్ల సొమ్ము రీ ఎంబర్స్ మెంట్ గురించి ప్రశ్నించారు. సంక్షేమ పథకాల అమల్లో ఉత్పన్నమయ్యే పలు సాంకేతిక సమస్యలు పరిష్కరించాలని సచివాలయ సిబ్బందిని, అధికారులను ఆదేశించారు.
ఈ సందర్భంగా హోంమంత్రి శ్రీమతి అనిత మాట్లాడుతూ గొల్లపూడి మౌలా నగర్ లో నేడు పర్యటించి ముస్లిం సోదర సోదరీమణుల అభిప్రాయాలను తెలుసుకున్నట్లు పేర్కొన్నారు. వారంతా ఏడాది పాలనలో పథకాల అమలు పట్ల సంతృప్తి వ్యక్తం చేశారన్నారు.
ప్రజల బాగోగులు, సంక్షేమ పథకాల వర్తింపు గురించి నేరుగా ప్రజలను అడిగి తెలుసుకుని, ఇంకా వారి జీవన ప్రమాణాలు మెరుగు పరిచేందుకు అమలు చేయాల్సిన ప్రణాళికలు రూపొందించడం కోసం కూటమి ప్రభుత్వం సుపరిపాలనలో తొలిఅడుగు కార్యక్రమం చేపట్టినట్లు వెల్లడించారు.
శాసనసభ్యులు కృష్ణప్రసాదు మాట్లాడుతూ ప్రజలకు జవాబుదారీతనంతో కూడిన పాలన అందించడానికి సుపరిపాలనలో తొలిఅడుగు కార్యక్రమం వేదిక అన్నారు.
కూటమి ప్రభుత్వం రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థను గాడిలో పెడుతూ సూపర్ సిక్స్ పథకాలను దశల వారిగా అమలు చేస్తోందన్నారు.
ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు చేయనున్నట్లు వెల్లడించారు.
అన్నదాత సుఖీభవ కింద రైతు సోదరులకు త్వరలోనే పెట్టుబడి సాయం అందజేస్తామని అన్నారు.
తొలుత హోంమంత్రి అనిత గొల్లపూడిలోని శాసనసభ్యుని వారి కార్యాలయానికి చేరుకోగా శాసనసభ్యులు కృష్ణప్రసాదు ఆమెకు ఘనంగా స్వాగతం పలికారు.
ఈ కార్యక్రమంలో మైలవరం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జి అక్కల రామ్మోహనరావు (గాంధీ) గొల్లపూడి ఏఎంసీ చైర్మన్ నర్రా వాసు ఎన్డీఏ కూటమి కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.