పంట పొలాల్లో నీటి కుంటల‌తో.. పొలం ప‌చ్చ‌గా.. స‌మాజం సుభిక్షంగా..

0

 *ఎన్‌టీఆర్ జిల్లా, ఫిబ్ర‌వ‌రి 05, 2025*

పంట పొలాల్లో నీటి కుంటల‌తో..

పొలం ప‌చ్చ‌గా.. స‌మాజం సుభిక్షంగా..

– *కార్య‌క్ర‌మం ఒక‌టే.. ప్ర‌యోజ‌నాలు అనేకం*

– *రైతుల‌కు కార్య‌క్ర‌మం ప్రాధాన్య‌తను తెలియ‌జెప్పండి*

– *ఒక రైతు.. ఒక నీటి కుంట నినాదంతో ముందుకెళ్లాలి*

– *జిల్లా, క్షేత్ర‌స్థాయి అధికారుల‌తో క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌*

పంట పొలాల్లో నీటి కుంట‌ల (ఫార్మ్ పాండ్స్‌)తో పొలం ప‌చ్చ‌గా.. స‌మాజం సుభిక్షంగా ఉంటుందని, ఒక కార్య‌క్ర‌మంతో అనేక ప్ర‌యోజ‌నాలు ఉన్నాయ‌ని జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ అన్నారు.

బుధ‌వారం క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ క‌లెక్ట‌రేట్ నుంచి జిల్లాస్థాయి అధికారుల‌తో క‌లిసి ఆర్‌డీవోలు, ఎంపీడీవోలు, మునిసిప‌ల్ క‌మిష‌న‌ర్లు, పంచాయ‌తీరాజ్ ఇంజ‌నీరింగ్ అధికారులు త‌దిత‌రుల‌తో వీడియో కాన్ఫరెన్స్ నిర్వ‌హించారు. జిల్లాలో మ‌హాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ ప‌థ‌కం అమ‌లు తీరుతెన్నుల‌తో పాటు స‌గ‌టు రోజువారీ వేత‌నాలు, ప‌శువుల షెడ్లు, పంట పొలాల్లో నీటి కుంట‌ల ప‌నులు త‌దిత‌రాల్లో పురోగ‌తిని స‌మీక్షించారు.  ఇప్ప‌టికే ప్రారంభించిన ప‌నుల స‌త్వ‌ర పూర్తికి తీసుకోవాల్సిన చ‌ర్య‌ల‌పై దిశానిర్దేశం చేశారు. ఈ సంద‌ర్భంగా క‌లెక్ట‌ర్ మాట్లాడుతూ న‌రేగా అనుసంధానంతో పైసా ఖ‌ర్చు లేకుండా రైతుల పొలాల్లో నీటి కుంట‌ల వ‌ల్ల పంట‌కు కావాల్సిన నీరు అంద‌డ‌మే  కాకుండా భూగ‌ర్భ జ‌లాల వృద్ధికీ దోహ‌దం చేస్తాయ‌న్నారు. మృత్తికా, పోష‌కాల క్ర‌మ‌క్ష‌యాన్ని అడ్డుకునేందుకు ఈ కుంటలు ఉప‌యోగ‌ప‌డ‌తాయ‌ని వివ‌రించారు. ఇన్ని ప్ర‌యోజ‌నాలున్న నీటి కుంట‌ల గురించి రైతుల‌కు పొలం పిలుస్తోంది వంటి కార్య‌క్ర‌మాల ద్వారా అవ‌గాహ‌న క‌ల్పించాల‌ని సూచించారు. ఒక రైతు ఒక నీటి కుంట నినాదంతో ముందుకెళ్లాల‌ని.. అప్పుడే మంచి ఫ‌లితాలు వ‌స్తాయ‌ని పేర్కొన్నారు. జిల్లాలో 289 గ్రామ పంచాయ‌తీల ప‌రిధిలో 2,713 కుంట‌లు మంజూర‌య్యాయ‌ని.. ఇప్ప‌టికే 203 కుంట‌లు గ్రౌండింగ్ అయ్యాయ‌ని, మిగిలిన వాటికీ స్ప‌ష్ట‌మైన ల‌క్ష్యాల‌ను నిర్దేశించుకొని ప‌నులు ప్రారంభించి, పూర్త‌య్యేలా చూడాల‌న్నారు. న‌రేగా-ప‌ల్లె పండ‌గ కార్య‌క్ర‌మం కింద ప‌శువుల షెడ్ల‌కు సంబంధించి 746 ప‌నులు మంజూరు కాగా, 420 ప‌నులు పూర్త‌య్యాయ‌ని తెలిపారు. మిగిలిన ప‌నుల‌పైనా ఎప్ప‌టిక‌ప్పుడు క్షేత్ర‌స్థాయిలో స‌మీక్షించి, ఫిబ్ర‌వ‌రి 15లోగా పూర్త‌య్యేలా చూడాల‌ని ఆదేశించారు. అదేవిధంగా సీసీ రోడ్ల ప‌నుల‌నూ యుద్ధ‌ప్రాతిప‌దిక‌న పూర్తిచేయాల‌న్నారు. ఈ నెల 11లోగా శ్ర‌మ శ‌క్తి సంఘాల రిజిస్ట్రేష‌న్‌ను పూర్తిచేయాల‌ని ఆదేశించారు. న‌రేగా ద్వారా వీలైనంత ఎక్కువ మందికి ప‌ని క‌ల్పించాల‌ని, ప‌థ‌కం కింద చేప‌ట్టేందుకు గ్రామాభివృద్ధి, వ్య‌క్తిగ‌త‌, సామాజిక ప‌నుల‌ను గుర్తించాల‌ని సూచించారు. ఉపాధి ప‌నుల‌పై ఎంపీడీవోలు ప్ర‌తివారం స‌మావేశాలు నిర్వ‌హించాల‌న్నారు. రూ. 300 రోజువారీ స‌గ‌టు వేత‌న ల‌క్ష్యాన్ని చేరుకునేందుకు అధికారులు, క్షేత్ర‌స్థాయి సిబ్బంది స‌మ‌న్వ‌యంతో ప‌నిచేయాల‌ని క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ ఆదేశించారు. స‌మావేశంలో డ్వామా పీడీ ఎ.రాము, డీఆర్‌డీఏ పీడీ కె.శ్రీనివాస‌రావు, పంచాయ‌తీరాజ్ ఎస్ఈ ర‌మేష్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version