నేతన్నల బతుకులో మరణశాసనం రాసిన జగన్ రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి సవిత

0
నేతన్నల బతుకులో మరణశాసనం రాసిన జగన్ రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి సవిత 

పలు సొసైటీలను సందర్శించి నేత కార్మికుల సమస్యలపై అరా
నేతన్న నేస్తం అక్రమ లబ్దిదారుల జాబితాలు త్వరలో వెల్లడి 
నేతన్న నేస్తం ద్వారా అక్రమంగా లబ్ది పొందిన వైసిపి కార్యకర్తల జాబితాలను త్వరలో బయటపెడతామని చేనేత, జౌళి శాఖ మంత్రి సవిత అన్నారు. ఎనభైవేలకు పైగా ఉన్న నేతన్న నేస్తం జాబితాలో దాదాపు 36వేల మంది వైసిపి నాయకులే అని ప్రాధమిక విచారణలో స్పష్టం అయ్యిందన్నారు. శనివారం మంత్రి కృష్ణా జిల్లాలోని పోలవరం, కప్పలదొడ్డి, పెడనలలో చేనేత కార్మికులు,  ప్రతినిధులతో సమావేశాలు నిర్వహించి క్షేత్ర స్దాయిలో పర్యటించి వారి కష్ట నష్టాలను తెలుసుకునే ప్రయత్నం చేసి, వినతులను స్వీకరించారు. ఈ సందర్భంగా సవిత మీడియాతో మాట్లాడుతూ చేనేత కార్మికుల జీవితాలలో జగన్ మరణ శాసనం రాశారని విమర్శించారు. చేనేత మగ్గాలకు 200,  మరమగ్గాలకు 500 యూనిట్ల ఉచిత విద్యుత్ వంటి అన్ని వాగ్దానాలను త్వరలో అమలు చేస్తామన్నారు.  చేనేత ఉత్పత్తులపై విధించే 5శాతం జిఎస్‌టిపై కూడా కేంద్రంతో చర్చించటం జరిగిందని, త్వరలోనే ఆ సమస్య కూడా పరిష్కారం అవుతుందన్నారు.  
నేత కార్మికుల సమస్యలను దూరం చేసి వారి  బతుకుల్లో  గత ప్రభుత్వం చేసిన విధ్వంసాన్ని పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. పెద్ద ఎత్తున ప్రదర్శనలను నిర్వహించటం ద్వారా చేనేత ఉత్పత్తులకు జాతీయ, అంతర్జాతీయ మార్కెట్ ను కల్పిస్తామని సవిత స్పష్టం చేసారు. నేతన్నలు సామాజిక, ఆర్థిక అభివృద్ధి సాధించి మెరుగైన వేతనాలు పొందడానికి అనుగుణంగా కార్యాచరణ అమలు చేస్తామన్నారు. అధునిక డిజైన్లను ఉత్పత్తి చేయగలిగేలా పురాతన మగ్గాలను ఆధునికీకరించేందుకు అవసరమైన ప్రణాళికను సిద్దం చేయాలని ఈ సందర్భంగా అధికారులను అదేశించారు. చేనేత రంగాన్ని స్థిరీకరించి,  లాభసాటి రంగంగా మార్చాలన్నదే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయిడు ధ్యేయమన్నారు. గత ప్రభుత్వంలో చేనేత మంత్రిగా పనిచేసిన రోజా చేనేత ఉత్పత్తులకు ఆర్డర్లు తీసుకుని పవర్‌లూమ్ క్లాత్‌ను సరఫరా చేసారని,  దీనిపై లోతైన  విచారణకు ఆదేశించామన్నారు. మాస్టర్ వీవర్స్ తమ సేవలను నూతన సంఘాల స్దాపనకు విస్తరించాలని మంత్రి వారిని ప్రత్యేకంగా కోరారు. 
ఈ సందర్భంగా నేత కార్మిక సంఘాల ప్రతినిధులు మాట్లాడుతూ చేనేత కార్మికుల కోసం తెలుగు దేశం ప్రభుత్వం 2014-19లో అమలు చేసిన అన్ని సంక్షేమ పథకాలను తిరిగి అమలు చేయాలని మంత్రి సవితను అభ్యర్థించారు. అప్పట్లో అయా పధకాలకు సంబంధించి పెండింగ్ లో ఉన్న 104 కోట్లను విడుదల చేయాలని అభ్యర్థించారు. పాత బకాయిలలో దాదాపు 35 కోట్లు కృష్ణ జిల్లాకు చెందిన సొసైటీలవి ఉన్నాయని మంత్రికి వివరించారు. నూలుపై సబ్సిడీ, పావలా వడ్డీ, మార్కెటింగ్ ఇన్సెంటివ్ పధకాలను తిరిగి ప్రవేశ పెట్టాలని కోరారు. అన్ని సమస్యల పట్ల సానుకూలంగా మంత్రి స్పందించారు. ఈ పర్యటనలో పెడన శాసనసభ్యులు కాగిత కృష్ణ ప్రసాద్, చేనేత జౌళి శాఖ ఇన్ చార్జి సంచాలకులు ప్రభాకర్, ఆప్కో ఎండి పావన మూర్తి, సంయిక్త సంచాలకులు కన్నబాబు, ఆప్కో జిఎం తనూజా రాణి, బిసి కార్పోరేషన్ మాజీ ఛైర్మన్  బొడ్డు వేణుగోపాల రావు, తెలుగుదేశం నాయకులు కట్టా మునేశ్వరరావు, వీరంకి గురుమూర్తి, పోతన లక్ష్మి నరసింహ స్వామి, పోతన స్వామినాయిడు, సజ్జా నాగేశ్వరావు, బళ్ల గంగాధరరావు, పుప్పాల రామాంజనేయిలు, తదితరులు పాల్గొన్నారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version