జాతీయ రహదారుల అభివృద్ధి స్ఫూర్తితో ‘‘అడవి తల్లి బాట’’కు శ్రీకారం
• గిరిజన గ్రామాలకు వసతులు, ఉపాధి మార్గాలకు ప్రణాళిక
• డోలీ మోతలు లేని ఏజెన్సీలే లక్ష్యం
• గత ప్రభుత్వానిది కూల్చివేతలు, గుంతల రోడ్లు, విధ్వంస పాలన
•ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో భారతదేశ సుస్థిర వృద్ధి
• కూటమి ఐక్యతను దెబ్బ తీసేందుకు కొందరు కాచుకొని కూర్చున్నారు
• చిన్న పొరపొచ్చాలు ఉంటే కలిసి మాట్లాడుకుందాం
• రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి 15 ఏళ్ల పాటు కూటమి పాలన అవసరం
• భవిష్యత్తులో రాకెట్ వేగంతో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి
• జాతీయ రహదారుల శంకుస్థాపన, ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొని, ప్రసంగించిన ఉప ముఖ్యమంత్రివర్యులు పవన్ కళ్యాణ్
దేశంలో వేగవంతంగా జరుగుతున్న జాతీయ రహదారుల అభివృద్ధిని స్ఫూర్తిగా తీసుకొని, రాష్ట్రంలోనూ మారుమూల ఏజెన్సీ ప్రాంతాల్లో ‘‘అడవి తల్లి బాట’’ పేరుతో సుందరమైన రోడ్లు వేస్తున్నాం. పీఎం జన్ మన్ పథకం, ఉపాధి హామీ నిధులు, రాష్ట్ర ప్రభుత్వం గ్రాంటు కలుపుకొని రూ.1005 కోట్లతో స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత రోడ్లు కూడా చూడని గిరి ప్రాంతాలను అనుసంధానం చేస్తున్నాం. మౌలిక వసతుల అభివృద్ధితో పాటు ఎకో టూరిజం మీద దృష్టి నిలిపి గిరిజన ప్రాంత యువతకు ఉపాధికి దారులు చూపుతున్నామని ఉప ముఖ్యమంత్రివర్యులు పవన్ కళ్యాణ్ చెప్పారు. గత ప్రభుత్వం కూల్చివేతలతో పాలన మొదలుపెట్టి రహదారుల గుంతలు, విధ్వంసం మిగిలిస్తే, దాన్ని అధిగమించి కూటమి పాలన ముందుకు వెళ్తోందన్నారు. రాష్ట్రంలోని 29 జాతీయ రహదారుల శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాల కార్యక్రమంలో కేంద్ర ఉపరితల రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు తో పాటు పవన్ కళ్యాణ్ పాల్గొని ప్రసంగించారు.
ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ… ‘‘గిరిజన గ్రామాల్లో వేస్తున్న రోడ్లు కొత్త భవిష్యత్తుకు పునాది వేస్తాయి. అభివృద్ధిలో వెనుకబడిన గిరిపుత్రుల బతుకుల్లో కొత్త వెలుగులు తీసుకొస్తాయి. అడవి తల్లి బాట పథకానికి అడిగిన వెంటనే రూ.50 కోట్ల నిధులను రాష్ట్ర ప్రభుత్వ గ్రాంటును విడుదల చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు కి ధన్యవాదాలు.
• అటల్ బిహారీ వాజపేయి దార్శనికత
ఓ దేశ ప్రగతికి, పురోగతికి చిహ్నాలు రవాణా మార్గాలు. దీన్ని ఆర్థికవేత్తలు కూడా అంగీకరిస్తారు. 1999లో స్వర్ణ చతుర్భుజి ప్రాజెక్టుతో రహదారుల దశను మార్చాలనే గొప్ప ఆలోచన చేసిన ఘనత ఆనాటి ఎన్డీయే ప్రభుత్వానిది. దార్శనికులు, భారతరత్న అటల్ బిహారీ వాజపేయి మానసపుత్రికగా మొదలైన స్వర్ణఛతుర్జుజి ప్రాజెక్టు దేశ రహదారుల దిశను మార్చిన గొప్ప ముందడుగు. మార్చి 31, 2025 నాటికి దేశం మొత్తం మీద 1,46,204 కిలోమీటర్ల జాతీయ రహదారులు సమకూరాయంటే భారతదేశ వృద్ధి వేగం అర్ధం చేసుకోవచ్చు. ప్రధాని నరేంద్ర మోదీ ముందుచూపు, కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి, హైవే మ్యాన్ గా పేరొందిన నితిన్ గడ్కరీ పని తీరు దేశాన్ని ముందుకు తీసుకెళ్తున్నాయి.
- ఆర్థికంగా, మౌలిక వసతుల పరంగా ముందున్నాం
దేశ ఆర్థిక వృద్ధి రాకెట్ వేగంతో దూసుకుపోతోంది. అన్ని రంగాల్లో దేశం అగ్రగామిగా ఎదుగుతోంది. ప్రపంచ నాయకుల్లోనే ప్రజాదరణలో మొదటిస్థానంలో నిలిచిన విజనరీ లీడర్ నరేంద్ర మోదీ కృషితో దేశం వేగంగా అడుగులు వేస్తోంది. జాతీయ రహదారుల పరంగా 2014 నాటికి దేశంలో 91 వేల కిలోమీటర్ల జాతీయ రహదారులుంటే నేటికి 1,46,204 కిలోమీటర్ల మేర రహదారులను నిర్మించుకోవడం గొప్ప విషయం. పదేళ్ల కాలంలో 54,900 కిలోమీటర్ల మేర జాతీయ రహదారులను సుందరంగా నిర్మించుకోవడం విశేషం. గతంలో రోజువారీ సగటున 11 కిలోమీటర్ల మేర జాతీయ రహదారుల నిర్మాణం జరిగితే, ఎన్డీయే హయాంలో అది మూడింతలు వేగం పెరిగింది. ప్రతి రోజూ 34 కిలోమీటర్ల మేర జాతీయ రహదారులు నిర్మితం అవుతున్నాయి. బడ్జెట్ కేటాయింపులు ఆరు రెట్లు పెరిగాయి. ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలో, హైవే మ్యాన్ ఆఫ్ ఇండియా నితిన్ గడ్కరీ ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మక, జాతి గర్వించే ప్రాజెక్టులను ఎన్డీయే ప్రభుత్వం పూర్తి చేసింది. అటల్ టన్నల్, ఢిల్లీ – ముంబయి ఎక్స్ప్రెస్ హైవే, చార్ ధామ్ మహామార్గ్ వంటి కీలకమైన ప్రాజెక్టులను పూర్తి చేశాం. - గత ప్రభుత్వానికి సహకారం అందినా… ఫలితం సున్నా
ఎన్డీయే కూటమి పాలనలో ఆంధ్రప్రదేశ్ సుస్థిర వృద్ధితో, ఆర్థిక శక్తిగా ఎదుగుతోంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం ఏర్పడిన మొదటి రోజు నుంచి రాష్ట్రంలో రోడ్ల అభివృద్దిపై దృష్టి పెట్టారు. జాతీయ రహదారుల నిర్మాణానికి గత ప్రభుత్వానికి కేంద్రం మద్దతు అందించినా, దాన్ని వినియోగించుకోలేకపోయారు. ఆంధ్రప్రదేశ్ కు పెట్టుబడులు పెరుగుతున్నాయి. సరికొత్త పరిశ్రమలు, ఉత్పత్తి యూనిట్లు, ఐటీ ఇండస్ట్రీ, ఎలక్ట్రానిక్, లాజిస్టిక్ హబ్స్, ఫుడ్ ప్రాసెసింగ్ పార్క్స్ రానున్నాయి. పర్యాటకం పెరగనుంది. దేశ వృద్ధిలో ఆంధ్రప్రదేశ్ బలమైన ముద్రను వేయబోతోంది. జాతీయ రహదారులు దేశ వృద్దికి, భారతీయుల ఐక్యత, సమగ్రతను తెలిపే సూచికలు. రేపటి తరానికి మనం అందించే గొప్ప బహుమతులు. - కూటమి ఐక్యత మరింత బలోపేతం కావాలి
రాష్ట్ర అభివృద్ధి వేగం పుంజుకోవాలంటే, ఇప్పుడు చేస్తున్న శ్రమకు ఫలితం రావాలంటే కచ్చితంగా కూటమి ప్రభుత్వం 15 ఏళ్ల పాటు రాష్ట్రంలో సుస్థిరంగా ముందుకు సాగాలనేదే నా ఆలోచన. రాష్ట్ర భవిష్యత్తు సుందరంగా మారాలనేదే నా ఆకాంక్ష. అందుకే పదేపదే కూటమి ఐక్యత గురించి చెబుతుంటాను. కూటమిలో ఏ చిన్న ఇబ్బందులు వచ్చినా, దాన్ని రాజకీయంగా వాడుకునేందుకు కొందరు సిద్ధంగా ఉన్నారు. మనలో చిన్నచిన్న పొరపొచ్చాలు వస్తే దాన్ని మనమే సరిచేసుకుందాం. కూటమి ఐక్యతను దెబ్బతీయడానికి రకరకాల మార్గాల్లో రాజకీయ శత్రువులు పని చేస్తున్నారని గుర్తుంచుకోవాలి. అలాంటి వారి పట్ల కూటమి నాయకులు, కార్యకర్తలు జాగ్రత్తగా ఉండాలి. కూటమి ఐక్యతను మరింత బలంగా చాటాలి. ఆంధ్ర ప్రదేశ్ అభివృద్ధి భవిష్యత్తులో రాకెట్ స్పీడ్ తో దూసుకుపోతుందని బలంగా నమ్ముతున్నాను’’ అన్నారు.