కే.డీ.సీ.సీ పథకాలను రైతుల దరికీ చేర్చండి :యార్లగడ్డ
హనుమాన్ జంక్షన్ :
రైతుల సంక్షేమం కోసం కృష్ణ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ అమలు చేస్తున్న పథకాలను రైతులకు వివరించే బాధ్యతను కొత్తగా నియమితులైన పిఎసిఎస్ చైర్మన్ తీసుకోవాలని ప్రభుత్వ విప్, గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు సూచించారు. బాపులపాడు మండలంలో జనసేన నుండి కొత్తగా నియమితులైన బాపూలపాడు గ్రామ PACS చైర్మెన్ గా వడ్డీ శివ నాగేశ్వరరావు, కాకులపాడు చైర్మెన్ గా యుజ్జవరపు శ్రీనివాసరావు, బిళ్ళనపల్లి చైర్మన్ గా బెజవాడ వాసు, కొత్తపల్లి గ్రామ చైర్మన్ గా వడ్డీ అశోక్, నలుగురి ప్రమాణ స్వీకారోత్సవం ఆదివారం ఉదయం హనుమాన్ జంక్షన్ ఏలూరు రోడ్డు లోని కళ్యాణ మండపంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన యార్లగడ్డ మాట్లాడుతూ జిల్లా రైతాంగానికి మేలు చేసేందుకు కేడీసీసీ పలు పథకాలను అమలు చేస్తుందని వాటిని పిఎసిఎస్ చైర్మన్లు ఇంటింటికి తిరిగి రైతులకు వివరించాలని కోరారు. తాను కేడిసిసి చైర్మన్ గా సంవత్సరం కాలం పనిచేసిన సమయంలో రైతులకు విరివిగా రుణాలు ఇచ్చేందుకు పలు పథకాలను ప్రవేశపెట్టినట్లు చెప్పారు. కేడిసీసీ ద్వారా రైతుల పిల్లలకు విద్య రుణాలు ఇచ్చే కార్యక్రమాన్ని తాను చైర్మన్ గా ఉన్న సమయంలో ప్రవేశపెట్టానని ఈ పథకం ద్వారా ఎంతో మంది విద్యార్థులు నేడు విదేశాలలో చదువుకుంటున్నట్లు గుర్తు చేశారు. కొత్తగా బాధ్యతలు తీసుకున్న చైర్మన్లు రైతులకు తల్లో నాలుకలా మెలుగుతూ వారికి చేరువ కావాలని పిలుపునిచ్చారు. గన్నవరం నియోజకవర్గ పరిధిలోని కొత్తగా నియమితులైన పిఏసిఎస్ చైర్మన్లు, డైరెక్టర్లు, బ్యాంకు సిబ్బందితో త్వరలో సమావేశం ఏర్పాటు చేసి రైతులకు మరింత ప్రయోజనం కలిగేలా చేపట్టాల్సిన పథకాలపై చర్చించనున్నట్లు చెప్పారు. కొత్తగా నియమితమైన చైర్మన్ లకు పాలనాపరమైన ఇబ్బందులు ఏమైనా ఎదురైతే నేరుగా తనను సంప్రదించాలని వీరికి తన సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని హామీ ఇచ్చారు. ఎన్నికల సమయంలో క్షణం ఖాళీ లేకుండా బిజీగా ఉన్నప్పటికీ తన విజయం కోసం హనుమాన్ జంక్షన్ వచ్చి ఎన్నికల ప్రచారం నిర్వహించిన జనసేనాని పవన్ కళ్యాణ్ కు ఈ సందర్భంగా యార్లగడ్డ మరోసారి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన నియోజకవర్గ సమన్వయకర్త చలమలశెట్టి రమేష్ బాబు, మండల టిడిపి అధ్యక్షులు దయ్యాల రాజేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి పుట్టా సురేష్, టిడిపి నాయకులు మూల్పూరి సాయి కళ్యాణి, కొమ్మారెడ్డి రాజేష్, కాటూరి విజయభాస్కర్, బిజెపి నాయకులు మురళీధర్, చీమాట రవి వర్మ, తదితరులు పాల్గొన్నారు. అనంతరం వేలేరు గ్రామంలో జరిగిన పిఎసిఎస్ చైర్మన్ ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొన్నారు.