ఆ ఘటనల్లో జగనే మొదటి ముద్దాయి రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత

0

 ఆ ఘటనల్లో జగనే మొదటి ముద్దాయి

రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత

*కర్నూలు* : గడిచిన అయిదేళ్లలో రాష్ట్రంలో జరిగిన ఎన్నో హింసాత్మక ఘటనల్లో జగనే మొదటి ముద్దాయి అని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత అన్నారు. శుక్రవారం కర్నూలుకు వచ్చిన మంత్రి స్థానిక స్టేట్ గెస్ట్ హౌస్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఎంపీ నాగరాజుతో కలిసి మాట్లాడారు. తిరుపతిలో చోటుచేసుకున్న తొక్కిసలాట ఘటన చాలా దురదృష్టకరమన్నారు. ప్రమాదం విషయం తెలుసుకున్న వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రులు ఆనం రామనారాయణరెడ్డి, అనిత, అనగాని సత్యప్రసాద్ తో పాటు పలువురు మంత్రులు ఘటనా స్థలానికి వెళ్లారన్నారు. బాధిత కుటుంబాలతో మాట్లాడి, అండగా నిలిచారన్నారు. ఇప్పటికే తొక్కిసలాటకు బాధ్యులుగా గుర్తించిన కొందరు అధికారులపై తమ ప్రభుత్వం చర్యలు తీసుకుందన్నారు. మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల చొప్పున్న నష్టపరిహారంతో పాటు కుటుంబంలోకి ఒకరికి కాంట్రాక్టు ఉద్యోగం కూడా ఇవ్వనున్నామన్నారు. తీవ్రంగా గాయపడిన క్షతగాత్రులకు రూ.5 లక్షలు, స్వల్పగాయాలైన వారికి రూ.2 లక్షలు అందించడంతో పాటు మొత్తం వైద్యం ప్రభుత్వమే భరిస్తుందని మంత్రి తెలిపారు. ప్రజల్లో కష్టాల్లో ఉన్నప్పుడు వారి వెంటే ఉంటూ, అన్ని విధాలా అండగా నిలుస్తూ.. సీఎం చంద్రబాబునాయుడు భరోసా ఇస్తుంటారన్నారు. విజయవాడలో కృష్ణానదికి వరదలు వచ్చిన సమయంలో బాధితులు కోలుకునే వరకు అక్కడి కలెక్టర్ కార్యాలయంలో ఓ బస్సులో పది రోజులపైగా సీఎం చంద్రబాబు బస చేసిన విషయాన్ని మంత్రి గుర్తు చేశారు. 

*జగన్ కు శవ రాజకీయాలు అలవాటే..*

తిరుపతిలో జరిగిన ఘటనపై రాష్ట్ర ప్రజలంతా తల్లడిల్లుతుంటే జగన్ మాత్రం శవ రాజకీయాలకు పాల్పడుతున్నారని మంత్రి సవిత మండిపడ్డారు. జగన్ అసమర్థ పాలనలో అన్నమయ్య డ్యామ్ కొట్టుకుపోయిన సందర్భంలో 30 మందికి పైగా అమాయకులు బలయ్యారన్నారు. వందల ఎకరాలు పంట నీటి మునిగాయన్నారు. గొర్రెలు, మేకలు, పశువులు వరదలో కొట్టుకుపోయి, రైతులకు ఎంతో నష్టాన్ని మిగిల్చాయన్నారు. ఆ దుర్ఘటన సమయంలో బాధితులను జగన్ పరామర్శించలేదని, బాధిత కుటుంబాలను పట్టించుకోలేదని మండిపడ్డారు. దెయ్యాలు వేదాలు వల్లించినట్లు తిరుపతి ఘటనపై జగన్ మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. బాబాయ్ కి గొడ్డలి పోటు, కోడికత్తి, గులకరాయి ఘటనలతో రాజకీయాలు జగన్ అలవాటైందన్నారు. సీఎం చంద్రబాబు గురించి మాట్లాడే అర్హత జగన్ కు లేదని మంత్రి స్పష్టం చేశారు. గడిచిన అయిదేళ్లలో ఎన్నో హింసాత్మక ఘటనలు రాష్ట్రంలో చోటుచేసుకున్నాయని, వాటన్నింటికీ జగనే మొదటి ముద్దాయి అని అన్నారు. జగన్, ఆయన పార్టీ నేతలు శవ రాజకీయాలు పక్కనబెట్టి, బాధితులకు సాయం చేయాలని హితవు పలికారు. 

*అభివృద్ధిని చూసి ఓర్వలేకే…*

రాష్ట్రంలో సంక్షేమ, అభివృద్ధిని సీఎం చంద్రబాబునాయుడు పరుగులు పెట్టిస్తున్నారని మంత్రి సవిత తెలిపారు. రాజధాని అమరావతి, పోలవరం నిర్మాణ పనులకు పున:ప్రారంభమయ్యాయన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నామని తెలిపారు. ఇది ఓర్వలేకే సీఎం చంద్రబాబుపైనా, తమ ప్రభుత్వంపైనా వైసీపీ నాయకులు, జగన్ అవాకులు చవాకులు పేలుతున్నారన్నారు. 6 నెలలో కాలంలో తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎన్నో మార్పులు చేపట్టామన్నారు. రాష్ట్ర మంతటా అన్ని ప్రాంతాల్లోనూ పరిశ్రమలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. రాజధాని సహా అన్ని ప్రాంతాలను అభివద్ధి చేయనున్నామన్నారు. కర్నూలులో మూతపడిన రెండు బీసీ హాస్టళ్ల పునరుద్ధరణకు చర్యలు తీసుకుంటామని మంత్రి వెల్లడించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కురుబ కార్పొరేషన్ చైర్మన్ దేవేంద్రప్ప సహా పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version