
విజయవాడ ఉత్సవ్–2.0 ప్రజలందరి పండుగ.. దసరా అంటేనే విజయవాడ గుర్తుకొచ్చేలా వేడుకలు:కేశినేని జానకి లక్ష్మి
సిద్ధార్థ హోటల్ మేనేజ్‌మెంట్ కళాశాలలో ఉత్సవ్ ఏర్పాట్ల పరిశీలన – కార్యక్రమాల బ్రోచర్ విడుదల
విజయవాడ:( సిద్ధార్థ హోటల్ మేనేజ్మెంట్ కాలేజ్) విజయవాడ ఉత్సవ్–2.0లో భాగంగా విజయవాడ తూర్పు నియోజకవర్గంలోని సిద్ధార్థ హోటల్ మేనేజ్‌మెంట్ కళాశాలలో ఏర్పాటు చేస్తున్న కార్యక్రమాలను విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) సతీమణి జానకి లక్ష్మి పరిశీలించారు. ఈ సందర్భంగా ఉత్సవ్‌లో నిర్వహించనున్న కార్యక్రమాలకు సంబంధించిన బ్రోచర్‌ను ఆమె విడుదల చేశారు.
ఈ సందర్భంగా జానకి లక్ష్మి మాట్లాడుతూ.. ఈ ఏడాది విజయవాడ ఉత్సవ్–2.0ను గతంలో కంటే మరింత ఘనంగా నిర్వహించేందుకు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రులు, భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వంటి ప్రముఖులు ఈ వేడుకల్లో పాల్గొనేలా కార్యక్రమాలను రూపొందించడం విజయవాడకు గర్వకారణమని పేర్కొన్నారు.
విజయవాడకు ఉన్న చారిత్రక, సాంస్కృతిక, ఆధ్యాత్మిక ప్రాధాన్యతను దేశవ్యాప్తంగా చాటిచెప్పాలనే సంకల్పంతో విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) గత ఏడాది విజయవాడ ఉత్సవ్‌కు శ్రీకారం చుట్టారని తెలిపారు. దసరా పండుగ అనగానే దేశవ్యాప్తంగా విజయవాడ గుర్తుకొచ్చేలా ఈ ఏడాది ఉత్సవాలను మరింత వైభవంగా నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు చెప్పారు.
విజయవాడ ఉత్సవ్‌లో భాగంగా తుమ్మలపల్లి కళాక్షేత్రంలో 100కు పైగా పోటీలు, ఏడు విభాగాల్లో టైటిల్ పోటీలు నిర్వహిస్తున్నామని వెల్లడించారు. ప్రతిరోజూ వందలాది మంది ఔత్సాహికులు ఈ పోటీల్లో పాల్గొంటూ తమ ప్రతిభను చాటుకుంటున్నారని పేర్కొన్నారు. నగరంలోని విద్యార్థులు, యువత, మహిళలు, కళాకారుల్లో ఉన్న ప్రతిభను వెలికితీయడంతో పాటు, కళలు మరియు సంస్కృతికి ప్రోత్సాహం అందించడం ఈ కార్యక్రమాల ప్రధాన ఉద్దేశమని వివరించారు.
“మనం ఇంట్లో జరుపుకుంటే అది పండుగ.. అందరం కలిసి జరుపుకుంటే అది ఉత్సవం” అని జానకి లక్ష్మి పేర్కొన్నారు. విజయవాడ ఉత్సవ్ అనేది ఒక సంస్థకో, కొందరికో పరిమితమైన వేడుక కాదని, నగర ప్రజలందరూ తమ సొంత పండుగగా భావించి పాల్గొనాల్సిన ప్రజా ఉత్సవమని అన్నారు.
దసరా శరన్నవరాత్రుల సందర్భంగా అమ్మవారి దర్శనం కోసం విజయవాడకు వచ్చే లక్షలాది భక్తులు, పర్యాటకులు విజయవాడ ఉత్సవ్‌లోనూ భాగస్వాములు కావాలనే లక్ష్యంతో కార్యక్రమాలను రూపొందించినట్లు తెలిపారు. పగటిపూట అమ్మవారి దర్శనం, ఆధ్యాత్మిక కార్యక్రమాలతో పాటు సాయంత్రం వేళల్లో సాంస్కృతిక ప్రదర్శనలు, వినోద కార్యక్రమాల ద్వారా సందర్శకులకు మరపురాని అనుభూతిని అందించడమే ఉత్సవ్ లక్ష్యమని వివరించారు.
విజయవాడ ఆధ్యాత్మిక వైభవంతో పాటు కళా, సాంస్కృతిక, పర్యాటక కేంద్రంగా దేశవ్యాప్తంగా మరింత గుర్తింపు పొందేందుకు విజయవాడ ఉత్సవ్–2.0 దోహదపడుతుందని జానకి లక్ష్మి ఆశాభావం వ్యక్తం చేశారు. నగర ప్రజలందరూ ఈ వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొని విజయవాడ ఉత్సవ్‌ను విజయవంతం చేయాలని ఆమె పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో సి ఏ సుంకర అక్కయ్య నాయుడు డాక్టర్ చదలవాడ సుధా నాగేశ్వరరావు వైస్ చైర్మన్ అడ్వకేట్ వైట్ల కృష్ణ ప్రసన్న తొండెపు హనుమంతరావు తొండెపు ప్రసాద్ గుప్తా వీరభట్ల విష్ణువర్ధన్ చెన్నుపాటి ఉషారాణి తదితరులు పాల్గొన్నారు
![]()
