
పర్యాటకంగా ఏపీని నంబర్-1 దిశగా నడిపిస్తున్న పర్యాటక మంత్రి కందుల దుర్గేష్
పర్యాటక ప్రాంతాల్లో మంత్రి కందుల దుర్గేష్ మార్క్ అభివృద్ధి..క్షేత్రస్థాయి పర్యవేక్షణతో పర్యాటకరంగం పరుగులు..వేగంగా పూర్తికావస్తున్న 8 బృహత్తర పర్యాటక ప్రాజెక్టులు
రాష్ట్రవ్యాప్తంగా పర్యాటక ప్రాంతాల్లో శరవేగంగా అభివృద్ధి పనులు..రూ. 428 కోట్లతో నవ్యాంధ్రకు నూతన శోభ..మంత్రి దుర్గేష్ చొరవతో ఏపీ టూరిజం ఇప్పుడు నెక్స్ట్ లెవెల్
త్వరలోనే పనులు పూర్తి చేసి పర్యాటక ప్రాజెక్టులు ప్రారంభించేందుకు సన్నాహాలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రకృతి సౌందర్యానికి, ఆధ్యాత్మిక వైభవానికి, చారిత్రక ప్రాశస్త్యానికి నిలయం. అయితే, గత కొన్నేళ్లుగా సరైన మౌలిక వసతులు లేక వెనుకబడిన, కుదేలైన పర్యాటక రంగానికి కూటమి ప్రభుత్వంలో నూతనోత్తేజం వచ్చింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ల సమర్థవంతమైన నాయకత్వంలో కేంద్ర సహకారంతో పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తనదైన శైలి కార్యాచరణతో రాష్ట్ర పర్యాటక రంగాన్ని అభివృద్ధి పథంలో పరుగులు పెట్టిస్తున్నారు. కేవలం రెండేళ్ల వ్యవధిలోనే కేంద్ర ప్రభుత్వం నుండి రూ. 428 కోట్ల నిధులను రప్పించి 8 భారీ పర్యాటక ప్రాజెక్టులను వేగవంతంగా పూర్తి చేస్తూ రాష్ట్రంలో పర్యాటక విప్లవానికి శ్రీకారం చుట్టారు. నిరంతర క్షేత్రస్థాయి పరిశీలనలు, పర్యాటక శాఖ అధికారులకు దిశానిర్దేశంతో పనుల నాణ్యతను కాపాడుతూ ప్రాజెక్టులను త్వరలోనే ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. మంత్రి దుర్గేష్ ప్రత్యేక కృషితో పర్యాటక రంగానికి పారిశ్రామిక హోదా సాధించడం, నూతన పర్యాటక పాలసీతో ఇన్వెస్టర్లకు రాయితీలు కల్పించి రూ.20,000 కోట్ల పెట్టుబడులు సాధించడం తద్వారా పర్యాటక రంగ అభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్ జాతీయ స్థాయిలో 16వ స్థానం నుండి 13వ స్థానానికి మెరుగుపడింది. ఇవేగాక సీ ప్లేన్ సేవలు, క్యారవాన్ , క్రూయిజ్ టూరిజం,హోమ్‌స్టేలు, టెంట్ సిటీలు, హౌస్ బోట్స్, రాష్ట్రంలోని 100+ పర్యాటక ప్రాంతాలలో 130 కంటే ఎక్కువ భాషలలో సమాచారం అందించే ఉచిత QR కోడ్ డిజిటల్ గైడ్ సౌకర్యం, ఏడాదంతా పర్యాటక శోభ ఉండేలా పర్యాటక ఉత్సవాల నిర్వహణ తదితర వినూత్న ప్రక్రియలతో మంత్రి కందుల దుర్గేష్ ఏపీ పర్యాటక రంగంలో సరికొత్త విప్లవం తెచ్చారు.
వివరాల్లోకి వెళ్తే..
గోదావరి తీరానికి సరికొత్త శోభ..అఖండ గోదావరి పర్యాటక ప్రాజెక్టు పునరుద్ధరణ:
కేంద్ర ప్రభుత్వ శాస్కి (Special Assistance to States for Capital Investment) పథకం కింద రూ. 94.44 కోట్లతో మంత్రి దుర్గేష్ గోదావరి తీరాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. అత్యంత ఆకర్షణీయమైన డీపీఆర్‌లను రూపొందించి కేంద్రం నుండి నిధులు రాబట్టడంలో తనదైన మార్క్ చూపిన ఆయన.. ప్రజాప్రతినిధిగా తనను ఎన్నుకున్న నిడదవోలు నియోజకవర్గాన్ని ఈ ప్రాజెక్ట్‌లో అంతర్భాగం చేసుకుని అభివృద్ధి చేయడం విశేషం. ఈ నేపథ్యంలో చారిత్రాత్మక హేవలాక్ వంతెన పునరుద్ధరణలో భాగంగా వంతెనపై నడక మార్గం పనులు తుది దశకు చేరుకున్నాయి. స్పాన్ లపై థీమాటిక్ జోన్ల అభివృద్ధి జరుగుతోంది. రాజమహేంద్రవరంలో పుష్కర్ ఘాట్ అభివృద్ధి, కడియం నర్సరీలో అత్యాధునిక హంగులతో కూడిన’ఎక్స్ పీరియన్స్ సెంటర్’ త్వరలోనే అందుబాటులోకి రానున్నాయి..నిడదవోలు కోట సత్తెమ్మ ఆలయ గోపుర ఆధునికీకరణ, భక్తులకు వసతి కల్పన, శెట్టిపేట వద్ద వేసైడ్ రెస్టారెంట్,సుందరమైన పార్క్, గోదావరి కెనాల్‌లో బోటింగ్ సదుపాయాలు పూర్తికావచ్చాయి..
మంత్రి కందుల దుర్గేష్ ప్రత్యేక చొరవ, నిరంతర పర్యవేక్షణ కారణంగా అఖండ గోదావరి ప్రాజెక్ట్ రూపం సంతరించుకుని, ఉభయ గోదావరి జిల్లాల పర్యాటక రంగానికి ఒక మైలురాయిగా నిలవనుంది..
గండికోట కు గ్రాండ్ లుక్
‘భారతీయ గ్రాండ్ క్యాన్సన్’ గా ఖ్యాతిగాంచిన కడప జిల్లాలోని చారిత్రక గండికోటను అంతర్జాతీయ స్థాయి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దే బృహత్తర లక్ష్యంతో మంత్రి కందుల దుర్గేష్ అడుగులు వేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ శాస్కి పథకం కింద రూ. 77.91 కోట్లు వెచ్చించి పర్యాటకులు ప్రకృతి అందాలను ఆస్వాదించేందుకు వీలుగా 3 అద్భుతమైన వ్యూపాయింట్లు, హెరిటేజ్ వాక్, బోటింగ్ పాయింట్, అప్పర్ ట్రైల్, పర్యాటకుల కోసం ప్రత్యేక బోటింగ్ పాయింట్‌ను అందుబాటులోకి తేవడంతో పాటు, రాకపోకలకు ఇబ్బంది లేకుండా 3 విశాలమైన పార్కింగ్ ప్రాంగణాలు, పటిష్టమైన సీసీ, బీటీ రోడ్లను నిర్మించారు.పర్యాటకుల సౌకర్యార్థం ఓపెన్ ఎయిర్ థియేటర్, ఎమినిటీ బిల్డింగ్స్, పర్యాటక సమాచార కేంద్రం (VIC), కన్వీనియన్స్ భవనాలు ఇప్పటికే సిద్ధమయ్యాయి.
మంత్రి కందుల దుర్గేష్ చొరవతో గండికోట రూపురేఖలు పూర్తిగా మారుతుండగా.. పర్యాటకులకు మరిన్ని అధునాతన సౌకర్యాలు కల్పించేందుకు మిగిలిన అభివృద్ధి పనులు కూడా వేగంగా పురోగతిలో ఉన్నాయి..
ఆంధ్రాగోవాగా సూర్యలంక బీచ్ ..బాపట్ల తీరంలో పర్యాటక కాంతులు
బాపట్ల జిల్లాలోని ప్రసిద్ధ సూర్యలంక బీచ్‌ను రాష్ట్రంలోనే అత్యంత ఆకర్షణీయమైన సముద్ర తీరంగా తీర్చిదిద్దేందుకు మంత్రి దుర్గేష్ నేతృత్వంలో కూటమి ప్రభుత్వం సరికొత్త హంగులు అద్దింది. కేంద్ర ప్రభుత్వ ‘స్వదేశీ దర్శన్ 2.0’ పథకం కింద కేటాయించిన రూ. 97.52 కోట్ల భారీ నిధులతో సూర్యలంక బీచ్ రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. ఇప్పటికే ఆకట్టుకునే బీచ్ ముఖద్వారం , కొనుగోలుదారుల కోసం ప్రత్యేక షాపింగ్ స్ట్రీట్, సుందరమైన యాంపీ థియేటర్ పనులు పూర్తయ్యాయి.పర్యాటకులు హాయిగా సేదతీరేందుకు ‘విజిటర్ ఎక్స్‌పీరియన్స్ జోన్’తో పాటు లగ్జరీ రిసార్ట్ తరహా గదులు సిద్ధమయ్యాయి..సముద్ర తీరంలో సాహస పర్యాటకానికి ఊతమిస్తూ.. ప్రైవేట్ నిర్వాహకుల భాగస్వామ్యంతో హార్స్ రైడింగ్, బోటింగ్, స్కూబా డైవింగ్ వంటి క్రీడలను అందుబాటులోకి తెచ్చారు.మంత్రి కందుల దుర్గేష్ స్వయంగా క్షేత్రస్థాయికి వెళ్ళి ఈ సాహస క్రీడలను ప్రారంభించడమే కాకుండా, పనుల నాణ్యతను పరిశీలించారు. మంత్రి ప్రత్యేక చొరవతో సూర్యలంక బీచ్ ఇప్పుడు పర్యాటకులను కనువిందు చేస్తూ, “ఆంధ్రా గోవా”గా ప్రాచుర్యం పొందుతోంది..ఇటీవల సినీనటుడు శ్రీకాంత్ సైతం చీరాల, బాపట్ల బీచ్ తీరాల్లో ఫ్యామిలీతో గడిపిన క్షణాలను, అందమైన బీచ్ అనుభవాలను ఇన్ స్టాగ్రామ్ లో పంచుకున్నారు..
ప్రసాద్, సీబీడీడీ స్కీమ్‌లతో ఆధ్యాత్మిక క్షేత్రాలకు మహర్దశ
కేంద్ర ప్రభుత్వ ప్రఖ్యాత ‘ప్రసాద్’ (Pilgrimage Rejuvenation and Spiritual Augmentation Drive), ‘ఛాలెంజ్ బేస్డ్ డెస్టినేషన్ డెవలప్ మెంట్’ (CBDD) పథకాలను సద్వినియోగం చేసుకుంటూ.. రాష్ట్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాల రూపురేఖలను పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ పూర్తిగా మారుస్తున్నారు. భక్తులకు మెరుగైన వసతులు, అత్యాధునిక సౌకర్యాలు కల్పిస్తున్నారు.
ప్రసాద్ స్కీమ్ క్రింద సింహాచలం క్షేత్రంలో రూ.54.04 కోట్లతో అప్ హిల్, డౌన్ హిల్ ప్రాంతాలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు.భక్తుల సౌకర్యార్థం వీధి దీపాలు, పాత్‌వే లైట్లు, సోలార్ స్టేషన్, కిచెన్ పరికరాలు, సైనేజ్‌లు, డస్ట్ బిన్‌లు ఏర్పాటు చేయడంతో పాటు పర్యావరణ హితంగా ఈవీ ఛార్జింగ్ స్టేషన్లు, ఈవీ బస్సులను అందుబాటులోకి తెచ్చారు. ఈ పనులన్నీ ఇప్పటికే పూర్తయ్యాయి.
అన్నవరం దేవస్థానంలో భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రసాద్ స్కీమ్ కింద రూ. 25.32 కోట్లతో నూతన అన్నదానం భవనం, విశాలమైన క్యూ కాంప్లెక్స్, వాష్ రూమ్స్, బట్టలు మార్చుకునే గదులు, 0.5 MLD సామర్థ్యం గల STP, రిటైనింగ్ వాల్ మరియు భక్తుల సౌకర్యార్థం ఈవీ వెహికల్స్ ఛార్జింగ్ స్టేషన్, ఈ వెహికిల్స్ ఏర్పాటు చేస్తున్నారు.ఆయా పనులు శరవేగంగా జరుగుతున్నాయి.
సీబీడీడీ పథకం కింద మంత్రి దుర్గేష్ అహోబిలం క్షేత్రాన్ని ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా మారుస్తున్నారు. ఇందులో భాగంగా రూ. 24.96 కోట్లతో నూతన మ్యూజియం ఏర్పాటు, సన్నిధి స్ట్రీట్ సుందరీకరణ, అత్యాధునిక టాయిలెట్ బ్లాకులు, విశాలమైన పార్కింగ్ ప్రాంగణం, షాపింగ్ కాంప్లెక్స్‌ల నిర్మాణాలు ఇప్పటికే పూర్తిగా పూర్తయ్యాయి.
ఆధ్యాత్మిక పర్యాటకాన్ని ప్రోత్సహిస్తూ, భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా మంత్రి కందుల దుర్గేష్ పర్యవేక్షణలో ఈ ప్రాజెక్టులన్నీ విజయవంతంగా రూపుదిద్దుకుంటున్నాయి..
నాగార్జున సాగర్ బౌద్ధ సర్క్యూట్..అంతర్జాతీయ బౌద్ధ పర్యాటక కేంద్రంగా రూపాంతరం
చారిత్రక, ఆధ్యాత్మిక కేంద్రమైన నాగార్జున సాగర్‌లోని బౌద్ధ సర్క్యూట్‌ను ప్రపంచ స్థాయి బౌద్ధ పర్యాటక ధామంగా తీర్చిదిద్దేందుకు కూటమి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యతనిచ్చింది. చాలెంజ్ బేస్డ్ డెస్టినేషన్ డెవలప్‌మెంట్ పథకం కింద కేటాయించిన రూ. 25 కోట్ల నిధులతో నాగార్జునకొండలో బౌద్ధ వారసత్వాన్ని ప్రతిబింబించేలా అద్భుతమైన నిర్మాణాలను చేపట్టారు.మంత్రి దుర్గేష్ నేతృత్వంలో స్పిరిచువల్ సెంటర్, బుద్ధుడి జీవిత ప్రస్థానం, ఆయన ప్రబోధించిన ‘అష్టాంగ మార్గాల’ ప్రాశస్త్యాన్ని సందర్శకులకు కళ్ళకు కట్టినట్లు వివరించే ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. పర్యాటకులు, ఉపాసకులు సేదతీరేందుకు మరియు ధ్యానం చేసుకునేందుకు ప్రత్యేక ధ్యాన మందిరం, ప్రశాంతమైన లాంజ్‌లు, సుందరమైన పార్క్, రెస్టారెంట్ సిద్ధమయ్యాయి.
పర్యాటక శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నాటి నుండి నాగార్జున సాగర్ బౌద్ధ సర్క్యూట్ ప్రాముఖ్యతను గుర్తించిన మంత్రి కందుల దుర్గేష్.. నిధుల మంజూరు నుండి పనుల నిర్వహణ వరకు ప్రతి దశలోనూ కీలక పాత్ర పోషించారు.ర్మాణ పనులు బౌద్ధ సంస్కృతి, చారిత్రక ప్రాశస్త్యం దెబ్బతినకుండా అంతర్జాతీయ ప్రమాణాలతో సాగేలా అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇస్తూ, స్వయంగా పనుల పురోగతిని పర్యవేక్షించారు.శ విదేశాల నుండి, ముఖ్యంగా ఆగ్నేయాసియా దేశాల నుండి వచ్చే బౌద్ధ యాత్రికులను ఆకర్షించేలా నాగార్జున సాగర్‌ను ప్రముఖ ‘గ్లోబల్ బుద్ధిస్ట్ డెస్టినేషన్’గా మార్చడమే లక్ష్యంగా మంత్రి దుర్గేష్ ఈ ప్రాజెక్ట్‌ను వేగవంతంగా పూర్తి చేయించారు..
మన్యంలో మైమరిపించే పర్యాటకం…లంబసింగి,బొర్రా గుహలకు సరికొత్త లుక్
ప్రకృతి అందాలకు నిలయమైన మన్యసీమను దేశంలోనే ప్రముఖ పర్యాటక కేంద్రంగా మార్చేందుకు మంత్రి దుర్గేష్ ప్రత్యేక దృష్టి సారించారు. ఈ క్రమంలో ఆంధ్రా కశ్మీర్ గా పేరొందిన లంబసింగి లో పర్యాటకులను ఆకట్టుకునేలా ఒక్కోటి 300 చ.అడుగుల విస్తీర్ణంలో 15 జియోడెసిక్ గ్లాంపింగ్ కాటేజీలు (డోమ్ తరహా టెంట్లు), లంబసింగి మంచు అందాలను సరికొత్తగా ఆస్వాదించేందుకు పర్యాటకుల కోసం పర్యావరణ హితమైన లగ్జరీ వసతులను అందుబాటులోకి తెచ్చారు..అంతర్గత సీసీ రోడ్లు, డ్రైన్లు, స్ట్రీట్ లైట్స్, ఈవీ బగ్గీలు, ఈవీ స్టేషన్లు రూపుదిద్దుకున్నాయి.
స్వదేశీ దర్శన్ 2.0 క్రింద బొర్రా గుహల అభివృద్ధికి రూ. 29.87 కోట్లు మంజూరు కాగా ..
పర్యాటకులకు విభిన్న అనుభూతిని అందించేందుకు, గుహల శతాబ్దాల నాటి చరిత్రను కళ్ళకు కట్టేలా 3D ప్రొజెక్షన్ మ్యాపింగ్, పర్యాటకులకు సరికొత్త దృశ్యానుభూతిని అందించేలా రంగులు మారే లేజర్ లైటింగ్ ఏర్పాటు చేశారు. పర్యాటకుల కోసం క్లాక్ రూమ్, కేవ్స్ ఆర్చ్, ఏవీ రూమ్, కేవ్స్ ఎంట్రీ వద్ద రెయిన్ షెడ్ , అరకు కాఫీ రుచులను ఆస్వాదించేందుకు కాఫీ టేస్టింగ్ సెంటర్లు సిద్ధమయ్యాయి.
మన్యసీమ పర్యాటక సామర్థ్యాన్ని గుర్తించిన మంత్రి కందుల దుర్గేష్ స్థానిక గిరిజనులకు ఉపాధి అవకాశాలు పెంచేలా ప్రాజెక్టులను వేగవంతం చేశారు.సాధారణ కాటేజీలకే పరిమితం కాకుండా నేటితరం పర్యాటకులను ఆకట్టుకునే ‘గ్లాంపింగ్ డోమ్స్’, ‘3D ప్రొజెక్షన్’ వంటి అంతర్జాతీయ స్థాయి టెక్నాలజీని ఏపీ పర్యాటకరంగంలోకి ప్రవేశపెట్టడంలో కీలక పాత్ర పోషించారు.నిధుల సమర్థవంతమైన వినియోగం, పనుల్లో నాణ్యత, గడువులోగా ప్రాజెక్టులను పూర్తి చేయడమే లక్ష్యంగా అధికారులతో నిరంతర సమీక్షలు నిర్వహిస్తూ పనులను పరుగులు తీస్తున్నారు.
విజనరీ లీడర్‌షిప్ కు కేరాఫ్ అడ్రస్ అయిన సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మార్గదర్శకంలో రూ. 428 కోట్ల కేంద్ర నిధులను పూర్తిస్థాయిలో వినియోగించుకోవడంలో మంత్రి దుర్గేస్ సక్సెస్ అయ్యారు..ఆఫీసులకే పరిమితం కాకుండా స్వయంగా క్షేత్రస్థాయికి వెళ్లి పనుల నాణ్యతను, వేగాన్ని తనిఖీ చేస్తున్నారు. పర్యాటక శాఖ అధికారులను, సిబ్బందిని సమన్వయం చేసుకుంటూ ఇచ్చిన మాట ప్రకారం రాష్ట్రంలోని పర్యాటక ప్రాంతాలలో సర్వాంగ సుందరమైన వసతులను కల్పిస్తూ, పర్యాటక రంగాన్ని ఆదాయ వనరుగా మాత్రమే కాకుండా రాష్ట్ర ప్రతిష్ఠకు ప్రతీకగా తీర్చిదిద్దుతున్నారు..ఇవేగాక రాష్ట్రవ్యాప్తంగా ప్రతి జిల్లాలో అనేక పర్యాటక ప్రాంతాలు అభివృద్ధి జరుగుతున్నాయి.. అతి త్వరలోనే ఈ భారీ ప్రాజెక్టులన్నీ పర్యాటకులకు అందుబాటులోకి రానుండటంతో ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగం నూతన శకంలోకి అడుగుపెట్టబోతోందనడంలో అతిశయోక్తి లేదు..
![]()
