ఇంద్రకీలాద్రిపై శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్లను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

Spread the love

ఇంద్రకీలాద్రిపై శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్లను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

విజయవాడ (ఇంద్రకీలాద్రి) | అక్టోబర్ 14, 2026.

విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానాన్ని భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బుధవారం సందర్శించి, శ్రీ మహా చండీదేవి అలంకృత కనకదుర్గమ్మవారిని దర్శించుకున్నారు. రాష్ట్రపతిగా విజయవాడకు విచ్చేసిన ఆమెకు రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత, విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని), దుర్గగుడి చైర్మన్ బొర్రా రాధాకృష్ణ ఘనంగా స్వాగతం పలికారు. ఆలయానికి చేరుకున్న రాష్ట్రపతి భక్తులకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు. క్యూలైన్లలో వేచి ఉన్న భక్తులకు సైతం అభివాదం చేస్తూ ఆలయంలోకి ప్రవేశించారు. ఆలయ అర్చక స్వాములు, వేద పండితులు సంప్రదాయ ఆలయ మర్యాదలతో రాష్ట్రపతికి స్వాగతం పలికారు. అనంతరం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అంతరాలయంలోకి వెళ్లి శ్రీ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారి ఆలయాన్ని పుష్పాలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. రాష్ట్రపతి సుమారు 8 నిమిషాల పాటు అంతరాలయంలో అమ్మవారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం ఆశీర్వచన మండపంలో వేద పండితులు రాష్ట్రపతికి వేదాశీస్సులు, ప్రసాదాలు అందజేశారు. దేవస్థానం ఈవో వీకే శీనానాయక్ అమ్మవారి చిత్రపటాన్ని బహూకరించగా, రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత శేష వస్త్రాలను రాష్ట్రపతికి అందజేశారు.ఈ కార్యక్రమంలో దేవాదాయశాఖ కార్యదర్శి కే. కన్నబాబు, కమిషనర్ కే. రామచంద్రమోహన్ తదితరులు పాల్గొన్నారు.

Loading