డేటా సెంటర్ల ఏర్పాటుకు ఏపీ అనుకూలం

1
0

డేటా సెంటర్ల ఏర్పాటుకు ఏపీ అనుకూలం

అమరావతి క్వాంటం వ్యాలీ ప్రయోజనాలు అందుకోండి

సింగపూర్ లోని పారిశ్రామికవేత్తల రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు

సింగపూర్, జూలై 29 : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డేటా సెంటర్ల ఏర్పాటుకు అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. ప్రత్యేకించి విశాఖలో దీనికి అవసరమైన ఎకో సిస్టం ఏర్పాటు చేసినట్టు వెల్లడించారు. సింగపూర్ లో మూడోరోజు పర్యటిస్తున్న సీఎం ఆ దేశ పారిశ్రామికవేత్తలు, కంపెనీల ప్రతినిధులతో రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కాన్ఫరెన్స్‌కు సింగపూర్‌లోని ప్రముఖ కంపెనీల సీఈఓలు, ప్రతినిధులు హాజరయ్యారు. మొత్తం 41 కంపెనీలకు చెందిన ప్రతినిధులు ఈ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సుకు హాజరై తమ అభిప్రాయాలను తెలియచేశారు. డేటా సెంటర్లు, ఐటీ కంపెనీల ఏర్పాటుకు విశాఖ అత్యుత్తమ ప్రదేశమని ముఖ్యమంత్రి తెలిపారు. త్వరలోనే గూగుల్ డేటా సెంటర్ విశాఖలో ఏర్పాటు కానుందని ముఖ్యమంత్రి సింగపూర్ పారిశ్రామిక వేత్తలకు తెలియచేశారు. అలాగే టీసీఎస్, కాగ్నిజెంట్ సహా వివిధ ఐటీ దిగ్గజ సంస్థలు విశాఖలో తమ సంస్థలను ఏర్పాటు చేస్తున్నాయని వివరించారు. అలాగే దేశంలోనే తొలి క్వాంటం వ్యాలీ అమరావతిలో ఏర్పాటు చేస్తున్నామని.. 2026 జనవరి నాటికి ప్రారంభమయ్యే క్వాంటం వ్యాలీ ఎకో సిస్టంలో సింగపూర్ కంపెనీలు పెట్టుబడులు పెట్టేందుకు అవకాశముందని సీఎం చంద్రబాబు తెలిపారు. ఈ క్వాంటం వ్యాలీ ప్రాజెక్టు ప్రయోజనాలను సింగపూర్ కంపెనీలు పొందటంతో పాటు పరిశోధనలకూ ఆస్కారం ఉందని ముఖ్యమంత్రి సింగపూర్ పారిశ్రామిక వేత్తలకు వివరించారు. ప్రస్తుతం రాష్ట్రంలో పరిశ్రమలు, పెట్టుబడులకు అనుకూలంగా 20కి పైగా పాలసీలను అమలు చేస్తున్నామని సీఎం వెల్లడించారు. పారిశ్రామిక అనుకూల విధానాలతో పాటు పెట్టుబడులకు ఉన్న అవకాశాలను రౌండ్ టేబుల్ వేదికగా ముఖ్యమంత్రి సింగపూర్ పారిశ్రామిక వేత్తలు, వివిధ సంస్థల ప్రతినిధులకు వివరించారు. ఈ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సుకు మంత్రులు నారా లోకేష్, టీజీ భరత్, పి.నారాయణ, ఏపీ ఉన్నతాధికారులు హాజరయ్యారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here