ఎన్‌టీఆర్ జిల్లా, జులై 19, 2025
ప్రగతి సూచికల లక్ష్యాల సాధనకు కృషిచేయండి..
- పురోగతి వివరాలను ఎప్పటికప్పుడు స్వర్ణాంధ్ర వెబ్‌సైట్లో అప్‌లోడ్ చేయండి
- మనిషి మనుగడకు కీలకమైన నీటి వనరుల పరిరక్షణకు ప్రాధాన్యమివ్వాలి
- భూగర్భ జలాలను విచ్చలవిడిగా వినియోగించకుండా అవగాహన కల్పించాలి
- స్వయం సహాయ సంఘాల రుణాల మంజూరుతో పాటు సద్వినియోగమూ కీలకమే
- జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ
స్వర్ణాంధ్ర విజన్ @ 2047 లక్ష్యాలకు అనుగుణంగా జిల్లా, నియోజకవర్గాల వారీగా దార్శనిక ప్రణాళికల రూపకల్పన జరిగిందని, శాఖల వారీగా కీలక పురోగతి సూచికలు (కేపీఐ)లపై ప్రత్యేకంగా దృష్టిసారించాలని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ ఆదేశించారు.
శనివారం కలెక్టర్ లక్ష్మీశ.. గ్రామీణ నీటి సరఫరా, భూగర్భ జలాలు, ఇరిగేషన్, సెర్ప్, మార్కెటింగ్, రవాణా శాఖల అధికారులతో స్వర్ణాంధ్ర విజన్ – కీలక ప్రగతి సూచికలు (కేపీఐ)పై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా స్థూల ఉత్పత్తి (జీడీడీపీ), స్థూల విలువ జోడింపు (జీవీఏ) పెంపు లక్ష్యాలకు అనుగుణంగా శాఖల వారీగా నిర్దేశించుకున్న లక్ష్యాల సాధనకు అధికారులు, క్షేత్రస్థాయి సిబ్బంది సమష్టిగా, సమన్వయంతో పనిచేయాలన్నారు. ఈ సూచికల్లో ప్రగతి మొత్తం జిల్లా అభివృద్ధికి దోహదపడుతుందని వివరించారు. ప్రగతి సూచికల్లో పురోగతిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించడం జరుగుతుందని పేర్కొన్నారు. 30 శాఖలకు సంబంధించి 523 కీలక ప్రగతి సూచికలు ఉన్నాయని.. మార్కెటింగ్‌కు సంబంధించి రెండు సూచికలు అయిన మార్కెట్ ఫీజు, ఈ-నామ్ వాణిజ్య విలువ పెంపుపై దృష్టిసారించాల్సిన అవసరముందన్నారు. అదేవిధంగా గ్రౌండ్ వాటర్ డిపార్టుమెంట్‌కు సంబంధించిన సూచికలపై మాట్లాడుతూ మనిషి మనుగడకు, ఆర్థికాభివృద్ధికి నీటి వనరుల పరిరక్షణ కీలకమని ఈ నేపథ్యంలో భూగర్భ జలాలపెంపుపై ప్రత్యేకంగా దృష్టిసారించాలని, విచ్చలవిడి వినియోగానికి కళ్లెం వేయాల్సిన అవసరముందన్నారు. రైతుల అవసరాలకు అనుగుణంగా ఆయకట్టు స్థిరీకరణతో పాటు నీటిని పొదుపుగా వినియోగించుకుంటూ అధిక ఆదాయం వచ్చే పంటలు దిశగా ప్రోత్సహించాల్సిన అవసరముందన్నారు. భూగర్భజల శాఖకు సంబంధించి రెండు, నీటి వనరుల నిర్వహణకు సంబంధించి అయిదు సూచికలు ఉన్నాయన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు సురక్షితమైన తాగునీరు అందించే వ్యవస్థలపై పటిష్ట పర్యవేక్షణ అవసరమని, మార్గదర్శకాలకు అనుగుణంగా నీటి వనరుల (వాటర్ సోర్సుల) వద్ద ఎప్పటికప్పుడు పరీక్షలు నిర్వహించాలని ఆదేశించారు. గ్రామీణ పేదరిక నిర్మూలనకు సంబంధించి స్వయం సహాయక సంఘాలకు సకాలంలో బ్యాంకు రుణాలు మంజూరయ్యేలా చూడాలని, ఆ రుణాలను సద్వినియోగం చేసుకుంటూ ఆర్థిక సాధికారత దిశగా ప్రోత్సహించాలన్నారు. ప్రతి శాఖా నిర్దేశించిన గడువులోగా ప్రగతి సూచికల్లో సాధించిన పురోగతిని స్వర్ణాంధ్ర వెబ్‌సైట్లో అప్‌లోడ్ చేయాల్సిన అవసరముందని కలెక్టర్ లక్ష్మీశ సూచించారు. సమావేశంలో సీపీవో వై.శ్రీలత, డీఆర్‌డీఏ పీడీ ఏఎన్‌వీ నాంచారరావు, మార్కెటింగ్ ఏడీ రాజబాబు తదితరులు పాల్గొన్నారు.