కొండపల్లి సంప్రదాయ చెక్కబొమ్మల కళకు పూర్వవైభవం తీసుకురావడంతో పాటు కళాకారులకు మెరుగైన ఉపాధి

Spread the love

కొండపల్లి సంప్రదాయ చెక్కబొమ్మల కళకు పూర్వవైభవం తీసుకురావడంతో పాటు కళాకారులకు మెరుగైన ఉపాధి, ఆదాయ అవకాశాలు కల్పించేందుకు ప్రత్యేక కార్యాచరణతో ముందుకెళ్తున్న‌ట్లు జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ తెలిపారు. నీతి ఆయోగ్ ఆకాంక్షిత బ్లాకుల కార్యక్రమం (ఏబీపీ) కింద ఇటీవ‌ల కొండపల్లి బొమ్మల పునరుజ్జీవనం, ప్రోత్సాహానికి రూ.20 లక్షల ప్రాజెక్టుకు ఆమోదం లభించడం ఈ దిశగా కీలక ముందడుగన్నారు. బుధవారం కొండపల్లి ఎక్స్‌పీరియన్స్ సెంటర్‌ను సందర్శించిన కలెక్టర్… బొమ్మల తయారీ ప్రక్రియ, కళాకారుల నైపుణ్యాలు, సంప్రదాయ కళ పరిరక్షణకు చేపట్టాల్సిన చర్యలను పరిశీలించారు. సొసైటీ ప్ర‌తినిధుల‌తో స‌మావేశ‌మ‌య్యారు. ఈ సంద‌ర్భంగా క‌లెక్ట‌ర్ మాట్లాడుతూ నీతి ఆయోగ్ ప్రాజెక్టు ద్వారా కొండపల్లి బొమ్మల తయారీపై ఆధారపడిన 420 మంది కళాకారులకు ప్రయోజనం చేకూరనుందని పేర్కొన్నారు. సంప్రదాయ కళను పరిరక్షించడంతో పాటు, కళాకారుల నైపుణ్యాలను ఆధునిక మార్కెట్ అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దేందుకు శిక్షణ అందించనున్నట్లు తెలిపారు. కొండపల్లి బొమ్మలకు ప్రత్యేక బ్రాండింగ్, పర్యావరణహిత ప్యాకేజింగ్, డిజిటల్ మార్కెటింగ్, ఆన్‌లైన్ విక్రయాలు, మెరుగైన మార్కెట్ అనుసంధానం ద్వారా దేశవ్యాప్తంగా గుర్తింపు కల్పించి కళాకారుల ఆదాయాన్ని పెంపొందించేందుకు చర్యలు చేపడతామని కలెక్టర్ తెలిపారు. ఈ సంద‌ర్శ‌న‌లో జిల్లా ప‌ర్యాట‌క అధికారి డా. కొల్లేటి ర‌మేష్ త‌దిత‌రులు ఉన్నారు.

Loading