
నిత్యావసరాల ధరల భారం ప్రజలపై పడకూడదు
500 కేంద్రాలకు ధరణి బియ్యం విక్రయాల విస్తరణ
డిసెంబర్ మొదటి వారం నుంచి రేషన్ దుకాణాల ద్వారా కందిపప్పు, పామాయిల్ సరఫరా
డిమాండ్ ఉన్న పంటల సాగుకు ప్రోత్సాహం
నిత్యావసరాలు బ్లాక్ మార్కెట్‌కు తరలకుండా కఠిన చర్యలు
-ధరల నియంత్రణపై సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు
ప్రభుత్వ చర్యలతో బియ్యం, ఉల్లి, పామాయిల్ ధరలు తగ్గాయని తెలిపిన అధికారులు
అమరావతి, నవంబర్ 25:- నిత్యావసర వస్తువుల ధరల భారం సామాన్య ప్రజలపై ఏమాత్రం పడకూడదని, ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో ప్రజలకు ఊరట కలగాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. వినియోగదారుడిని ఆదుకోవడమే ప్రభుత్వ ప్రథమ బాధ్యత అని పేర్కొన్నారు. సచివాలయంలో బుధవారం నిత్యావసరాల ధరల నియంత్రణపై సీఎం చంద్రబాబు సమీక్షించారు. రానున్న ఏడాదిన్నర పాటు నిరంతరం మార్కెట్ ధరలను, ద్రవ్యోల్బణాన్ని బేరీజు వేస్తూ అప్రమత్తంగా వ్యవహరించాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వం చేపట్టిన ధరల నియంత్రణ చర్యలతో మార్కెట్లో సానుకూల ఫలితాలు కనిపిస్తున్నాయని అధికారులు సీఎంకు వివరించారు. గత నెలతో పోలిస్తే రాష్ట్రంలో నాలుగు వెరైటీల బియ్యం ధరలు 8 నుంచి 18 శాతం వరకు తగ్గాయని తెలిపారు. బహిరంగ మార్కెట్లో జై శ్రీరామ్ బియ్యం కిలో రూ.79–82, HMT/RNR రూ.72–76, BPT రూ.64–66, సాధారణ బియ్యం రూ.46–48కు అందుబాటులోకి వచ్చాయని తెలిపారు. బియ్యం విక్రయాల విషయంలో ప్రభుత్వం ధరల పట్టికను ప్రకటించడంతోపాటు… బ్లాక్ మార్కెట్‌కు తరలకుండా బియ్యం నిల్వలపై నిరంతర నిఘా పెట్టామని అధికారులు తెలిపారు. అలాగే ఉల్లి ధర 28 శాతం మేర తగ్గిందని చెప్పారు. పామాయిల్ ధరలు కూడా 5 శాతం తగ్గి లీటరు రూ.145కు చేరిందని అధికారులు వెల్లడించారు. అయితే కందిపప్పు ధరల్లో ఇంకా పెరుగుదల కన్పిస్తోందని చెప్పారు. రేషన్ ద్వారా కందిపప్పు… పామాయిల్‌ను ఎప్పటి నుంచి సరఫరా చేస్తారని సీఎం చంద్రబాబు అధికారులను అడిగారు. రేషన్ దుకాణాల ద్వారా అందించే దిశగా చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలపడంతో… జాప్యం కావడానికి వీల్లేదని… డిసెంబర్ మొదటి వారం నుంచి రేషన్ దుకాణాల ద్వారా కిలో రూ.100కే వినియోగదారులకు అందించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. అలాగే టెండర్ల ద్వారా సేకరించిన ఫోర్టిఫైడ్ పామాయిల్‌ను డిసెంబర్ మొదటి వారం నుంచి రేషన్ దుకాణాల్లో లీటరు రూ.125కే పంపిణీ చేయాలని స్పష్టం చేశారు. ఇక కందిపప్పు ధరను ఇంకా అదుపులోకి తీసుకొచ్చేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి కేటాయించిన 40,300 మెట్రిక్ టన్నుల కందులను సరఫరా చేయడంతోపాటు… రాష్ట్రంలో కందిపప్పు ఉత్పత్తి, వినియోగం మధ్య ఉన్న వ్యత్యాసాన్ని తగ్గించేలా కంది సాగును ప్రోత్సహించాలని సీఎం సూచించారు. కంది సాగు చేసే రైతులకు కనీస మద్దతు ధరను అమలు చేయాలన్నారు.
ధరణి బియ్యానికి పెరిగిన ఆదరణ
ధరణి బ్రాండ్ పేరుతో ప్రభుత్వం సరఫరా చేస్తున్న 26 కిలోల బస్తా సూపర్-ఫైన్ బియ్యానికి ప్రజల నుంచి విశేష ఆదరణ లభిస్తోందని అధికారులు వివరించారు. మార్కెట్లో కిలో రూ.76 ఉన్న KNM/RNR బియ్యాన్ని రూ.50కే, రూ.66 ఉన్న BPT ముడి బియ్యాన్ని రూ.49కే అందిస్తుండగా ఇప్పటివరకు 2.25 లక్షల మందికి పైగా వినియోగదారులు 59,662 క్వింటాళ్ల బియ్యాన్ని కొనుగోలు చేశారని తెలిపారు. ప్రస్తుతం 286 కేంద్రాల్లో ఈ విక్రయాలను జరుపుతున్నామని అధికారులు చెప్పారు. అయితే ఈ విక్రయ కేంద్రాలను 500 కేంద్రాలకు విస్తరించాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. బియ్యం సహా వివిధ నిత్యావసరాలు బ్లాక్ మార్కెట్‌కు తరలించకుండా చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. దీనిపై ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకున్నారని అధికారులను అడిగారు. అధిక ధరల విక్రయాలపై విజిలెన్స్, లీగల్ మెట్రాలజీ బృందాలు 1,558 తనిఖీలు నిర్వహించి 1,005 కేసులు నమోదు చేయడంతో పాటు రూ.84.59 లక్షల జరిమానా వసూలైందని అధికారులు ముఖ్యమంత్రి దృష్టికి తెచ్చారు. టోల్గేట్లు, సరిహద్దు చెక్‌పోస్టుల వద్ద నిఘా పెంచాలని ఆదేశించారు.
నీటి లభ్యత ఆధారంగా పంటల ప్రణాళిక
ఎల్ నినో ప్రభావంతో వివిధ పంటల దిగుబడులపై పడే ప్రభావాన్ని ముందుగానే అంచనా వేయాలని సీఎం సూచించారు. ఉల్లి, టమాట ధరలు రానున్న రోజుల్లో మరింత తగ్గుతాయని అగ్రివాచ్ నివేదికలు స్పష్టం చేస్తున్నాయన్నారు. కూరగాయల ధరలు కూడా ఎంత మాత్రం పెరగడానికి వీల్లేదని స్పష్టం చేశారు. కృష్ణా డెల్టా వంటి ప్రాంతాల్లో కూడా తక్కువ నీటితో పండే సన్నరకం వరి సాగును ప్రోత్సహించాలన్నారు. ఫైన్ వెరైటీ రకాలకు అదనపు మద్దతు ధర కల్పించే అంశం ఈ సమావేశంలో ప్రస్తావనకు వచ్చింది. దీనిపై ఎంత ఖర్చు అవుతుందో అంచనా వేయాలని… అవసరమైన పక్షంలో కేంద్రంతో సంప్రదింపులు జరపాలని ముఖ్యమంత్రి సూచించారు. మంచి లాభాలు వస్తుండడంతో పల్నాడు వంటి ప్రాంతాల్లోనూ ఆయిల్‌పామ్ సాగుకు రైతులు మొగ్గు చూపుతున్నారని మంత్రి అచ్చెన్నాయుడు ప్రస్తావించగా.. భూగర్భ జలాలు లేని ప్రాంతాల్లో ఆయిల్‌పామ్ వేస్తే భవిష్యత్తులో రైతులు నష్టపోతారని సీఎం స్పష్టం చేశారు. నీటి వనరులు పుష్కలంగా ఉన్నచోటే ఆయిల్‌పామ్ సాగును ప్రొత్సహించాలని… నీటి లభ్యత తక్కువగా ఉండే చోట ప్రత్యామ్నాయ పంటల వైపు మళ్లేలా చూడాలని ఉద్యాన శాఖ అధికారులను ఆదేశించారు. అగ్రివాచ్ డేటా, వర్షపాతం ఆధారంగా పంటల ప్రణాళిక రూపొందించాలని సూచించారు. ఈ సమీక్షలో మంత్రులు అచ్చెన్నాయుడు, నాదెండ్ల మనోహర్, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
![]()
