కాకినాడ హార్బర్‌కు సురక్షితంగా చేరుకున్న మత్స్యకార బోటు

Spread the love

కాకినాడ హార్బర్‌కు సురక్షితంగా చేరుకున్న మత్స్యకార బోటు

  • ఇంజిన్ వైఫల్యంతో సముద్రంలో నిలిచిపోయిన బోటులోని ఏడుగురు క్షేమం
  • సకాలంలో స్పందించిన అధికారుల పనితీరు అభినందనీయం
  • ఉప్పాడకు చెందిన ఏడుగురు మత్స్యకారుల ఆచూకీ కోసం ముమ్మర గాలింపు
  • కేంద్ర ప్రభుత్వానికి ప్రత్యేక లేఖ.. బంగ్లాదేశ్, మయన్మార్ సహకారం కోరేందుకు చర్యలు
  • మత్స్యకారుల ప్రాణరక్షణే ప్రభుత్వ తొలి ప్రాధాన్యం
  • రాష్ట్ర వ్యవసాయ, మత్స్యశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు

అమరావతి, నవంబర్ 25: కాకినాడ జిల్లా యేటిమొగ నుంచి చేపల వేటకు వెళ్లి ఇంజిన్ వైఫల్యంతో సముద్రంలో నిలిచిపోయిన బోటు సురక్షితంగా కాకినాడ ఫిషింగ్ హార్బర్‌కు చేరుకోవడం సంతోషకరమని రాష్ట్ర వ్యవసాయ, మత్స్యశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. డ్రైవర్‌తో సహా ఏడుగురు మత్స్యకారులు క్షేమంగా తిరిగి రావడం వారి కుటుంబ సభ్యులకు ఎంతో ఊరటనిచ్చిందన్నారు. యేటిమొగకు చెందిన సెరు రామలక్ష్మి పేరుతో నమోదైన యాంత్రిక మత్స్యకార బోటు (IND-AP-E2-MM-220) ఈ నెల 23వ తేదీ రాత్రి ఇంజిన్‌లో సాంకేతిక సమస్య తలెత్తడంతో ఉప్పాడ–తుని తీరంలోని కృష్ణాపురం సమీపంలో నిలిచిపోయిందని వివరించారు. తీరానికి మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న బోటు నుంచి డ్రైవర్ దమ్ము అప్పారావు సమాచారం అందించడంతో అధికారులు వెంటనే అప్రమత్తమయ్యారన్నారు. అత్యవసర ఫోన్ కాల్ అందిన వెంటనే స్పందించిన అధికారుల పనితీరు అభినందనీయమని మంత్రి పేర్కొన్నారు. అర్ధరాత్రి సమయంలోనూ వాకలపూడి ఇన్‌స్పెక్టర్ ఏమాత్రం ఆలస్యం చేయకుండా కోస్ట్‌గార్డ్, నౌకాదళ అధికారులకు సమాచారం చేరవేయడంతో పాటు మత్స్యశాఖతో సమన్వయం చేసుకోవడం ప్రశంసనీయమన్నారు. సముద్రపు నీటి లోతు తక్కువగా ఉండటంతో భారీ నౌకల రాకకు ఇబ్బందులు ఎదురైనప్పటికీ, బోట్ల యజమానుల సంఘం సహకారంతో సహాయక ప్రయత్నాలు చేపట్టారని వివరించారు. ఈ నేపథ్యంలో వేగంగా స్పందించిన కోస్టల్ సెక్యూరిటీ పోలీసులు, మత్స్యశాఖ అధికారులు, సంబంధిత సిబ్బందిని ప్రత్యేకంగా అభినందించారు.

ఏడుగురి కోసం ముమ్మర గాలింపు

మరోవైపు కాకినాడ జిల్లా ఉప్పాడలోని సుబ్బంపేటకు చెందిన ఏడుగురు మత్స్యకారులు సముద్రంలో గల్లంతైన ఘటనపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. ఈ నెల 4న రెండు బోట్లలో పారాదీప్ వైపు చేపల వేటకు వెళ్లగా, ఒక బోటు 18న తిరిగి వచ్చిందన్నారు. మరో బోటులోని మత్స్యకారుల ఆచూకీ లభించకపోవడంతో 19న ఫిర్యాదు అందిందని, అప్పటి నుంచి సంబంధిత శాఖల సమన్వయంతో గాలింపు కొనసాగుతోందని వివరించారు. గల్లంతైన మత్స్యకారుల రక్షణ కోసం కేంద్ర ప్రభుత్వానికి ప్రత్యేకంగా లేఖ రాశామని మంత్రి తెలిపారు. వారి ఆచూకీ గుర్తించేందుకు అవసరమైన సహకారం కోరడంతో పాటు బంగ్లాదేశ్, మయన్మార్ దేశాల సముద్ర జలాల వైపు వెళ్లి ఉండే అవకాశాలను కూడా పరిశీలిస్తామన్నారు. కేంద్ర విదేశాంగ శాఖ ద్వారా ఆయా దేశాల ప్రతినిధులతో సంప్రదింపులు జరిపేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. భారత తీర రక్షక దళం, నౌకాదళం, ఒడిశా అధికారులు, రాష్ట్ర మత్స్యశాఖ సమన్వయంతో గాలింపును మరింత వేగవంతం చేయాలని సూచించారు. మత్స్యకారుల భద్రత విషయంలో ఎలాంటి నిర్లక్ష్యానికి తావులేదని మంత్రి స్పష్టం చేశారు. చేపల వేటకు వెళ్లే ముందు బోట్ల ఇంజిన్లు, ట్రాన్స్‌పాండర్లు, సమాచార వ్యవస్థలు, ఇతర రక్షణ పరికరాలను తప్పనిసరిగా తనిఖీ చేసుకోవాలని సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో అధికారులు తక్షణమే స్పందించేలా అప్రమత్తంగా ఉండాలన్నారు. మత్స్యకారుల ప్రాణరక్షణే కూటమి ప్రభుత్వ తొలి ప్రాధాన్యం. ఒక బోటులోని ఏడుగురు క్షేమంగా తిరిగి రావడం సంతోషకరం. గల్లంతైన మరో ఏడుగురిని కూడా సురక్షితంగా కుటుంబ సభ్యుల చెంతకు చేర్చేందుకు కేంద్ర ప్రభుత్వ సహకారంతో అన్ని ప్రయత్నాలు చేస్తాం. బాధిత కుటుంబాలు ధైర్యంగా ఉండాలి. ప్రభుత్వం వారికి అండగా ఉంటుంది అని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు భరోసా ఇచ్చారు.

Loading