
రెండేళ్లలో ‘మేడ్ ఇన్ ఇండియా’ పౌర విమానం..
ఉడాన్-2 కింద మరో 100 కొత్త విమానాశ్రయాలు:
విమానయాన రంగంలో ఆంధ్రప్రదేశ్ అపూర్వ ప్రగతి
31వ సీఐఐ భాగస్వామ్య సదస్సులో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు
భారత పౌర విమానయాన రంగం ప్రపంచానికే ఆదర్శంగా నిలుస్తోందని, వచ్చే రెండేళ్లలో పూర్తిగా దేశీయంగా తయారైన పౌర విమానం (Made in India Civilian Aircraft) గగనవిహారం చేయనుందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ప్రకటించారు. గురువారం విశాఖపట్నంలో జరిగిన 31వ సీఐఐ (CII) భాగస్వామ్య సదస్సులో భాగంగా నిర్వహించిన ప్రత్యేక ప్లీనరీలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. భారత విమానయాన రంగంలో తదుపరి అడుగు - అనుసంధానం, సామర్ధ్యం, పోటీతత్వం అంశంపై ప్రసంగించారు.
ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ.. 2014లో దేశంలో 74 విమానాశ్రయాలు ఉండగా, నేడు ఆ సంఖ్య 166కి పెరిగిందని తెలిపారు. ఉడాన్ పథకం ద్వారా సామాన్యుడికి విమాన ప్రయాణం చేరువైందని, తద్వారా వార్షిక ప్రయాణికుల సంఖ్య 25 కోట్లకు చేరిందని వివరించారు. రూ. 30,000 కోట్ల బడ్జెట్‌తో ప్రారంభమైన ఉడాన్ రెండో దశలో భాగంగా 2036 నాటికి దేశంలో మరో 100 విమానాశ్రయాలు, 200 ఆధునిక హెలిపోర్టులను నిర్మిస్తామని వెల్లడించారు. విమానాశ్రయాలలో ప్రయాణికుల సౌకర్యార్థం 'డిజి యాత్ర' (Digi Yatra) వంటి ఆధునిక సాంకేతికతను ప్రవేశపెట్టడం వల్ల ప్రవేశ సమయం 90 సెకన్ల నుండి 20 సెకన్లకు తగ్గిందన్నారు.
ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక ప్రాధాన్యత:
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి దార్శనిక నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ పౌర విమానయాన రంగంలో వేగంగా దూసుకెళ్తోందని మంత్రి ప్రశంసించారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని నిర్ణీత గడువు కంటే 6 నెలల ముందే పూర్తి చేయడం అభినందనీయమన్నారు. అనంతపురం జిల్లా లేపాక్షి సమీపంలో ఏరోస్పేస్ మరియు డిఫెన్స్ సిటీని ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. అలాగే ప్రకాశం బ్యారేజీ, శ్రీశైలం మరియు హైదరాబాద్‌లోని హుస్సేన్ సాగర్ మధ్య ‘సీ-ప్లేన్’ (Seaplane) సేవలను ప్రారంభించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు పేర్కొన్నారు.
విమాన విడిభాగాల తయారీ, మరమ్మతులు (MRO), డ్రోన్లు మరియు ఎయిర్ ట్యాక్సీల (eVTOL) రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు ఇదే సరైన సమయమని, పరిశ్రమ వర్గాలు మరియు యువ పారిశ్రామికవేత్తలు ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోవాలని మంత్రి పిలుపునిచ్చారు.
అనంతరం జరిగిన చర్చలో కో-చైర్, సీఐఐ నేషనల్ కమిటీ ఆన్ సివిల్ ఏవియేషన్ & ఎండీ వైభవ్ వోహ్రా, కాంటినెంటల్ క్యారియర్స్
మిస్టర్ జోధ్‌బీర్ సింగ్ సచ్‌దేవా, కేపీఎంజీ (KPMG) పార్ట్నర్ , అనుభవ్ కుమార్, హెడ్ ఆఫ్ స్ట్రాటజీ & గవర్నమెంట్ పాలసీ, బోయింగ్ ఇండియా & సౌత్ ఏషియా, డాక్టర్ అభయ్ పషికర్ – డైరెక్టర్, సీఎస్ఐఆర్ – నేషనల్ ఏరోస్పేస్ లాబొరేటరీస్ పాల్గొని, యుఎన్ఈపి సీనియర్ అడ్వైజర్ సుధీర్ పేర్ల పాల్గొన్నారు. దేశంలో విమాన అనుసంధానత విస్తరణ, విమానాశ్రయాలు–విమానయాన సంస్థల సామర్థ్యం పెంపు, అంతర్జాతీయ స్థాయిలో పోటీతత్వం దిశగా పౌర విమానయాన రంగం తదుపరి అభివృద్ధి సాధించాల్సిన అంశాల పై ఈ సమావేశంలో చర్చించారు.
![]()
