
పర్యావరణ పరిరక్షణ మన ఇంటి నుంచే ప్రారంభం కావాలి..
పర్యావరణ, అటవీ శాఖ ముఖ్య కార్యదర్శి కాంతిలాల్ దండే.
ఘనంగా ముగిసిన ‘బ్రిక్స్ సుస్థిర జీవనశైలి వారోత్సవాలు–2026
మంగళగిరి ఎకో పార్కులో ముగింపు సభ
పర్యావరణాన్ని కాపాడే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని, ఆ మార్పు ముందుగా మన ఇంటి నుంచే ప్రారంభం కావాలని రాష్ట్ర పర్యావరణ, అటవీ శాఖ ముఖ్య కార్యదర్శి కాంతిలాల్ దండే పిలుపునిచ్చారు.
లైఫ్ స్టైల్ ఫర్ ఎన్విరాన్మెంట్, అటవీ, పర్యావరణ శాఖ, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సయుక్త ఆధ్వర్యంలో నవంబర్ 1 నుండి 7 వరకు “ఒక వారం.. ఏడు ఆచరణలు.. ఒకే భూగోళం” అనే నినాదంతో నిర్వహించిన ‘బ్రిక్స్ సుస్థిర జీవనశైలి వారోత్సవాలు–2026’ ముగింపు కార్యక్రమం శనివారం మంగళగిరి ఎకో పార్కులో ఘనంగా నిర్వహించారు.
ముఖ్య అతిథిగా విచ్చేసిన పర్యావరణ,అటవీ శాఖ, పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ ముఖ్య కార్యదర్శి కాంతిలాల్ దండే మాట్లాడుతూ.. బ్రిక్స్ దేశాల భాగస్వామ్యంలో పర్యావరణ పరిరక్షణ కోసం గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిర్దేశించిన లక్ష్యాలకు అనుగుణంగా ప్రతి పౌరుడూ ఒక వాలంటీర్‌గా మారాలన్నారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం ప్రతి ఇంట్లోనూ ఘన వ్యర్థాలను వేరు చేయడం (సెగ్రిగేషన్) అలవాటు చేసుకోవాలని సూచించారు. ఆ మార్పును ముందుగా మన కుటుంబం, స్నేహితులకు విస్తరింపజేయాలని పేర్కొన్నారు.
రాష్ట్రంలో పర్యావరణ పరిరక్షణ కోసం ప్రభుత్వం చేపడుతున్న చర్యలను ఆయన వివరించారు.
పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో 660 మండలాల్లో ‘స్వచ్ఛ రథాలు’ ఏర్పాటు చేసి పొడి వ్యర్థాల సేకరణ చేపడుతున్నామని తెలిపారు.
ప్రతి కిలో ప్లాస్టిక్ వ్యర్థాలకు 20 రూపాయల విలువైన నిత్యావసరాలను ‘గ్రీన్ షాప్స్’ ద్వారా అందించే విధానాన్ని ప్రోత్సహిస్తున్నామని చెప్పారు.
‘వేస్ట్ టు వెల్త్’ విధానంలో భాగంగా ఘన వ్యర్థాల నుంచి వర్మీ కంపోస్ట్ (వానపాముల ఎరువు) తయారు చేసి మార్క్‌ఫెడ్ ద్వారా రైతులకు అందిస్తున్నామని వివరించారు.
విద్యార్థుల్లో ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించేందుకు ఏపీపీసీబీ ద్వారా పాఠశాలలకు స్టీల్ వాటర్ బాటిళ్లు అందించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
రోజువారీ జీవితంలో చేసుకునే చిన్న చిన్న అలవాట్లే ప్రకృతిని కాపాడతాయి….
పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ చైర్మన్ డాక్టర్ పి. కృష్ణయ్య
పర్యావరణ పరిరక్షణ కోసం పెద్ద పెద్ద పనులే చేయనక్కర్లేదని, రోజువారీ జీవితంలో చేసుకునే చిన్న చిన్న అలవాట్లే ప్రకృతిని కాపాడతాయని ఆంధ్రప్రదేశ్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ చైర్మన్ డాక్టర్ పి. కృష్ణయ్య స్పష్టం చేశారు. ప్రతీ రోజు మనం బ్రష్ చేసుకునే సమయంలో అనవసరంగా కుళాయి నీటిని వృథా చేయకుండా ఆదా చేయాలని, బజారుకు వెళ్లేటప్పుడు గుడ్డ లేదా జూట్ బ్యాగులు వెంట తీసుకెళ్లి ప్లాస్టిక్ కవర్లను పూర్తిగా తిరస్కరించాలని కోరారు. అలాగే వేడుకలు, ఫంక్షన్లలో అవసరమైనంత వరకే ఆహారాన్ని తీసుకుంటూ ఆహార పదార్థాలను వృథాగా పారబోయకూడదని పిలుపు నిచ్చారు. గదుల నుండి బయటకు వచ్చేటప్పుడు ఫ్యాన్లు, లైట్లను స్విచ్ ఆఫ్ చేసి విద్యుత్‌ను ఆదా చేయాలని సూచించారు. బోర్డు తరఫున వివిధ సంస్థల సమన్వయంతో దాదాపు నాలుగు వేల కార్యక్రమాలు నిర్వహించగా, రెండు లక్షల మంది భాగస్వాములయ్యారని ఆయన తెలిపారు. పర్యావరణ పరిరక్షణకై తీసుకున్న ప్రతిజ్ఞను మాటలకే పరిమితం చేయకుండా ప్రతి ఒక్కరూ తమ నిత్యజీవితంలో ఆచరణలో పెట్టాలని చైర్మన్ డాక్టర్ పి. కృష్ణయ్య పిలుపునిచ్చారు.
ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ (పీసీసీఎఫ్), హెడ్ ఆఫ్ ఫారెస్ట్ ఫోర్స్ డాక్టర్ పి.వి. చలపతిరావు స్వాగతోపన్యాసం చేస్తూ
పర్యావరణ పరిరక్షణ అనేది కేవలం వారోత్సవాలతో ముగిసిపోయేది కాదని, అది ప్రతి ఒక్కరి నిత్య జీవనశైలిగా మారాలని అన్నారు. స్వాతంత్ర్య శతాబ్ది నాటికి రాష్ట్రంలో 50 శాతం పచ్చదనం సాధించడమే లక్ష్యమని, అలాగే 2028 నాటికి 80 శాతం గ్రామాలు, పట్టణ స్థానిక సంస్థల్లో ‘మిషన్ లైఫ్’ అమలు పరచనున్నట్లు తెలిపారు. ఆహారపు అలవాట్లు మొదలుకొని భవన నిర్మాణాల వరకు ప్రతి విషయంలోనూ ప్రకృతి వనరులను బాధ్యతాయుతంగా వినియోగించుకోవాలని, భావితరాల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని మెలగాలని సూచించారు. వ్యర్థాలను తగ్గించడం, వాటిని పునర్వినియోగించడం ద్వారా కాలుష్య రహిత వాతావరణాన్ని నిర్మించవచ్చన్నారు.
ఈ వారోత్సవాలను రాష్ట్రవ్యాప్తంగా సమర్థవంతంగా నిర్వహించిన స్టేట్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ మహమ్మద్ దివాన్ మొహిద్దీన్ నాయకత్వాన్ని ఆయన ప్రత్యేకంగా అభినందించారు.
అనంతరం పర్యావరణహిత జీవనశైలిని పాటిస్తామని విద్యార్థులు, అధికారులతో ప్రతిజ్ఞ చేయించారు.
అనంతరం స్టేట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్, లైఫ్ స్టైల్ ఫర్ ఎన్విరాన్మెంట్, వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఎగ్జిబిషన్ ను ప్రిన్సిపల్ సెక్రెటరీ కాంతిలాల్ దండే సందర్శించారు.
కార్యక్రమంలో అటవీ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీలు బి.ఎన్.ఎన్.మూర్తి, రేవతి, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు మెంబర్ సెక్రటరీ శరవణన్, స్టేట్ విజిలెన్స్ డిస్ట్రిక్ట్ ఫారెస్ట్ ఆఫీసర్లు ధర్మ రక్షిత, సాయి, వివిధ స్థాయి అటవీ శాఖ అధికారులతో పాటు పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు.
![]()
