భక్తుల సేవలోనే అధికార యంత్రాంగం ల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌, సీపీ ఎస్‌వీ రాజ‌శేఖ‌ర‌బాబు, దేవాదాయ క‌మిష‌న‌ర్ కె.రామ‌చంద్ర‌మోహ‌న్‌

Spread the love

భక్తుల సేవలోనే అధికార యంత్రాంగం

  • మూలా న‌క్ష‌త్రాన అమ్మ దర్శనానికి ఆటంకం లేకుండా ప‌క‌డ్బందీ ఏర్పాట్లు
  • మూడు ల‌క్ష‌ల మంది వ‌ర‌కు భ‌క్తులు వ‌చ్చినా ఇబ్బంది లేదు
  • సాయంత్ర 4-4.30 గంట‌ల మ‌ధ్య‌లో ఇంద్ర‌కీలాద్రికి గౌర‌వ ముఖ్య‌మంత్రి
  • 450 సీసీ కెమెరాలతో నిరంతర పర్యవేక్షణ
  • భ‌క్తుల‌కు మంచినీరు, మజ్జిగ, బిస్కెట్లు, అన్న ప్ర‌సాదం పంపిణీ
  • వర్షం కురిసినా అమ్మవారి దర్శనానికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు
  • కొండరాళ్లపై నిరంతర నిఘా.. ప్ర‌త్యేక సాంకేతిక బృందం ప‌ర్య‌వేక్ష‌ణ‌
  • జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌, సీపీ ఎస్‌వీ రాజ‌శేఖ‌ర‌బాబు, దేవాదాయ క‌మిష‌న‌ర్ కె.రామ‌చంద్ర‌మోహ‌న్‌

విజయవాడ ఇంద్రకీలాద్రిపై మూలా నక్షత్రం సందర్భంగా మూడు లక్షల మంది వరకు భక్తులు వచ్చినా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పటిష్టమైన ఏర్పాట్లు చేపట్టినట్లు జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ తెలిపారు. భక్తులకు సౌకర్యవంతంగా, సురక్షితంగా అమ్మవారి దర్శనం కల్పించడమే లక్ష్యంగా జిల్లా యంత్రాంగం, పోలీసు, దేవస్థానం అధికారులు సమన్వయంతో పనిచేస్తున్నారని పేర్కొన్నారు. సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తూ దర్శన ఏర్పాట్లు చేసినట్లు వివరించారు.
మూలాన‌క్ష‌త్రం రోజున అనుస‌రించాల్సిన ప్ర‌ణాళిక‌పై గురువారం కొండ దిగువ భాగాన ఇరిగేష‌న్ మోడ‌ల్ గెస్ట్ హౌజ్‌లోని క‌మాండ్ కంట్రోల్ కేంద్రంలో జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌, సీపీ ఎస్‌వీ రాజ‌శేఖ‌ర‌బాబు, దేవాదాయ శాఖ క‌మిష‌న‌ర్ కె.రామచంద్ర‌మోహ‌న్‌, ఆల‌య ఈవో వీకే శీనా నాయ‌క్ త‌దిత‌రులు స‌మావేశ‌మ‌య్యారు. స్థానాచార్యులు విష్ణుభ‌ట్ల శివ‌ప్ర‌సాద‌శ‌ర్మ స‌మ‌క్షంలో చ‌ర్చించారు. అనంత‌రం క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ మీడియాతో మాట్లాడుతూ భక్తుల రద్దీని ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు 450 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశామని, అత్యాధునిక కమాండ్ కంట్రోల్ కేంద్రం ద్వారా పరిస్థితిని నిరంతరం సమీక్షిస్తున్నామని తెలిపారు. హోల్డింగ్ పాయింట్లతో పాటు క్యూలైన్లలో భక్తులకు మంచినీరు, మజ్జిగ, బిస్కెట్లు, అన్నప్రసాదం పంపిణీ చేయ‌డం జ‌రుగుతోంద‌న్నారు. మూలా న‌క్ష‌త్రం రోజున వర్షం కురిసినా భక్తులకు ఇబ్బందులు కలగకుండా మహామండపం ద్వారా దర్శనానికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు సిద్ధం చేశామని పేర్కొన్నారు. కొండరాళ్ల పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించేందుకు ప్రత్యేక సాంకేతిక బృందాన్ని ఏర్పాటు చేశామని, భక్తుల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. భక్తులు హడావుడి పడకుండా సంయమనం పాటిస్తూ, అధికారుల సూచనలను అనుసరించి క్రమపద్ధతిలో అమ్మవారిని దర్శించుకోవాలని విజ్ఞప్తి చేశారు. సాయంత్రం 4 గంట‌ల నుంచి 4.30 గంట‌ల మ‌ధ్య‌లో గౌర‌వ ముఖ్య‌మంత్రి అమ్మ‌వారికి ప‌ట్టు వ‌స్త్రాలు స‌మ‌ర్పిస్తార‌న్నారు. ఇందుకు త‌గిన ఏర్పాట్లు చేశామ‌ని వివ‌రించారు. గౌర‌వ ముఖ్య‌మంత్రితో పాటు గౌర‌వ మంత్రులు, రాష్ట్ర‌స్థాయి ఉన్న‌తాధికారుల సూచ‌న‌లను ప‌రిగ‌ణ‌నలోకి తీసుకొని ఏర్పాట్లు చేసిన‌ట్లు చెప్పారు.
పోలీసు క‌మిష‌న‌ర్ ఎస్‌వీ రాజ‌శేఖ‌ర‌బాబు మాట్లాడుతూ ప్ర‌స్తుతం 3,500 మంది పోలీసు సిబ్బంది విధుల్లో ఉన్నార‌ని.. మూలాన‌క్ష‌త్రం రోజును పుర‌స్క‌రించుకొని అద‌నంగా 900 మందికి బాధ్య‌త‌లు అప్ప‌గించిన‌ట్లు చెప్పారు. ఎంత స‌మ‌యంలో అమ్మ‌వారి ద‌ర్శ‌నం ల‌భిస్తుంద‌నే దాంతో పాటు వివిధ అంశాల‌కు సంబంధించి క‌మాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా గంట గంట‌కూ బులెటెన్ విడుద‌ల చేయ‌నున్న‌ట్లు తెలిపారు. వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన డిజిట‌ల్ స్క్రీన్ల ద్వారా స‌మాచారాన్ని ఎప్ప‌టిక‌ప్పుడు అందించ‌నున్న‌ట్లు వెల్ల‌డించారు. డేటా అన‌లిటిక్స్ ద్వారా ఎంత స‌మ‌యంలో అమ్మ‌వారి ద‌ర్శ‌నమ‌వుతుందో క‌చ్చితత్వంతో తెలియ‌జేసేందుకు ప్ర‌య‌త్నిస్తున్నామ‌న్నారు. మూలా న‌క్ష‌త్రం రోజున సామాన్య భ‌క్తుల‌కు పెద్ద‌పీట వేయడం జ‌రుగుతుంద‌ని.. వీఐపీ పాస్‌ల‌ను ర‌ద్దుచేసిన‌ట్లు తెలిపారు. ప్ర‌జ‌లు పోలీసుల‌తో పాటు అధికార యంత్రాంగం చేసే సూచ‌న‌లు పాటించి స‌హ‌క‌రించాల‌ని కోరారు.
దేవాదాయ శాఖ క‌మిష‌న‌ర్ కె.రామ‌చంద్ర‌మోహ‌న్ మాట్లాడుతూ గ‌తేడాదితో పోల్చితే ఈసారి ప్ర‌తిరోజూ అమ్మ‌వారిని ద‌ర్శించుకునే భ‌క్తుల సంఖ్య పెరుగుతోంద‌ని తెలిపారు. ఈసారి మూలాన‌క్ష‌త్రం రోజున 2,50,000 నుంచి మూడు ల‌క్ష‌ల మంది వ‌ర‌కు భ‌క్తులు వ‌చ్చే అవ‌కాశ‌ముంద‌న్నారు. ఎప్పుడు ఎక్క‌డ ఎవ‌రికి ఏ స‌మ‌స్య వ‌చ్చినా వెంట‌నే స్పందించి ప‌రిష్క‌రించేందుకు అత్యాధునిక సాంకేతిక‌త స‌హాయంతో చ‌ర్య‌లు తీసుకుంటున్న‌ట్లు వివ‌రించారు. క్యూఆర్ కోడ్ ఫీడ్ బ్యాక్ విధానం ద్వారా మంచి ఫ‌లితాలు వ‌స్తున్నాయ‌న్నారు. వైదిక క‌మిటీ స‌భ్యుల‌తోనూ చ‌ర్చించి భక్తుల‌కు సంతృప్తిక‌ర అమ్మ‌వారి ద‌ర్శ‌నం ల‌భించేలా ఏర్పాట్లు చేసిన‌ట్లు రామ‌చంద్ర‌మోహ‌న్ పేర్కొన్నారు.

Loading