చింత చెట్టు చెంతన.. గిరిపుత్రుల చింతలు తీర్చిన ఉప ముఖ్యమంత్రివర్యులు

Spread the love

చింత చెట్టు చెంతన.. గిరిపుత్రుల చింతలు తీర్చిన ఉప ముఖ్యమంత్రివర్యులు

• అడిగిన వెంటనే గిరిజనులకు అభివృద్ధి వరాలు
• ‘మాటా-మంతి’లో వచ్చిన సమస్యలకు తక్షణ పరిష్కారాలు
• సుమారు రూ. 5 కోట్లతో పాఠశాలలు, ఆసుపత్రులు తదితర అభివృద్ధి పనులకు మంజూరు
• కాకవాడ–వేములకొండ అడవి తల్లి బాట రహదారికి శంకుస్థాపన అనంతరం గిరిజనులతో పవన్ కళ్యాణ్ మాటా-మంతి
అడవి బిడ్డల కష్టాలు తెలుసుకునేందుకు అరణ్యం మధ్యలోని గిరిశిఖర గ్రామానికి వెళ్లారు. సుమారు 350 మంది జనాభా కలిగిన రాకోట గ్రామాన్ని సందర్శించి, గిరిజనుల సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. చింత చెట్టు కింద కూర్చుని వారితో మమేకమయ్యారు. గిరిజనులు ప్రస్తావించిన సమస్యలపై తక్షణమే స్పందించి, పరిష్కారాలకు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు పవన్ కళ్యాణ్ ఆదేశాలు జారీ చేశారు. ‘అడవితల్లిబాట 2.0’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టేందుకు ఆదివారం పోలవరం జిల్లా పరిధిలోని రంపచోడవరం నియోజకవర్గం, వేములకొండ గ్రామ పంచాయతీ పరిధిలోని రాకోట గిరిశిఖర గ్రామానికి చేరుకున్నారు. అదే పంచాయతీ పరిధిలోని కాకవాడ, రాకోట, సువర్లవాడ, వేములకొండ గ్రామాలను కలిపేలా రూ. 2.29 కోట్ల వ్యయంతో 3.4 కిలోమీటర్ల మేర నిర్మించనున్న రహదారికి శంకుస్థాపన చేశారు. అనంతరం రాకోట గ్రామంలో చింతచెట్టు కింద ఉన్న రచ్చబండ వద్ద గిరిపుత్రులతో ‘మాటా-మంతి’ కార్యక్రమంలో పాల్గొన్నారు.
పాఠశాల, ఆరోగ్య కేంద్రం, ఆలయ అభివృద్ధికి నిధులు
రాకోట గ్రామ సందర్శన సందర్భంగా అక్కడి ఎంపీపీ పాఠశాల శిథిలావస్థలో ఉన్న విషయాన్ని తెలుసుకున్న ఉప ముఖ్యమంత్రివర్యులు దాని పునరుద్ధరణకు రూ. 20 లక్షలు మంజూరు చేశారు. గ్రామస్థుల కోరిక మేరకు విలేజ్ హెల్త్ క్లినిక్ నిర్మాణానికి రూ. 15 లక్షలు మంజూరు చేశారు. రాకోట గ్రామస్థుల ఇలవేల్పుగా పూజలందుకుంటున్న హనుమాన్ ఆలయాన్ని సందర్శించి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. రేకుల షెడ్డులో కొనసాగుతున్న ఆలయ పరిస్థితిని గమనించిన ఆయన, దేవాదాయ శాఖ సహకారంతో భజన మందిరంగా అభివృద్ధి చేసేందుకు మరో రూ. 20 లక్షలు కేటాయించారు.
గిరిజన గ్రామాల సమస్యలకు తక్షణ పరిష్కారాలు
‘మాటా-మంతి’ కార్యక్రమంలో రాకోట పరిసర ప్రాంతాలైన వేములకొండ, సువర్లవాడ, డబ్బావలస, తిరుగటిరాళ్లు, కాకవాడ, చిలకవీధి, వెట్టిచెలకలు, సోకులగూడెం తదితర గ్రామాల ప్రజలు తమ సమస్యలను పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకొచ్చారు. వాటిపై ఆయన తక్షణమే స్పందించారు. ప్రతి గ్రామానికి అంగన్‌వాడీ కేంద్రంతో కూడిన మండల పరిషత్ పాఠశాల, విలేజ్ హెల్త్ క్లినిక్ మంజూరు చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఈ అభివృద్ధి పనుల కోసం వివిధ పథకాల ద్వారా దాదాపు రూ. 5 కోట్లు కేటాయించారు. గిరిజనులు తమ సమస్యలను స్వయంగా ఉప ముఖ్యమంత్రివర్యుల దృష్టికి తీసుకురాగా, వాటి పరిష్కారానికి అక్కడికక్కడే ఆదేశాలు జారీ చేయడంతో గిరిపుత్రుల్లో భరోసా నింపారు.
రహదారి పొడవునా పూలు పరిచి.. ఘన స్వాగతం పలికిన గిరిజనులు
‘అడవి తల్లి బాట 2.0’ కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు తమ గ్రామానికి వచ్చిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు పవన్ కళ్యాణ్ కి రాకోట గ్రామ గిరిజన మహిళలు ఘనస్వాగతం పలికారు. గిరిజన సంప్రదాయాలను అనుసరిస్తూ స్థానికంగా లభించే పూలతో తయారు చేసిన బొకేలను అందజేశారు. జలహారతులు పట్టి, పూల వర్షం కురిపిస్తూ తమ గ్రామంలోకి ఆహ్వానించారు.
మండల పరిషత్ పాఠశాల భవనాన్ని పరిశీలించిన ఉప ముఖ్యమంత్రివర్యులు
రాకోట గ్రామానికి చేరుకున్న వెంటనే పక్కనే ఉన్న ఎంపీపీ పాఠశాలను ఉప ముఖ్యమంత్రివర్యులు పవన్ కళ్యాణ్ పరిశీలించారు. చిన్నారులను పలకరించి, పాఠశాల భవనాలతో పాటు ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఉద్యానవనాన్ని సందర్శించారు. పాఠశాల భవనం మరమ్మతుల కోసం రూ. 20 లక్షలు కేటాయించారు. విద్యార్థులకు తినుబండారాలు అందించారు.
వెదురు ఉత్పత్తుల విలువ పెంపునకు సహకారం
అనంతరం రాకోట గ్రామంలో వెదురు బొంగులతో గృహోపకరణాలు తయారు చేస్తున్న కొమ్మిరెడ్డి కుటుంబాన్ని ఉప ముఖ్యమంత్రివర్యులు పలకరించి, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం సెర్ప్ ఆధ్వర్యంలో వెదురు ఉత్పత్తుల ప్రోత్సాహానికి తీసుకుంటున్న చర్యలను అధికారులు వివరించారు. వెదురు ఉత్పత్తులకు మరింత విలువ జోడించి, గిరిజన కుటుంబాలకు మెరుగైన ఆదాయం లభించేలా ప్రభుత్వం తరఫున సహకారం అందిస్తామని ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు.
వ్యవసాయదారులకు పనిముట్ల పంపిణీ కార్యక్రమం ప్రారంభం
కాకవాడ గ్రామంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభకు ముందు ప్రధానమంత్రి కృషి సించాయి యోజన 2.0 పథకం కింద వాటర్‌షెడ్ అభివృద్ధి పరికరాల పంపిణీ కార్యక్రమాన్ని పవన్ కళ్యాణ్ ప్రారంభించారు. వ్యవసాయ ఉత్పాదకతను పెంపొందించే లక్ష్యంతో రాష్ట్రవ్యాప్తంగా సుమారు రూ. 68 కోట్ల వ్యయంతో 34 వేల మంది అర్హులైన రైతులకు వ్యవసాయ పనిముట్లు అందించే కార్యక్రమంలో భాగంగా స్థానిక గిరిజన రైతులకు పరికరాలను పంపిణీ చేశారు.

Loading