గన్నవరం విమానాశ్రయానికి పునర్ వైభవం : యార్లగడ్డ

Spread the love

గన్నవరం విమానాశ్రయానికి పునర్ వైభవం : యార్లగడ్డ
గన్నవరం :
తమ కూటమి ప్రభుత్వ చొరవతో గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయానికి పునర్వైభవం వచ్చిందని ప్రభుత్వ విప్, గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు తెలిపారు. గన్నవరం సింగపూర్ విమాన సర్వీసును శనివారం ఉదయం ఎమ్మెల్యే యార్లగడ్డ జండా ఊపి ప్రారంభించారు. సింగపూర్ విమాన సర్వీసు ప్రారంభోత్సవ సందర్భంగా కేకు కోసి, మొదటి ప్రయాణికునికి బోర్డింగ్ పాసును అందజేశారు. ఈ సందర్భంగా వెంకట్రావు మాట్లాడుతూ 2014-19 మధ్యకాలం తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో గన్నవరం విమానాశ్రయానికి అంతర్జాతీయ గుర్తింపు తీసుకురావడంతో పాటు ప్రభుత్వం శ్రద్ధ చూపటంతో ఇక్కడి నుంచి ప్రతిరోజు 30 విమాన సర్వీసులు నడిచేవని అత్యధిక ప్రయాణికుల సగటుతో దేశంలోనే మొదటి స్థానంలో ఉందని తెలిపారు. తదుపరి వచ్చిన వైసీపీ ప్రభుత్వం అశ్రద్ధ చేయటంతో విమాన సర్వీసులు తగ్గిపోయి ప్రయాణికుల సంఖ్య గణనీయంగా తగ్గింది అన్నారు. తాజాగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు చొరవతో ఆరేళ్లుగా ఆగిపోయిన సింగపూర్ విమాన సర్వీసు తిరిగి ప్రారంభమైందని యార్లగడ్డ చెప్పారు. ప్రస్తుతం గన్నవరం విమానాశ్రయం నుండి ప్రతిరోజు 45 విమాన సర్వీసులు నడుస్తుండగా 4వేల మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నట్లు యార్లగడ్డ వివరించారు. ఉమ్మడి తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణ, గుంటూరు, ప్రకాశం జిల్లాల నుండి ఎక్కువమంది విదేశాలకు రాకపోకలు సాగిస్తున్నందున వీరికి గన్నవరం విమానాశ్రయం అనుకూలంగా ఉంటుందని ఇక్కడి నుంచి విదేశీ విమానాలకు కనెక్టివిటీని పెంచగలిగితే ఈ ఐదు జిల్లాల ప్రజలకు ఎంతో ఉపయోగంగా ఉంటుందన్నారు. రాబోయే ఏడు నెలల కాలంలో అంతర్జాతీయ టెర్మినల్ నిర్మాణం పూర్తిచేసుకుని ప్రారంభోత్సవానికి సిద్ధమవుతుందని యార్లగడ్డ పేర్కొన్నారు. కతార్, అరబ్ ఎమిరేట్స్ కు విమాన సర్వీసు ఏర్పాటు చేయాలని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుకి ప్రతిపాదనలు పంపినట్లు ఎమ్మెల్యే వెంకట్రావు తెలిపారు. విమానాశ్రయానికి భూములు ఇచ్చిన రైతులకు అమరావతిలో భూములు కేటాయింపు, పరిహారం చెల్లింపు వంటి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఈ సందర్భంగా యార్లగడ్డ హామీ ఇచ్చారు. గన్నవరం విమానాశ్రయం అభివృద్ధికి కృషి చేస్తున్న కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో విమానాశ్రయం డైరెక్టర్ లక్ష్మీకాంత్ రెడ్డి గన్నవరం మండల టిడిపి అధ్యక్షులు గూడపాటి తులసి మోహన్ తదితరులు పాల్గొన్నారు.

Loading