ఎన్టీఆర్ జిల్లా,
3-8-2025
స్వచ్ఛ విజయవాడ సాధించుకుందాం…
పర్యావరణ పరిరక్షణపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలి
ప్లాస్టిక్ ఉత్పత్తుల వినియోగాన్ని పూర్తిగా నిర్మూలించుకుందాం భావితరాలకు ఆరోగ్యకరమైన భవిష్యత్తును అందిద్దాం
ఔత్సాహిక కళాకారులతో సాంప్రదాయ నృత్య ప్రదర్శన పోటీలు
విజయవాడ :
పర్యావరణ పరిరక్షణకై జిల్లా యంత్రాంగం, నగరపాలక సంస్థ వివిధ రూపాల్లో ప్రజలను చైతన్యవంతం చేసేందుకు కార్యక్రమాలు నిరంతరాయంగా నిర్వహిస్తున్నామని జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ అన్నారు.
స్వచ్ఛ విజయవాడ సాధనలో భాగంగా జిల్లా యంత్రాంగం, నగరపాలక సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో హరిత బెరం పార్కులో సంప్రదాయ నృత్య పోటీలను జిల్లా కలెక్టర్ లక్ష్మీశ, నగరపాలక సంస్థ కమిషనర్ హెచ్ఎం ధ్యానచంద్ర ఆదివారం లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నగరంలోని ఔత్సాహిక నృత్య కళాకారులు తమ తమ ప్రతిభా పాటవాలను ప్రదర్శించేందుకు ఇటువంటి వేదికలు దోహదపడతాయన్నారు. విజయవాడ నగరం ప్రతిభావంతులైన కళాకారులకు కేంద్రంగా ఉందన్నారు. సాంస్కృతిక, సాహిత్య, సామాజిక సేవ… ఏ రంగాన్ని తీసుకున్నా ప్రపంచ స్థాయిలో ఎంతోమంది నగరం నుంచి వారి ప్రస్థానం ప్రారంభించారని గుర్తు చేశారు. పర్యావరణ పరిరక్షణపై తరచుగా ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడం వల్ల ప్రజలలో అవగాహన పెరుగుతుందన్నారు. ఇప్పటికే నగరంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధం కొనసాగుతోందన్నారు. ప్లాస్టిక్ కవర్ల వినియోగం వల్ల పర్యావరణానికి హాని జరగడమే కాకుండా నగర ప్రజలు ఆరోగ్య సమస్యలు కూడా ఎదుర్కొంటారన్నారు. బాలబాలికల్లో పర్యావరణం పై అవగాహన పెంపొందించేందుకు మరిన్ని కార్యక్రమాలు నిర్వహిస్తామని కలెక్టర్ పేర్కొన్నారు.
నగరపాలక సంస్థ కమిషనర్ హెచ్ఎం ధ్యానచంద్ర మాట్లాడుతూ ప్లాస్టిక్ ఉత్పత్తుల నిరోధంపై ప్రజలలో చైతన్యం పెంచేందుకు వివిధ కళారూపాలతో ప్రచార కార్యక్రమాలు నిర్వహించడంలో భాగంగా వరుసగా ఐదు ఆదివారాలు ఈ నృత్య పోటీలు జరుగుతాయన్నారు. ఈ పోటీలలో వయస్సుల వారీగా కళాకారులు తమ ప్రదర్శనలు ఇస్తున్నారన్నారు. ఇటువంటి కార్యక్రమాల ప్రధాన ఉద్దేశం స్వచ్ఛ విజయవాడ సాధన కోసమేనన్నారు. ఐదవ ఆదివారం విజేతలకు బహుమతి ప్రదానం ఉంటుందన్నారు. జాయింట్ కలెక్టర్ యస్. ఇలక్కియ, మేరీటైం బోర్డు సీఈవో ప్రవీణ్ ఆదిత్య తదితరులు పాల్గొన్నారు.