సింగయ్య నలిగిన దృశ్యాలు భయానకం – ఇదేం రాజకీయం? ఇదెక్కడి రాక్షస ఆనందం?: వైఎస్ షర్మిల
కారు కింద పడ్డారని చూడకుండా కాన్వాయ్ కొనసాగడం ఏంటని షర్మిల ఆగ్రహం – ఈ ఘటన పూర్తిగా జగన్ బాధ్యతారాహిత్యానికి అద్దం పడుతుందని వ్యాఖ్య
వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి వాహనం కిందపడి సింగయ్య నలిగిన దృశ్యాలు భయానకంగా ఉన్నాయని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్సార్సీపీ బలప్రదర్శనలకు, హత్యలకు జగన్ ఏం సమాధానం చెబుతారంటూ ఎక్స్ వేదికగా ప్రశ్నలు సంధించారు. కారు కింద పడ్డారని చూడకుండా కాన్వాయ్ కొనసాగడం ఏంటని ప్రశ్నించారు. ప్రజల ప్రాణాలు తీసే హక్కు ఎవరిచ్చారని నిలదీశారు.
బెట్టింగ్‌లో ఓడిపోయి ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి విగ్రహావిష్కరణకు ఇద్దరిని బలి ఇస్తారా అని షర్మిల ప్రశ్నించారు. ఇదేం రాజకీయం, ఇదెక్కడి రాక్షస ఆనందమని విమర్శించారు. మీ ఉనికి కోసం జనాలను టైర్ల కింద తొక్కుకుంటూ పోతారా? అని అన్నారు. ప్రజల ప్రాణాలతో శవ రాజకీయాలు చేస్తారా అని నిలదీశారు. కారు సైడ్ బోర్డ్ మీద నిలబడి ఒక నాయకుడిగా కాన్వాయ్ మూవ్ చేయించడం సబబేనా? అని పేర్కతొన్నారు. ఇది పూర్తిగా జగన్ బాధ్యతా రాహిత్యానికి అద్దం పడుతోందని షర్మల ఆగ్రహం వ్యక్తం చేశారు.
బలప్రదర్శన చేసి సింగయ్య మృతికి జగన్ కారణమయ్యారని షర్మిల ఆరోపించారు. పర్మిషన్‌కి విరుద్ధంగా జన సమీకరణ జరుగుతుంటే పోలీసులు ఎలా సహకరించారని ప్రశ్నించారు. అలా ఎందుకు ప్రేక్షక పాత్ర వహించారు, ఇంటెలిజెన్స్ వ్యవస్థను ఎందుకు నిద్ర పుచ్చారని నిలదీశారు. ప్రజా సమస్యలపై పోరాడితే ఆంక్షలన్నీ కాంగ్రెస్ పార్టీకేనా? హస్తం పార్టీ చేసే ఉద్యమాలకు, ధర్నాలకు హౌస్ అరెస్ట్‌లు చేస్తారని చెప్పారు. దీక్షలు భగ్నం చేస్తారని ర్యాలీలను తొక్కిపెట్టి తమ గొంతు నొక్కుతారని వ్యాఖ్యానించారు. వైఎస్సార్సీపీ చేసిన బలప్రదర్శనలకు, హత్యలకు జగన్ ఏం సమాధానం చెబుతారు? కూటమి ప్రభుత్వం ఏం సమాధానం చెబుతుంది? అని షర్మిల ప్రశ్నించారు.