
తేదీ: నవంబర్ 11, 2025 విజయవాడ, ఇంద్రకీలాద్రి
శ్రీ అమ్మవారి దర్శనానికి పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు: ఈఓ వి. కె. శీనా నాయక్
విజయవాడలోని ప్రసిద్ధ ఇంద్రకీలాద్రి దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానంలో భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టాలని దేవస్థానం కార్యనిర్వాహక అధికారి (ఈఓ) మరియు స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ శ్రీ వి.కె. శీనా నాయక్ ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు ఈరోజు మహామండపం నాలుగవ అంతస్తులో భద్రతా సిబ్బందితో ప్రత్యేక సమావేశం నిర్వహించారు.
సమావేశంలో ఈఓ భద్రతా సిబ్బందికి, నిర్వాహక బృందాలకు పలు కీలక సూచనలు చేశారు. వాటి వివరాలు:
1. “జై భవాని” నినాదం, మర్యాదపూర్వక ప్రవర్తన: ప్రతి భక్తుడిని “జై భవాని” అనే నినాదంతో పలకరించాలని, వారితో అత్యంత మర్యాదపూర్వకంగా, వినయంతో మాట్లాడాలని ఈఓ సూచించారు. భక్తుల పట్ల సిబ్బంది ప్రవర్తన ప్రధానంగా ఉండాలని ఉద్ఘాటించారు.
2. ట్రాఫిక్ / వాహనములు నియంత్రణ: భారీ రద్దీ సమయాల్లో ట్రాఫిక్‌ను సమర్థవంతంగా నియంత్రించాలని, ఎక్కడా ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
3. రోప్ వ్యవస్థ, క్యూ లైన్ల నిర్వహణ: రద్దీ ఎక్కువగా ఉన్నప్పుడు ఘాట్ రోడ్డు మరియు మహామండపం వద్ద భక్తులను భాగస్వామ్య పద్ధతిలో (రోప్ వ్యవస్థ ద్వారా) కొద్దికొద్దిగా అనుమతించాలని, తద్వారా భక్తులు తోపులాటకు గురికాకుండా, క్యూ లైన్లలో తొక్కిసలాటలు జరగకుండా నివారించవచ్చని తెలిపారు.
4. అనధికార వ్యక్తులపై నిఘా: ఆలయ ప్రాంగణంలో, క్యూ లైన్లలో అనుమానాస్పదంగా సంచరించే అనధికార వ్యక్తులపై నిశితంగా గమనించాలని, ఎవరైనా అలాంటి వారు కనిపిస్తే వెంటనే ఆలయ పోలీస్ అవుట్‌పోస్టుకు లేదా అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు.
5. దుర్గా ఘాట్ లో యాత్రికులను ఆ ప్రాంతంలో అప్రమత్తం చేయాలి, కనకదుర్గ నగర్ లో లగేజ్ , క్లోక్ రూములో భద్రపరిచే చర్యలు చేపట్టాలి
ఈ ఆదేశాలను భద్రతా సిబ్బంది, సంబంధిత విభాగాలు కచ్చితంగా పాటించాలని, భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అమ్మవారి దర్శన ఏర్పాట్లు పర్యవేక్షించాలని ఈఓ శ్రీ శీనా నాయక్ స్పష్టం చేశారు. భక్తుల సంతృప్తే ఆలయ ముఖ్య లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. ఈ సమావేశంలో ఆలయ అధికారులు సెక్యూరిటీ అధికారులు సెక్యూరిటీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
![]()
