విరాట్ కోహ్లీ కీలక ఇన్నింగ్స్

0

 


ఐపీఎల్ 2024లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) బోణీ కొట్టింది. విరాట్ కోహ్లీ కీలక ఇన్నింగ్స్, చివరిలో దినేశ్ కార్తీక్, లోమ్రోర్ రాణించడంతో ప్రత్యర్థి పంజాబ్ కింగ్స్‌పై ఆఖరి ఓవర్‌లో ఆర్సీబీ విక్టరీ సాధించింది. పంజాబ్ నిర్దేశించిన 177 పరుగుల లక్ష్యాన్ని 6 వికెట్లు కోల్పోయి మరో 4 బంతులు మిగిలివుండగానే ఆర్సీబీ ఛేదించింది. దీంతో 4 వికెట్ల తేడాతో జయకేతనం ఎగురవేసింది. ఈ గెలుపులో స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ కీలక పాత్ర పోషించాడు. లక్ష్య ఛేదనలో 77 పరుగులు బాది జట్టుని విజయతీరాలకు తీసుకెళ్లాడు. కోహ్లీ ఇన్నింగ్స్‌లో 11 ఫోర్లు, 2 సిక్సర్లు ఉన్నాయి. ఒక ఎండ్‌లో మిగతా ఆటగాళ్లు పెద్దగా రాణించలేకపోయినప్పటికీ కోహ్లీ క్రీజులో పాతుకుపోయి చూడ చక్కటి షాట్లు బాదాడు. మంచి దూకుడు మీద కనిపించిన విరాట్ పంజాబ్ బౌలర్ సామ్ కర్రాన్ వేసిన తొలి ఓవర్‌లోనే 4 బౌండరీలు బాదాడు. పవర్‌ప్లే తర్వాత కూడా పంజాబ్ బౌలర్లపై ఇదే జోరును కొనసాగించాడు.


విరాట్ కోహ్లీ ఔటయ్యాక లక్ష్య ఛేదనలో చివరి 24 బంతుల్లో 47 పరుగులు అవసరమయ్యాయి. ఈ సమయంలో ఫినిషర్ కార్తీక్, ఇంపాక్ట్ ప్లేయర్ లోమ్రోర్ అద్భుతంగా ఆడారు. ఇద్దరూ సిక్సర్లు, ఫోర్లతో విరుచుకుపడ్డారు. సామ్ కుర్రాన్‌, అర్ష్‌దీప్, హర్షల్ పటేల్ ఓవర్లలో భారీ షాట్లు బాదారు. మొత్తంగా గెలుపు సమీకరణం చివరి ఓవర్‌లో 10 పరుగులుగా మారింది. అర్షదీప్ సింగ్ వేసిన ఫైనల్ ఓవర్‌లో మొదటి బంతికే కార్తీక్ సిక్సర్ బాదాడు. తర్వాతి బంతి వైడ్ కావడంతో ఒక పరుగు వచ్చింది. ఇక ఆ తర్వాత బంతికి అద్భుతమైన ఫోర్ కొట్టడంతో బెంగళూరు జయకేతనం ఎగురవేసింది. దినేశ్ కార్తీక్ (28), లోమ్రోర్ (17) కీలకమైన పరుగులు రాబట్టారు. పంజాబ్ కింగ్స్ బౌలర్లలో కగిసో రబడ, హర్దీప్ బ్రార్ చెరో రెండు వికెట్లు పడగొట్టగా.. సామ్ కర్రాన్, హర్షల్ పటేల్ చెరో వికెట్ తీశారు.


ఇక తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 176 పరుగులు చేసింది. శిఖర్ ధావన్ (45)తో పాటు ప్రభ్‌సిమ్రాన్, సామ్ కుర్రాన్, జితేష్ శర్మ, శశాంక్ సింగ్ ఫర్వాలేదనిపించారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version