ఎన్‌టీఆర్ జిల్లా/ఇబ్రహీంపట్నం, జులై 31, 2025
లోతట్టు ప్రాంతాలపై పూర్తి అప్రమత్తంగా ఉన్నాం
- క్షేత్రస్థాయిలో అందుబాటులో అధికారుల బృందాలు
- వరద పరిస్థితులను నిరంతరం పర్యవేక్షిస్తున్నాం
- ప్రజలు ఆందోళన చెందాల్సిన పని లేదు
- జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ పులిచింతల నుంచి వరద నీరు నిలకడగా వస్తోందని.. దీంతో ప్రకాశం బ్యారేజ్ అన్ని గేట్లు పైకిఎత్తి నీటిని కిందకు విడుదల చేస్తున్నామని, లోతట్టు ప్రాంతాలపై పూర్తి అప్రమత్తంగా ఉన్నామని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ అన్నారు.
కలెక్టర్ లక్ష్మీశ గురువారం అధికారులతో కలిసి ఇబ్రహీంపట్నం మండలంలో పర్యటించారు. చిన లంక, పెద్ద లంక, ఫెర్రీ తదితర ప్రాంతాలను సందర్శించి.. వరద ఉద్ధృతి పరిస్థితిని పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ బ్యారేజీకి ఎగువన, దిగువన ఉన్న ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశామని.. రెవెన్యూ, ఇరిగేషన్, పోలీస్, పంచాయతీరాజ్, మునిసిపల్ తదితర శాఖల అధికారులు, సిబ్బంది క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండేలా ఆదేశాలిచ్చామన్నారు. గురువారం సాయంత్రం నాటికి వరద ఉద్ధృతి మూడు లక్షల క్యూసెక్కులకు చేరుకునే అవకాశమున్నందున కృష్ణానది పరీవాహక ప్రాంతాల ప్రజలు వాగులు, వంకలు, కాలువలు వంటివి దాటే ప్రయత్నం చేయొద్దని.. చేపల వేటకు వెళ్లడం, పశువులు, గొర్రెలు, మేకలు వంటివాటిని వదలడం చేయొద్దని సూచించారు. నది వైపు వెళ్లకుండా పిల్లలను కూడా జాగ్రత్తగా చూసుకోవాలన్నారు. వరదకు సంబంధించి ప్రజల నుంచి సమస్యలను తెలుసుకునేందుకు, ఆ సమస్యల పరిష్కారానికి తక్షణం స్పందించి, క్షేత్రస్థాయిలో సమన్వయ శాఖల బృందాలను అప్రమత్తం చేసేందుకు జిల్లా కలెక్టరేట్‌లో 91549 70454 నంబరుతో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని.. ఇది 24 గంటలూ పనిచేస్తుందని కలెక్టర్ లక్ష్మీశ తెలిపారు. ఎస్డీఆర్ఎఫ్ బృందాలు కూడా సిద్ధంగా ఉన్నాయన్నారు. వరద పరిస్థితిపై ప్రజలెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అయితే జాగ్రత్తగా ఉండాలని, అధికారులు, సిబ్బంది చేసిన సూచనలను పాటించాలని సూచించారు.
కలెక్టర్ లక్ష్మీశ వెంట విజయవాడ ఆర్‌డీవో కావూరి చైతన్య, ఇబ్రహీంపట్నం తహసీల్దార్ వై.వెంకటేశ్వర్లు, కొండపల్లి మునిసిపల్ కమిషనర్ రమ్య కీర్తన తదితరులు ఉన్నారు.