పత్రికా ప్రకటన
విజయవాడ
02-07-2025
డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం క్రియాశీలకంగా వ్యవహరించాలి
నాణ్యమైన వైద్య విద్య ప్రమాణాలకోసం కళాశాలలపై నిఘా పెట్టాలని మంత్రి ఆదేశం
లక్ష్యం లేకుండా సాగుతున్న పరిశోధన కార్యక్రమాల్ని గాడిన పెట్టాలి
39 ఏళ్ల విశ్వవిద్యాలయ పనితీరు సమీక్ష, సంస్కరణల కోసం కమిటీ వేస్తాం
మొదటిసారిగా మంత్రి స్థాయిలో పనితీరు సమీక్ష జరిగిందన్న అధికారులు
రెండు గంటల పాటు విశ్వవిద్యాలయ పనితీరును సమగ్రంగా సమీక్షించిన మంత్రి సత్యకుమార్ యాదవ్
39 ఏళ్ల చరిత్ర కలిగిన డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయ పనితీరును వైద్యారోగ్య శాఖా మంత్రి సత్యకుమార్ యాదవ్ రెండు గంటలకు పైగా బుధవారంనాడు విశ్వవిద్యాలయ కాన్ఫరెన్స్ హాల్లో సమగ్రంగా సమీక్షించారు. 1986లో విశ్వవిద్యాలయం ఏర్పాటైనప్పట్నించీ వైద్యారోగ్య శాఖా మంత్రి స్థాయిలో సమీక్ష జరగడం ఇదే మొదటిసారి అని అధికారులు తెలపగా మంత్రి ఆశ్చర్యపోయారు. పలు ప్రధాన విషయాల్లో విశ్వవిద్యాలయం పనితీరు మెరుగుపడాలని మంత్రి వ్యాఖ్యానించారు. గతానికి భిన్నంగా ఇకనుంచి విశ్వవిద్యాలయం క్రియాశీలకంగా వ్యవహ రించి వైద్య విద్య వికాసానికి కృషి చేయాలని ఆయన ఆదేశించారు.
తనిఖీలు ఎక్కడ?
సమీక్ష సందర్భంగా ఎంతో ప్రాధాన్యత కలిగిన డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం ప్రధాన విషయాలపై దృష్టి పెట్టకుండా సాధారణ బాధ్యతల నిర్వహణతో సాగుతోందని మంత్రి ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని వైద్య కళాశాలల్లో విద్యాబోధన నాణ్యతను పెంచడంపై ఇంతవరకు దృష్టి సారించిన దాఖలాలు లేవని ఆయన అన్నారు. కేవలం సిలబస్ తయారీ, పరీక్షల నిర్వహణకు పరిమితమవడం డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం చట్టం స్ఫూర్తిని, ఆశయాలను నిర్లక్ష్యం చేసినట్టవుతుందని మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆందోళన వ్యక్తం చేశారు.
వైద్య విద్య ప్రమాణాల పెంపు దిశగా విశ్వవిద్యాలయం చేపట్టిన తనిఖీలు, వాటికి సంబంధించిన నివేదికల వివరాలు అడిగిన మంత్రికి ఈ దిశగా నిర్దిష్టమైన ప్రయత్నాలు జరగలేదని అధికారులు తెలపగా మంత్రి అంసతృప్తిని వ్యక్తం చేశారు. ఉన్నత వైద్య విద్య నాణ్యత కోసం మౌలిక సదుపాయాలు, బోధానా తీరులు, వైద్యులు, విద్యార్థుల హాజరుపై పటిష్టమైన నిఘా విధానాన్ని రూపొందించాలని మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆదేశించారు.
సంబంధిత 1986 చట్టంలో విశ్వవిద్యాలయం ఏర్పాటుకు సంబంధించి పొందుపరచిన 3 ప్రధాన ఉద్దేశాల్లో వైద్య విద్య మరియు పరిశోధన ప్రమాణాలను పెంచడం ఒకటని మంత్రి చట్టాన్ని చదివి వినిపించారు. ఈ లక్ష్యానికి సంబంధించి పటిష్టమైన విధివిధానాలతో విశ్వవిద్యాలయ అధికారులు కృషి చేయాలని మంత్రి ఆదేశించారు. ఇందుకు సంబంధించి నివేదికలను క్రమం తప్పకుండా తమకు పంపాలని ఆయన సూచించారు.
పరిశోధనా రంగాన్ని గాడిన పెట్టాలి
విశ్వవిద్యాలయ స్థాపన ఏర్పాటు ఉద్దేశాల్లో ఒకటైన వైద్య విద్య పరిశోధన తీరుతెన్నులపై మంత్రి విస్తారంగా ఆరా తీశారు. నిర్దిష్టమైన లక్ష్యాలు , ప్రణాళికల మేరకు పరిశోధనలు జరగడంలేదని తెలుసుకున్న మంత్రి కొంతమేరకు అసంతృప్తికి గురయ్యారు. రా ష్ట్రంలో విస్తృత స్థాయిలో ప్రభుత్వాసుపత్రులు ప్రతిరోజూ వేలాదిమందికి ఓపీ, ఐపీ సేవలు అందిస్తూ వ్యాధులకు సంబంధించి భారీ స్థాయిలో అమూల్యమైన సమాచారాన్ని సేకరిస్తున్నప్పటికీ ఇందుకనుగుణంగా వ్యాధులు, ప్రాంతాల వారీగా పరిశోధనలు జరగకపోవడం, మొక్కుబడిగా పరిశోధనా ప్రాజెక్టుల్ని చేపట్టడం సబబు కాదని మంత్రి అన్నారు.
వైద్య పరిశోధనా రంగాన్ని ప్రక్షాళన చేసి ప్రాధాన్యాల నిర్ధారణతో ప్రజోపయోగమైన పరిశోధనలు చేపట్టేందుకు పటిష్టమైన విధివిధానాలను రూపొందించాలని మంత్రి సత్యకుమార్ యాదవ్ విశ్వవిద్యాలయ అధికారుల్ని ఆదేశించారు. ఆరోగ్య విజ్ఞాన వికాసానికి తోడ్పడే విధంగా పరిశోధనలు జరగాలని ఆయన సూచించారు.
పనితీరు అధ్యయనం, దిశానిర్దేశాలకు కమిటీ
బుధవారంనాడు రెండు గంటల పాటు జరిగిన సమీక్ష సందర్భంగా మంత్రి ఒక ప్రధానమైన ప్రకటన చేశారు. గత 39 ఏళ్లుగా విశ్వవిద్యాలయ పనితీరు, సాధించిన ఫలితాలు, లోపాలు, విశ్వవిద్యాలయ ఏర్పాటు ఉద్దేశాల సాకారం దిశగా ప్రగతి, వైద్య విద్య, ఆరోగ్యాలకు సంబంధించి ఎదురవుతున్న సవాళ్లను అవకాశాలుగా మార్చుకునేందుకు విశ్వవిద్యాలయం సామర్ధ్యం, భవిష్యత్తు ప్రణాళికలకు సంబంధించిన అంశాలపై సమగ్రంగా సమీక్షించి తగు మార్పుల్ని, సంస్కరణలను సూచించడానికి ఒక ఉన్నతస్థాయి నిపుణుల కమిటీని ఏర్పాటు చేస్తామని మంత్రి సత్యకుమార్ యాదవ్ ప్రకటించారు.
1986లో ఏడు అనుబంధ కాలేజీలతో ప్రారంభమైన డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయానికి అనుబంధంగా ప్రస్తుతం 500లకు పైగా వైద్య విద్య, దంత విద్య, ఆయుష్ మరియు నర్సింగ్ కళాశాలలున్నాయి.
ఈ సమీక్షా సమావేశంలో విశ్వవిద్యాలయ ఉపకులపతి డాక్టర్ పి.చంద్రశేఖర్, రిజిస్ఠ్రార్ డాక్టర్ రాధికారెడ్డి, డిఎంఇ డాక్టర్ నర్సింహం, పలువురు అధికారులు పాల్గొన్నారు.