రహదారి భద్రతకు చర్యలు చేపట్టాలి జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ
గన్నవరం: జూలై 02, 2025
జాతీయ రహదారి భద్రత, సుందరీకరణకు అవసరమైన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు.
బుధవారం సాయంత్రం జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ గన్నవరం మండలం, కేసరపల్లి గ్రామం బుడమేరు వంతెన వద్ద నుంచి విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం వరకు జాతీయ రహదారి మార్గంలో గుంతలు, బుడమేరు వంతెనపై పగుళ్లు, డివైడర్ మీద పని చేయని విద్యుత్ దీపాలు, రహదారికి ఇరువైపులా పారిశుధ్యం నిర్వహణ తదితర అంశాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయమునకు నిత్యం ప్రముఖులు ప్రయాణాలు చేస్తుంటారని, సజావుగా ప్రయాణించేందుకు జాతీయ రహదారి మార్గంలో ఎటువంటి అసౌకర్యం లేకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. బుడమేరు వంతెనపై పగుళ్లను పరిశీలించి, వంతెనపై వర్షపు నీరు నిలవకుండా చూడాలని, నీరు బయటకు పోయేందుకు ఏర్పాటు చేసిన పైపుల్లో మట్టిని తొలగించాలని, అదేవిధంగా రహదారికిరువైపులా వర్షపు నీరు నిలవకుండా తగిన చర్యలు తీసుకోవాలన్నారు. డివైడర్ పైన కొన్ని విద్యుత్ దీపాలు వెలగకపోవడం గమనించిన ఆయన వాటికి తక్షణమే మరమ్మతులు చేపట్టి అన్ని విద్యుత్ దీపాలు పూర్తిస్థాయిలో పనిచేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. విద్యుత్ స్తంభాలకు సంఖ్యలు కేటాయించాలని, తద్వారా దీపాలు వెలగనప్పుడు సంఖ్య ఆధారంగా సూచనలు చేయడానికి వీలవుతుందన్నారు. రహదారికి ఇరువైపులా పిచ్చి మొక్కలు ఏపుగా పెరిగి రహదారి మీదకి విస్తరించాయని, వాటిని తొలగించి పూల కుండీలను ఏర్పాటు చేయాలని సూచించారు. రహదారి పక్కన ప్రకటనలకు సంబంధించిన కొత్త హోర్డింగులు ఏర్పాటు చేయకుండా చూడాలన్నారు. మార్గంలో ఎక్కడా కూడా గుంతలు లేకుండా మరమ్మతులు చేపట్టాలని, డివైడర్ కు రంగులు వేయాలని సూచించారు.
భారత జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ పీడీ విద్యాసాగర్, పంచాయతీ రాజ్ ఎస్ఈ రమణరావు, డీపీఓ జె అరుణ, గన్నవరం తహశీల్దారు శివయ్య, ఎంపీడీవో స్వర్ణ లత, పంచాయితీ సెక్రటరీ ప్రసాద్, ఇతర అధికారులు తదితరులు కలెక్టర్ వెంట ఉన్నారు.