మచిలీపట్నం నియోజకవర్గంలో చదువుకున్న యువతీ యువకులందరికీ ఉద్యోగ అవకాశాలు కల్పించి నిరుద్యోగులు లేకుండా రూపుమాపుతానని

0

మచిలీపట్నం జూలై 16

మచిలీపట్నం నియోజకవర్గంలో చదువుకున్న యువతీ యువకులందరికీ ఉద్యోగ అవకాశాలు కల్పించి నిరుద్యోగులు లేకుండా రూపుమాపుతానని, వచ్చిన ఉద్యోగ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర గనులు భూగర్భవనరులు ఎక్సైజ్ శాఖ మంత్రివర్యులు కొల్లు రవీంద్ర పేర్కొన్నారు.

బుధవారం ఉదయం నగరంలోని ఆంధ్ర జాతీయ కళాశాలలో రాష్ట్ర నైపుణ్యాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన మెగా జాబ్ మేళా ప్రారంభ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రివర్యులు ముఖ్యఅతిథిగా విచ్చేసి జిల్లా కలెక్టర్ డీకే బాలాజీతో కలిసి వివిధ కంపెనీల స్టాళ్లను పరిశీలించారు.

అనంతరం ఏర్పాటుచేసిన సభలో విద్యార్థులను ఉద్దేశించి మంత్రివర్యులు మాట్లాడుతూ
రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా నైపుణ్యాల అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళాలు నిర్వహిస్తోందన్నారు.

రాష్ట్రంలో నిరుద్యోగ యువతీ యువకులకు20 లక్షల ఉద్యోగాలు కల్పించాలని లక్ష్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రివర్యులు నారా లోకేష్ కృషి చేస్తున్నారన్నారు.

ఇందుకోసం మంత్రులతో ఏర్పాటుచేసిన సబ్ కమిటీలో తాను కూడా సభ్యులుగా ఉన్నానని, ప్రతి మంత్రివర్గ సమావేశం జరిగిన తర్వాత తాము నైపుణ్యాల అభివృద్ధి ఏ విధంగా చేయాలి, ఉద్యోగ అవకాశాలు ఎలా కల్పించాలి అనే అంశాల పైన చర్చించడం జరుగుతుందన్నారు.

రాష్ట్ర ముఖ్యమంత్రి 1994లో ఒక విజన్ డాక్యుమెంట్ 2020 తయారుచేసి కంప్యూటర్ సాఫ్ట్వేర్ సంస్థతో అనుసంధానమై హైదరాబాదులో హైటెక్ సిటీ ని నిర్మించారన్నారు. ప్రపంచంలో ఏ దేశానికి వెళ్లిన మనవాళ్లు ఐటి నిపుణులుగా ఉన్నారన్నారు.

యువతలో ఉన్న ప్రతిభను వెలికి తీయడానికి 2014-19 లో రాష్ట్ర ముఖ్యమంత్రి నైపుణ్య అభివృద్ధి సంస్థను ఏర్పాటు చేశారన్నారు.

ఇకపై మచిలీపట్నం నియోజకవర్గంలో ప్రతి ఆరు నెలలకు ఒకసారి జాబ్ మేళా నిర్వహిస్తామని నిరుద్యోగ యువతీ యువకులు ఎప్పటికప్పుడు నైపుణ్యాలను పెంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.

చిన్న ఉద్యోగాలు లేదా వ్యాపారాలని మానుకోకుండా అందులో చేరి మెలకువలు నేర్చుకుని పెద్ద అవకాశాలు పొందాలన్నారు.

నేడు ప్రపంచంలో ఏ దేశంలోనైనా ఆహారానికి సంబంధించిన ఆర్డర్ పెట్టుకోవాలంటే స్విగ్గి ని ఆశ్రయిస్తున్నారని, దాని రూపకర్త మన ఉయ్యూరు నివాసి హర్ష అందరికి స్ఫూర్తిదాయకమన్నారు.
నేటి యువత సాంకేతికతను అందిపుచ్చుకోవాలని, ముఖ్యమంత్రి పిలుపు మేరకు మైక్రోసాఫ్ట్ సంస్థ క్వాంటం లేబరేటరీ నెలకొల్పేందుకు ముందుకు వచ్చిందన్నారు.

మచిలీపట్నం నగరాన్ని ఒక ఆదర్శవంతమైన నగరంగా అభివృద్ధి పరిచేందుకు అన్ని విధాల కృషి చేస్తున్నామన్నారు
2026 జూన్–డిసెంబర్ నాటికి మచిలీపట్నం ఓడరేవు నిర్మాణం పూర్తయి రవాణా రాకపోకలు మొదలవుతాయన్నారు. ఓడరేవు అనుబంధంగా పలు ఉద్యోగాలు రాబోతున్నాయన్నారు.
యువత ఖాళీగా ఉండి సమయం వృధా చేయరాదని తెలియజేశారు.

గోవా షిప్పింగ్ కంపెనీ వారు ఓడల నిర్మాణానికి స్థలం కావాలని కోరుతూ ముఖ్యమంత్రితో ఎంఓయూ చేసుకునేందుకు ముందుకు వచ్చారన్నారు. తద్వారా పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కూడా లభిస్తాయన్నారు.

సింహాద్రి టిఎంటి, వైజాగ్ వారు 10 వేల కోట్ల రూపాయల పెట్టుబడితో స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి 1000 ఎకరాల స్థలం కావాలని కోరారన్నారు.

మచిలీపట్నం ఓడరేవు, మంగినపూడి బీచ్, జాతీయ రహదారులు, విమానాశ్రయం వంటి పలు రకాల సదుపాయాలు ఉన్నందున రానున్న రోజుల్లో మచిలీపట్నానికి మంచి భవిష్యత్తు రాబోతుందన్నారు.

అక్టోబర్ 2 వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి ఆంధ్ర జాతీయ కళాశాలకు వచ్చారని ఆ సమయంలో సమీపంలో చెత్తాచెదారాలను తొలగించి చెత్త లేకుండా చేయాలని సూచించారన్నారు.
రానున్న అక్టోబర్ 2 తేదీ నాటికి ఈ ప్రాంతంలో చెత్తాచెదారం లేకుండా తొలగించి మంచి పార్కు అభివృద్ధికి కృషి చేస్తున్నామన్నారు.

ఆంధ్ర జాతీయ కళాశాలకు పూర్వవైభవం రాబోతోందని, ఒక గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ గా తీర్చిదిద్దేందుకు రీసెర్చ్ సెంటర్ ను నెలకొల్పేందుకు మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రివర్యులు నారా లోకేష్ కృషి చేస్తున్నారన్నారు.

ఒక చిన్న ఆలోచన చాలా మార్పులకు నాంది పలుకుతుందన్నారు.

మంగినపూడి బీచ్ ఉత్సవం ద్వారా పర్యాటక రంగం అభివృద్ధికి ఎంతో మంచి అవకాశాలు ఉన్నాయని ప్రపంచానికి తెలిసిందన్నారు.
పర్యాటక రంగ అభివృద్ధికి ఒక సమగ్ర ప్రాజెక్టు నివేదికను తయారుచేసి స్వదేశీ దర్శన్ నిధులు పొందుట కోసం ప్రతిపాదనలు పంపామన్నారు.
గనుల శాఖలో కూడా చాలా పరిశోధన అవకాశాలు ఉన్నాయని, ఒక క్రిటికల్ మినరల్ పార్క్ మచిలీపట్నంలో ఏర్పాటు చేయుటకు సన్నాహాలు చేస్తున్నామన్నారు.
ఖనిజాలను ప్రాసెస్ చేసి విదేశాలకు పంపడం, విదేశాల నుండి ముడి సరుకులు తెప్పించడం వంటి ప్రక్రియను 20 నుంచి 30 వేల కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టనున్నామని తద్వారా మంచి ఉద్యోగ అవకాశాలు రాబోతున్నాయన్నారు.

యువతీ యువకులు ఎలాంటి అధైర్యం పడవద్దని, ధైర్యంగా సమాధానాలు చెప్పి ఉద్యోగాల్లో చేరాలన్నారు.

సీ. డాప్ ద్వారా ఎంట్రప్రేన్యూర్ ఎం ఎస్ ఎం ఈ రుణాలను ఇవ్వడానికి చాలామంది ముందుకు వస్తున్నారని, ఇందుకోసం వారు పెద్ద ఎత్తున శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నారని, గోల్డ్ కవరింగ్, సముద్ర తీరంలో కలుపు తీయడం, గుర్రపు డెక్క నుండి నారు తీసి టోపీలు, బుట్టలు అల్లకము వంటి ఎం ఎస్ ఎం ఈ లు రాబోతున్నాయన్నారు.
ఒక చిన్న ఆలోచన చాలా మార్పులకు నాంది పలుకుతుంది అన్నారు
నిరుద్యోగ యువతులకు యువతీ యువకులకు నిరంతరం శిక్షణ తరగతులు నిర్వహించనున్నామన్నారు

రాష్ట్ర ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణరావు మాట్లాడుతూ జాబ్ మేళా సద్వినియోగం చేసుకొని నిరుద్యోగ యువతీ యువకులు ఉద్యోగ అవకాశాలు పొందాలని కోరారు. పెద్ద ఎత్తున జాబ్ మేళా నిర్వహణకు ఎంతగానో కృషి చేసిన మంత్రి కొల్లు రవీంద్ర అభినందనీయులన్నారు.

జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ మాట్లాడుతూ జాబ్ మేళా కేవలం ఉద్యోగాలు ఇచ్చే మేళా కాదని జీవితాన్ని ఇచ్చే సమ్మేళనం అని అభివర్ణించారు.
జీవితం ఎల్లప్పుడూ ఒక సవాలుగా స్వీకరించాలన్నారు.
గతంలో ఎన్నడూ లేని విధంగా మచిలీపట్నం నియోజకవర్గంలో పెద్ద ఎత్తున జాబ్ మేళా ఏర్పాటుకు కృషిచేసిన రాష్ట్ర మంత్రివర్యులు కొల్లు రవీంద్ర అభినందనీయులన్నారు.
ఏదైనా ఒక కంపెనీలో చేరాక జీతం పొందడమే కాకుండా అక్కడి పరిస్థితులను గమనించి అనుభవాన్ని గడించాలన్నారు.
లలిత జ్యువెలర్స్ అధినేత కిరణ్ కుమార్ నిరుపేద కుటుంబంలో పుట్టి చెన్నై వెళ్లి అక్కడ ఓ స్వర్ణకారుడు వద్ద కూలిగా చేరి తదుపరి చిన్న వ్యాపారం చేసుకుంటూ అంచలంచలుగా ఎదిగి దక్షిణ భారతదేశంలో పై స్థాయికి చేరుకున్నారన్నారు.
చిన్న ఉద్యోగమని, దూరం వెళ్లాలని భావించకుండా అందులో చేరాక అక్కడ ఉన్న నెట్వర్క్ తో, పరిజ్ఞానంతో తర్వాత మంచి వ్యాపారం మొదలుపెట్టి వ్యాపారవేత్తలుగా కూడా అయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయన్నారు.
ప్రభుత్వ ఉద్యోగంలో కొన్ని పరిమితులు ఉంటాయని అదే ప్రైవేటు రంగంలో అయితే ఆకాశమే హద్దుగా ముందుకు సాగ సాగవచ్చన్నారు.
ఏ కంపెనీలో అయినా నమ్మకంతో కష్టపడి పని చేస్తే ఎవరూ వదులుకోవడానికి ఇష్టపడరన్నారు .
జాబ్ మేళాకు పెద్ద ఎత్తున నిరుద్యోగ యువతీ యువకులు వచ్చారని వారి అనుభవాలను, అవకాశాలను, వ్యక్తిత్వం మార్చుకోవడానికి ఎంతోగానో తోడ్పడుతుందన్నారు.
అవకాశాలు వచ్చినప్పుడు దానిని సద్వినియోగం చేసుకొని విజయ పథాన ముందుకు సాగాలన్నారు
ఇప్పుడు ఉద్యోగాలు వెతుక్కుంటూ వచ్చిన మీరందరూ భవిష్యత్తులో ఉద్యోగాలు ఇచ్చే వ్యాపారవేత్తలుగా తయారు కావాలని అందరికీ మంచి జరగాలని శుభాకాంక్షలు తెలిపారు.

జిల్లా ఎస్పీ ఆర్ గంగాధర్ రావు మాట్లాడుతూ ప్రతిరోజు ఏదో ఒక మంచి అభివృద్ధి కార్యక్రమం జరుగుతోందని నేడు నిరుద్యోగ యువతీ యువకులకు పెద్ద ఎత్తున జాబ్ మేళా, రేపు ఈనెల 17వ తేదీ గురువారం కరగ్రహారంలో 46 ఎకరాల్లో నూతనంగా నిర్మించనున్న పోలీస్ శిక్షణ కేంద్రానికి శంకుస్థాపన జరగబోతుందని అందులో రాష్ట్ర హోం మంత్రివర్యులు, డీజీపి, ప్రజా ప్రతినిధులు పాల్గొంటున్నారన్నారు.
ఈ జాబ్ మేళాలో ఉద్యోగాలు ఇచ్చేందుకు 31 కంపెనీలు రావడం చాలా సంతోషదాయకమన్నారు.
ఒకప్పుడు ఉద్యోగాలు వెతుక్కుంటూ అభ్యర్థులు వెళ్లేవారని, నేడు అభ్యర్థుల దగ్గరికి ఉద్యోగాలు ఇస్తామంటూ చాలా పెద్ద కంపెనీలు రావడం ఆనందదాయకమన్నారు.
యువత ప్రతి కంపెనీ వివరాలు, నిబంధనలు అడిగి తెలుసుకుని వారి బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలన్నారు.

ఈ కార్యక్రమంలో సి డాప్ జేడియం సుమలత, జిల్లా ఉపాధి కల్పనాధికారి విక్టర్ బాబు, డిఆర్డిఏ పిడి హరిహరనాథ్, జిల్లా నైపుణ్యాల అభివృద్ధి అధికారి నరేష్ కుమార్, దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ లలిత, మెప్మా పీడీ సాయిబాబు , మార్కెటింగ్ శాఖ ఏడి నిత్యానందం, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ గొర్రెపాటి గోపీచంద్, మచిలీపట్నం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కుంచె నాని, మాజీ చైర్మన్ గోపు సత్యనారాయణ పలువురు నిరుద్యోగ యువతీ యువకులు పాల్గొన్నారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version