మంత్రిత్వ బాధ్యతల నడుమ ఓ తండ్రి ప్రేమ.. ఒక్కరోజు సెలవు తీసుకున్న నారా లోకేష్
అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో అత్యంత బిజీ నేతల్లో ఒకరైన ఐటీ, హెచ్ఆర్డీ మంత్రి నారా లోకేష్, ఈరోజు శనివారం(ఆగస్టు 02) తన కొడుకు దేవాన్ష్ స్కూల్లో జరిగిన పేరెంట్ టీచర్ మీటింగ్‌కి హాజరయ్యారు. సాధారణంగా రాష్ట్రంలోని పెట్టుబడుల ఆకర్షణతోపాటు రాష్ట్రంలో కీలక మంత్రిగా, అంతకంటే ఎక్కువగా ముఖ్యమంత్రి కుమారుడిగా నిరంతరం అనేక సమావేశాలు, అధికార పర్యటనలతో నిత్యం తీరిక లేకుండా గడిపుతున్నారు లోకేష్. అయితే ఈసారి మాత్రం తన కొడుకు పాఠశాలలో జరిగే కార్యక్రమానికి ప్రత్యేకంగా ఒక రోజు సెలవు తీసుకున్నా.. అంటూ చేసిన ట్వీట్ అందరిని ఆకట్టుకుంది.
‘‘ఇవే జీవితాన్ని అర్థవంతం చేసే క్షణాలు’’ అంటూ లోకేష్
ఇది కేవలం ఒక సాధారణ వార్త కాదు. ఓ మంత్రి సెలవు తీసుకున్న వార్త.. ఓ తండ్రి తన కొడుకు పట్ల చూపిన అనురాగానికి గుర్తుగా నిలిచే వార్త. తన అధికారిక ట్విట్టర్లో లోకేష్ ఇలా పోస్ట్ చేశారు. ‘‘ఈరోజు దేవాన్ష్‌కి స్కూల్లో పేరెంట్ టీచర్ మీటింగ్ ఉంది. ఆ సందర్భం కోసం సెలవు తీసుకున్నా. పబ్లిక్ లైఫ్ ఎప్పుడూ పరుగుల్లో ఉంటుంది కదా.. అందుకే ఇలాంటి క్షణాలు మరింత విలువైనవిగా అనిపిస్తాయి. దేవాన్ష్ ప్రపంచం, అతని కథలు, నవ్వు అన్నీ చూసి ఓ తండ్రిగా గర్వంగా ఉంది. We are proud of you, Devaansh!’’ అంటూ సోషల్ మీడియాలో రాసుకొచ్చారు.
మంత్రిత్వ బాధ్యతల నడుమ ఓ తండ్రి ప్రేమ
లోకేష్ ప్రస్తుతం రాష్ట్ర ఐటీ, హ్యూమన్ రిసోర్సెస్ అభివృద్ధి శాఖల మంత్రిగా ఉన్నప్పటికీ.. పెట్టుబడులు, పారిశ్రామికవేత్తలతో సమావేశాలు, విదేశీ పర్యటనలు వంటి అంశాల్లో కూడా ముఖ్యమైన బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ముఖ్యమంత్రి కుమారుడు కూడా అయిన నారా లోకేష్, తన కుమారుడు దేవాన్ష్‌కి సంబంధించిన అంశాల్లో ఇస్తున్న ప్రాధాన్యత అందరిలో ఆసక్తిని కలిగించింది.