భవన నిర్మాణాల నిబంధనలు సరళతరం
రాష్ట్ర పురపాలక & పట్టణాభివృద్ది శాఖ మంత్రి పొంగూరు నారాయణ
అమరావతి, జూన్ 24: భవన నిర్మాణాల నిబంధనలు సరళతరం చేసే విధంగా పలు నిర్ణయాలకు క్యాబినెట్ ఆమోదం తెల్పినట్లు రాష్ట్ర పురపాలక & పట్టణాభివృద్ది శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. మంగళవారం రాష్ట్ర సచివాలయం ప్రచార విభాగంలో ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ చిన్న భవనాలకు అనుమతులు మరియు సెట్ బ్యాక్ విషయాల్లో వెసులుబాటు కల్పించినట్లు తెలిపారు. గతంలో 5 అంతస్తులు, ఆపై అంత్తసుల భనాలకు నిబంధనలను చాలా సరళతరం చేయడం జరిగిందని, అయితే ఇప్పుడు 5 అంతస్తుల్లోపు భవనాలకు కూడా నిబంధలను సరళతరం చేయడం జరిగిందన్నారు. భవన నిర్మాణానికి 10 శాతం ఏరియాని తనఖా పెట్టి, నిబంధనలకు అనుగుణంగా నిర్మాణాలు చేసుకోవచ్చని, ప్రభుత్వ భూముల విషయంలో అఫడవిట్ దాఖలు చేస్తే సరిపోతుందన్నారు. అన్ని సెట్ బ్యాక్స్ నియమాలకు అనుగుణంగా ఉంటే, గ్రౌండు నుండి 3 మీటర్ల పైబడిన భవనాలకు 1.5 మీటర్ల బాల్కనీకి అనుతిచ్చామన్నారు. అన్ని గృహ, వాణిజ్య సముదాయాల్లో సిసి టివిలను తప్పని సరి చేశామన్నారు. పరిశ్రమలకు సంబందించి నాన్ రెడ్ క్యాటగిరీలో 9 మీటర్లు మరియు రెడ్ క్యాటగిరీలో 12 మీటర్ల రహదారులు ఉండాలన్నారు. అపార్టుమెంట్స్ రెండు బ్లాక్ల మద్య దూరం సెట్ బ్యాక్ ప్రకారం ఉండాలన్నారు. సెక్యూరిటీ పోస్టు నిర్మాణానికి అధికారికంగా అనుమతి ఇచ్చామన్నారు. సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ భవనానికి వెనుకవైపు ఉండాలన్నారు. రహదారుల విస్తరణలో స్థలం కోల్పోయిన వారికి టిడిఆర్ బాండ్లు ఇస్తున్నామని, ఈ బాండుతో అదే భవనంపై మరో అంతస్తు నిర్మించుకునేందుకు అనుమతి అవసరం లేదన్నారు. బిల్డర్లు, డవలపర్ల లైసెన్సు మూడు సంవత్సరాలు ఉండే విధంగా అనుమతించడం జరిగిందన్నారు. 50 చ.మీ. విస్తీర్ణంలో నిర్మించే జీ, జీ ప్లస్ వన్ భవనాలకు కేవలం ఒక్క రూపాయి ఫీజు మాత్రమే చెల్లించి అనుమతి తీసుకోవచ్చన్నారు. అన్నదమ్ములకు సంబందించి ముందు,వెనుక వచ్చే స్థలాలకు 100 స్క్వేర్ మీటర్ల స్థలానికి 2 మీటర్లు, 100 స్క్వేర్ మీటర్లు పైబడిన స్థలానికి 3.6 మీటర్లు దారి ఉంటే సరిపోతుందన్నారు