బ్రెయిన్ డెడ్ కావడంతో అవయవ దానం చేసిన జన సైనికుడి కుటుంబం
- చందు వీర వెంకట వసంత రాయలు కుటుంబ నిర్ణయం మానవత్వంతో కూడుకున్నది
- శాసన మండలిలో ప్రభుత్వ విప్ పిడుగు హరిప్రసాద్
మరణించిన తరువాత జీవించే అవకాశం అవయవ దానంతోనే లభిస్తుందని శాసన మండలిలో ప్రభుత్వ విప్ పిడుగు హరిప్రసాద్ అన్నారు. రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి గుంటూరు రమేష్ ఆసుప్రతిలో చికిత్స పొందుతూ బ్రెయిన్ డెడ్ అయిన కృష్ణా జిల్లా కృత్తివెన్ను మండలం చందాల గ్రామానికి చెందిన జన సైనికుడు చందు వీర వెంకట వసంత రాయలు కుటుంబాన్ని ఏపీఎంఎస్ఐడీసీ చైర్మన్ చిల్లపల్లి శ్రీనివాసరావు, పార్టీ గుంటూరు జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరావుతో కలిసి ఆదివారం పరామర్శించారు. పార్టీ తరఫున అన్ని విధాలా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. పుట్టెడు దుఃఖంలో కూడా అవయవ దానం చేయడానికి ముందుకు వచ్చి వసంత రాయలు కుటుంబం మానవత్వంతో కూడిన నిర్ణయం తీసుకుందన్నారు.
ఈ సందర్భంగా పి. హరిప్రసాద్ మాట్లాడుతూ… “ శ్రీ చందు వీర వెంకట వసంత రాయలు మరణం ఆ కుటుంబానికి, పార్టీకి తీరని లోటు. జన సైనికుడు అకాల మరణం విషయం తెలిసిన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఎంతో బాధపడ్డారు. తక్షణం కుటుంబాన్ని పరామర్శించి, పార్టీ తరఫున భరోసా ఇవ్వాలని ఇక్కడికి పంపించార”న్నారు.
• పవన్ కళ్యాణ్ స్ఫూర్తితోనే…
మృతుడు కుమారుడు సీతారామరాజు మాట్లాడుతూ.. “మా నాన్న మరణానంతరం కూడా ఏదో ఒక రూపంలో ఎవరో ఒకరి దేహంలో జీవించే అవకాశం ఉంటుందని అవయవదానానికి అంగీకరించాం. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ స్ఫూర్తితోనే మా కుటుంబం అవయవదానానికి అంగీకరించాం. పుట్టిన ప్రతి ఒక్కరు సమాజానికి ఎంతో కొంత ఉపయోగపడాలని ఆయన ఆకాంక్షిస్తారు. ఆయనను స్ఫూర్తిని అందిపుచ్చుకొని అవయవదానానికి అంగీకరించాం.
డాక్టర్ అనూష మాట్లాడుతూ… “పుట్టెడు దుఃఖంలో కూడా అవయవ దానానికి అంగీకరించిన కుటుంబ సభ్యులు అభినందనీయులు. కష్ట సమయంలో కూడా నలుగురిని బతికించాలన్న వారి ఆకాంక్ష చాలా గొప్పది. ఇంటి పెద్ద దిక్కు కోల్పోయినా.. మనో ధైర్యం కోల్పోకుండా అవయవదానం గురించి మేము చెప్పిన వెంటనే ఒప్పుకున్నార”న్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు బిట్రగుంట మల్లిక, పాకనాటి రమాదేవి, తోట సత్యనారాయణ, చందు సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు.