బీసీ హాస్టళ్లలో క్రీడలకు ప్రోత్సాహం
రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత
అమరావతి : క్రీడల్లో బీసీ హాస్టళ్ల విద్యార్థులు రాణించేలా ప్రణాళికలు రూపొందించామని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్.సవిత తెలిపారు. హాస్టళ్లలో క్రీడా వసతుల కల్పనకు అధిక ప్రాధాన్యమిస్తున్నామన్నారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో మంత్రి సవితను శాప్ చైర్మన్ రవినాయుడు గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా బీసీ హాస్టళ్లలో క్రీడా వసతుల కల్పనపై ఇరువురు చర్చించారు. అనంతరం మంత్రి సవిత మాట్లాడుతూ, విద్యార్థులకు విద్యతో పాటు క్రీడలు ఎంతో అవసరమన్నారు. తల్లిదండ్రులకు, ఇంటికి దూరంగా ఉండే విద్యార్థులకు క్రీడలు ఎంతో ఉపశమనం కలిగిస్తూ మానసిక ఒత్తిడిని దూరం చేస్తాయన్నారు. అదే సమయంలో క్రీడల్లో సత్తా చాటే విద్యార్థులకు బంగారు భవిష్యత్తు ఉంటుందన్నారు. ఈ నేపథ్యంలో, బీసీ హాస్టళ్లు, ఎంజేపీ స్కూళ్లో క్రీడలకు అధిక ప్రాధాన్యమిస్తున్నామన్నారు. ఇప్పటికే స్పోర్ట్స్ కిట్లు విరివిగా అందజేస్తూ, మండల, జిల్లా, జోనల్, రాష్ట్ర స్థాయి పోటీలు నిర్వహిస్తున్నామన్నారు. ఎందరో విద్యార్థులు పలు క్రీడల్లో సత్తా చాటుతున్నారన్నారు. టెన్త్, ఇంటర్ ఫలితాల్లో అత్యుత్తమ ఫలితాలు సాధిస్తూ, క్రీడల్లోనూ రాణిస్తున్నారన్నారు. బీసీ హాస్టళ్ల విద్యార్థులకు శాప్ కూడా సహకారమందిస్తే, దేశం గర్వించే క్రీడాకారులను అందించే అవకాశం కలుగుతుందన్నారు. ఇండోర్, అవుట్ డోర్ స్పోర్ట్స్ కిట్లు అందజేయాలన్నారు. శాప్ చైర్మన్ రవి నాయుడు మాట్లాడుతూ, క్రీడల్లో రాణించే బీసీ హాస్టల్ విద్యార్థులకు శాప్ తరఫున అండగా నిలుస్తామన్నారు. బీసీ హాస్టళ్లు, ఎంజేపీ స్కూళ్లల్లో క్రీడల అభివృద్ధికి తమవంతు సాయమందిస్తామన్నారు. అంతకుముందు మంత్రి సవితను శాప్ చైర్మన్ రవినాయుడు దుశ్శాలువాతో సత్కరించారు. ఈ సమావేశంలో రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ కార్యదర్శి ఎస్.సత్యనారాయణ, డైరెక్టర్ చంద్రశేఖర్ రాజు, ఎంజేపీ స్కూల్స్ కార్యదర్శి మాధవీలత తదితరులు పాల్గొన్నారు.