ప్రభుత్వ వ్యతిరేకత ప్రజల్లో స్పష్టంగా కనిపిస్తోంది కూటమి విజయంపై మోదీ ధీమా

0

 విజయవాడ

ప్రభుత్వ వ్యతిరేకత ప్రజల్లో స్పష్టంగా కనిపిస్తోంది  కూటమి విజయంపై మోదీ ధీమా

రాష్ట్ర ప్రజల్లో వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు.ఎన్డీఏపై ప్రజలు నమ్మకంతో ఉన్నారని, ఏపీలో కూటమి అభ్యర్థుల విజయం తథ్యమని ధీమా వ్యక్తం చేశారు. మహిళలు, యువత మద్దతు మూడు పార్టీలకూ పుష్కలంగా ఉందన్నారు.

విజయవాడ రోడ్‌షో అనంతరం తెలుగుదేశం, జనసేన అధినేతలు చంద్రబాబు, పవన్‌కల్యాణ్‌తో ప్రధాని 10 నిమిషాల పాటు భేటీ అయ్యారు.

రాష్ట్రంలో సాగిన తన రెండు రోజుల పర్యటనపై ప్రధాని నరేంద్ర మోదీ సంతృప్తి వ్యక్తం చేశారు. విజయవాడలో జరిగిన ర్యాలీ ఎంతో ఉత్సాహంగా సాగిందని సంతృప్తి, సంతోషాన్ని వ్యక్తం చేశారు. రోడ్‌ షో ముగిశాక గ్రీన్ రూమ్‌లో చంద్రబాబు, పవన్‌కల్యాణ్‌తో మోదీ 10నిమిషాలకు పైగా ఏకాంతంగా భేటీ అయ్యారు. ఎన్డీఏ ప్రభుత్వంపై ప్రజలు నమ్మకంతో ఉన్నారని మోదీ పేర్కొన్నారు. ప్రభుత్వ వ్యతిరేకత ప్రజల్లో స్పష్టంగా కనిపిస్తోందని, మంచి విజయాన్ని కూటమి సాధించబోతోందని చంద్రబాబు, పవన్‌తో మోదీ అన్నట్లు తెలుస్తోంది.

రాష్ట్రంలో కూటమి జోష్  ఏపీలో ఎండ వేడిమి తీవ్రంగా ఉందని, ఆ ప్రభావం పోలింగ్‌పై పడకుండా చూడాలని చంద్రబాబు, పవన్‌కు మోదీ సూచించారు. పోలింగ్‌ రోజు ఉదయం 7 నుంచి 10 గంటలలోపే ఎక్కువ మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేలా చూడాలన్నారు. పోలింగ్‌ శాతం ఎంత పెరిగితే ఎన్డీఏకు అంత లాభమని వారికి మోదీ చెప్పారు. తనను ఆదరించిన ఏపీ ప్రజలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ప్రజలు జగన్ ప్రభుత్వంపై తీవ్ర అగ్రహం, అసంతృప్తితో ఉన్నారన్న నివేదికలు ఉన్నాయని మోదీ చెప్పినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో కూటమి జోష్ పట్ల మోదీ సంతృప్తి వ్యక్తం చేశారు.

మోదీ ట్వీట్‌: చంద్రబాబు, పవన్ కల్యాణ్‌తో కలిసి విజయవాడలో నిర్వహించిన రోడ్ షో మధురానుభూతిని కలిగించిందని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. ఇటీవల ఏపీలో జరిపిన పర్యటన ద్వారా ప్రజా మద్దతు పెద్ద ఎత్తున కూటమికే ఉందన్నది స్పష్టమైందన్నారు. మహిళలు, యువ ఓటర్లు కూటమిని ప్రోత్సహిస్తుండటం శుభపరిణామమని సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ట్వీట్‌ చేశారు.

చంద్రబాబు ట్వీట్  విజయవాడలో మోదీ, పవన్ కల్యాణ్‌తో కలిసి నిర్వహించిన రోడ్ షో సరికొత్త చరిత్ర సృష్టించిందని చంద్రబాబు ట్వీట్ చేశారు. రోడ్ షో లో పాల్గొన్న సోదర సోదరీమణులకు కృతజ్ఞతలు తెలిపారు. భారీ ప్రజా స్పందన ఎంతో థ్రిల్ కలిగించిందన్నారు. మూడు పార్టీల అధినేతలకు లభించిన ప్రజాభిమానం ఎన్నికల ఫలితాల్లో ఆశాజనక వాతావరణానికి నిదర్శనమన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో జూన్ 4న కొత్త ప్రభుత్వం రాబోతోందని ధీమా వ్యక్తం చేశారు. అలాగే ప్రధాని మోదీ ట్వీట్‌కు సమాధానమిచ్చిన చంద్రబాబు రోడ్ షో ద్వారా ఏపీ ప్రజల్లో ముఖ్యంగా మహిళలు, యువతలో కొత్త ఆశలు నింపామన్నారు. రోడ్ షో మరపురానిదన్నారు. మోదీ తన మధురానుభూతులను ఏపీ ప్రజలతో పంచుకున్నందుకు ధన్యవాదాలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌కు నరేంద్రమోదీ ఇచ్చిన భరోసాకు కృతజ్ఞతలంటూ ట్వీట్‌ చేశారు.

పవన్ కల్యాణ్ ట్వీట్‌:* మోదీ తలపెట్టిన వికసిత్‌ భారత్‌ కోసం తాము నిర్విరామంగా కృషి చేస్తున్నట్లు జనసేన పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. ప్రధాని మోదీ ఏపీలో పాల్గొన్న ఎన్నికల ప్రచారం ఎంతో విలువైందన్నారు. ఈ జ్ఞాపకాలు ఎప్పటికీ గుర్తుండిపోతాయని ట్వీట్‌లో పేర్కొన్నారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version