ప్రధాని న‌రేంద్ర మోదీ నేడు విశాఖపట్నం పర్యటన క‌ట్టుదిట్టమైన ఏర్పాట్లు సిఎస్ విజ‌యానంద్‌

5
0

 ప్రధాని న‌రేంద్ర మోదీ నేడు విశాఖపట్నం పర్యటన

క‌ట్టుదిట్టమైన ఏర్పాట్లు  సిఎస్ విజ‌యానంద్‌

అమరావతి, ఆదిత్య‌హృద‌యం న్యూస్‌:- దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ విశాఖపట్నం రానుండగా అందుకు సంబంధించి కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయడం జరిగిందని ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ తెలిపారు. ఈ నెల 8న ప్ర‌ధాని పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లపై మంగళవారం మరోసారి రాష్ట్ర సచివాలయం నుండి ఆయన వీడియో సమావేశం ద్వారా సంబంధిత శాఖల అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా సిఎస్ మాట్లాడుతూ, ప్రధాని పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లన్నిటినీ మంగళవారం రాత్రికి పూర్తి చేయాలని, ప్రధాని పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లలో ఏ చిన్న పొరపాటుకు ఆస్కారం లేని రీతిలో కట్టుదుట్టమైన పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. విశాఖపట్నం పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి వర్చువల్‌గా సుమారు 20 వరకూ వివిధ ప్రారంభోత్సవాలు, శంఖుస్థాపనలను చేయనున్నారని కావున సంబంధిత శాఖల అధికారులు వారి వారి శాఖలకు సంబంధించిన ఏర్పాట్లన్నిటినీ పటిష్టంగా నిర్వహించాలని సిఎస్ ఆదేశించారు. 8వ తేదీ బుధవారం సాయంత్రం 4.15 గంట‌లకు ప్రధాన మంత్రి మోదీ విమానంలో విశాఖపట్నం చేరుకుని సా.4.45 గంట‌ల నుండి 5.30 గంట‌ల వరకూ రోడ్డు షోలో పాల్గొంటారని సిఎస్ వెల్లడించారు. అనంతరం సా.5.30 నుండి 6.45 గంట‌ల వరకూ ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కళశాల మైదానం సభా వేదిక వద్ద నుండి వర్చువల్‌గా పలు శంఖుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసి సభలో మాట్లాడతారని తెలిపారు. తదుపరి సాయంత్రం 6.50 గం.లకు సభా వేదిక నుండి బయలుదేరి విశాఖ విమానాశ్రయానికి చేరుకుని రాత్రి 7.15 గం.ల విశాఖ నుండి విమానంలో భువనేశ్వర్ బయలుదేరి వెళతారని సిఎస్ పేర్కొన్నారు. వీడియో సమావేశంలో వ‌ర్చువ‌ల్‌గా పాల్గొన్న డిజిపి సీహెచ్ ద్వారకా తిరుమలరావు మాట్లాడుతూ, ప్రధాని పర్యటనకు సంబంధించి ఎస్పిజి సమన్వయంతో పోలీస్ శాఖ తరపున కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నట్టు వివరించారు. విశాఖపట్నం జిల్లా కలక్టర్ హరీంద్ర ప్రసాద్ మాట్లాడుతూ, విశాఖ నగరంలో ప్రధాని రోడ్డు షోలో సుమారు 80వేల మంది, స‌భ‌లో ల‌క్షా 80వేల మంది పాల్గొనేలా ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిపారు. విశాఖ పోలీస్ కమిషనర్ ఎస్.బాగ్చి మాట్లాడుతూ, ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా వివిధ ప్రాంతాల్లో వాహనాల పార్కింగ్ ఏర్పాటు చేశామ‌న్నారు. సమావేశంలో రాష్ట్ర సాధారణ పరిపాలన శాఖ(పొలిటికల్) ముఖ్య కార్యదర్శి ఎస్.సురేష్‌ కుమార్, ఇంటిలిజెన్స్ ఐజి రామకృష్ణ పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here