ప్రజా సమస్యల పరిష్కారమే ఎజెండా : యార్లగడ్డ
విజయవాడ రూరల్ :
ప్రజా సమస్యల పరిష్కారం ఏజెండాగా పనిచేస్తున్నట్లు ప్రభుత్వ విప్, గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు తెలిపారు. విజయవాడ రూరల్ మండలం ఎనికెపాడు గ్రామంలోని ఎస్ఆర్కె ఇంజనీరింగ్ కళాశాల ప్రాంగణంలో శనివారం సాయంత్రం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న యార్లగడ్డ ప్రజల సమస్యలు తెలుసుకుంటూ, అర్జీలు స్వీకరించి వాటిని సంబంధిత అధికారులకు పంపించి వాటిని నిర్థిష్ట గడువులోగా పరిష్కరించాలని అధికారులు ఆదేశించారు. ఈ సందర్భంగా యార్లగడ్డ మాట్లాడుతూ గన్నవరం నియోజకవర్గంలో ప్రజావేదికలు ఏర్పాటుచేసి ప్రజల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తున్నట్లు చెప్పారు. అన్నవరం నియోజకవర్గంలోని అర్హులైన పేదలందరికీ ఇళ్ల స్థలాలు ఇస్తామని ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఈ అంశంలో ఇప్పటికే ప్రభుత్వంతో మాట్లాడానని త్వరలోనే ఇళ్ల స్థలాలు మంజూరు చేస్తామని యార్లగడ్డ హామీ ఇచ్చారు. గన్నవరం నియోజకవర్గాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేసి నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్లు చెప్పారు. మల్లవల్లి, వీరపనేని గూడెం పారిశ్రామిక వాడల్లో యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని భరోసా ఇచ్చారు. తమ ప్రభుత్వం ప్రోత్సాహాల వల్ల హైటెక్ సిటీ లోను పెద్దసంఖ్యలో ఐటీ సంస్థలు వస్తున్నాయని తద్వారా ఐటీ చదివిన నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని తెలిపారు. ఈ కార్యక్రమం లో మండల టీడీపీ అధ్యక్షులు గొడ్డల చిన్న రామారావు, రాష్ట్ర నాయకులు గుడవల్లి నరసయ్య, పొదిలి లలిత, కోనేరు సందీప్, సర్నాల బాలాజీ, పరుచూరి నరేష్, నాభిగాని కొండ, నెక్కటి శ్రీదేవి, జనసేన నాయకులు పొదిలి దుర్గారావు, తదితరులు పాల్గొన్నారు.