పిఠాపురం నియోజక వర్గవ్యాప్తంగా ఉన్న 325 మంది ప్రైవేటు ఎలక్ట్రీషియన్లకు సేఫ్టీ కిట్లు పంపిణీ

0

పిఠాపురం నియోజక వర్గవ్యాప్తంగా ఉన్న 325 మంది ప్రైవేటు ఎలక్ట్రీషియన్లకు సేఫ్టీ కిట్లు పంపిణీ

  • ప్రాణాలు పణంగా పెట్టి పని చేసే ఎలక్ట్రీషియన్లకు రక్షణ, భద్రత ముఖ్యం
  • మల్లం గ్రామంలో దళిత సామాజిక వర్గానికి చెందిన ఎలక్ట్రిషియన్ సురేష్ మరణం కలచి వేసింది
  • పిఠాపురం ప్రాంతంలో మరో ఎలక్ట్రిషియన్ పని ప్రదేశంలో చనిపోకూడదు
  • పిఠాపురం ఎలక్ట్రీషియన్ల సమావేశంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్

శ్రమ జీవుల స్వేదమే దేశానికి నిజమైన సంపద. వారి అభ్యున్నతి, సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ప్రాణాలు పణంగాపెట్టి పని చేసే ఎలక్ట్రీషియన్లకు రక్షణ, భద్రత చాలా ముఖ్యమని అన్నారు. నిరుద్యోగ యువత కోసం పిఠాపురం నియోజకవర్గంలో ప్రతి మూడు నెలలకోసారి జాబ్ మేళా నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. ఆదివారం ఉదయం మంగళగిరి క్యాంపు కార్యాలయంలో పిఠాపురం నియోజకవర్గవ్యాప్తంగా ఉన్న 325 మంది ప్రైవేటు ఎలక్ట్రీషియన్లతో సమావేశమయ్యారు. పని ప్రదేశాల్లో వారి రక్షణ, భద్రత కోసం సేఫ్టీ కిట్లను అందజేశారు. ఈ సేఫ్టీ కిట్ లో ఎలక్ట్రికల్ పనులకు అవసరమైన టూల్ కిట్, రబ్బర్ హాండ్ గ్లోవ్స్, షూస్, జాకెట్ ఉన్నాయి.
ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ… “గత ఏప్రిల్ నెలలో పిఠాపురం నియోజకవర్గం మల్లం గ్రామంలో ఎలక్ట్రీషియన్ గా పని చేసే దళిత యువకుడు పల్లపు సురేష్ ప్రమాదవశాత్తు మరణించడం చాలా కలచి వేసింది. ఒకరి ఇంట్లో విద్యుత్ మరమ్మత్తు పనులు చేస్తూ విద్యుదాఘాతానికి గురై శ్రీ సురేష్ మరణించారు. ఆయన మరణంతో కుటుంబం పెద్ద దిక్కు కోల్పోయి నిరాధారంగా మారింది. ఒక వైపు ప్రాణం కోల్పోయి ఆ కుటుంబం దుఃఖములో ఉంటే… మరోవైపు గ్రామంలో అనేక స్పర్ధలకు దారి తీసింది. రాజకీయ లబ్ధి కోసం ఆలోచించే వారు ఇలాంటి గొడవలను పెంచి పెద్దవిగా చేస్తారు. మేం మాత్రం ఇలాంటి సమస్యలను ఎలా పరిష్కరించాలి అని ఆలోచన చేస్తాము.
• రక్షణ, భద్రత కల్పించాలని నిర్ణయం తీసుకున్నాం
ప్రాణాలు పణంగా పెట్టి పనిచేసే వారికి రక్షణ, భద్రత కల్పించాలని వ్యక్తిగతంగా కోరుకునేవాడిని. సురేష్ మరణం వెనుకనున్న పరిణామాలను నిశితంగా పరిశీలిస్తే రెండు అంశాలు స్పష్టమయ్యాయి. ఒకటి ఆయన పేదరికం. విద్యుత్ పనులు చేసేటప్పుడు వాడే రక్షణ పరికరాలు ఆయన దగ్గర లేకపోవడంతో మరణించారు. రెండవది ప్రమాదవశాత్తు ఆయన చనిపోతే అతని కుటుంబానికి ఆదుకునేందుకు సరైన ఆర్థిక భద్రత లేకపోవడం. ఇటువంటి సంఘటన మళ్లీ పునరావృతం కాకూడదనే నిశ్చయంతో పిఠాపురం నియోజకవర్గంలో ఉన్న 325 మంది ప్రైవేటు ఎలక్ట్రీషియన్లకు రక్షణ పరికరాల కిట్లను అందజేస్తున్నాము. విద్యుత్ సంబంధిత పనులు చేసేటప్పుడు ఈ రక్షణ పరికరాలను తప్పనిసరిగా వాడాలని ఎలక్ట్రీషియన్లను కోరుతున్నాను. పని ప్రదేశంలో విద్యుత్ షాక్ తో మరొకరు చనిపోకూడదు.
రక్షణ ఏర్పాట్లు చేసినా ప్రాణం కోల్పోయే ప్రమాదం ఉంటే కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ అమలు చేస్తున్న ప్రధాన మంత్రి సురక్షా బీమా యోజన ద్వారా రూ.2 లక్షలు, చంద్రన్న బీమా ద్వారా మరో రూ. 2 లక్షలు అందించే ఏర్పాట్లు చేశాం. గత ప్రభుత్వo వ్యవస్థలను అస్తవ్యస్తంగా మార్చేసింది. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ నిధిని దారి మళ్లించింది. వ్యవస్థలను గాడిలో పెట్టడంతోపాటు భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డును పునరుద్దరిస్తామ”న్నారు.
• పదేళ్ల నుంచి ఉన్న జీవోను సవరించారు: కృష్ణతేజ
పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ కృష్ణతేజ మాట్లాడుతూ “మూడు నెలల క్రిందట ఆటో ఢీకొని ముగ్గురు ఉపాధి శ్రామికులు మరణించారు. వారికి ప్రభుత్వ జీవో ప్రకారం చెరో రూ.50 వేలు పరిహారం అందించాం. ఈ విషయం తెలుసుకున్న పవన్ కళ్యాణ్ పదేళ్లుగా కొనసాగుతున్న జీవోను సవరించి బాధిత కుటుంబాలకు రూ. 2 లక్షలు పరిహారం అందేలా చేశారు. అలాగే రూ. 2 లక్షలు సరిపోవని భావించిన శ్ పవన్ కళ్యాణ్ వారం రోజులపాటు ఒక డ్రైవ్ లా కోటి మంది ఉపాధి శ్రామికులకు ఇన్సురెన్స్ చేయించారు. భవిష్యత్తులో ఉపాధి శ్రామికులు ఎవరైనా ప్రమాదవశాత్తు మరణిస్తే వారి కుటుంబానికి రూ.4 లక్షలు పరిహారం అందేలా ఏర్పాట్లు చేశారు. పిఠాపురం నియోజకవర్గంలో సురేష్ అనే ఎలక్ట్రీషియన్ ప్రమాదవశాత్తు మరణిస్తే… ఇలాంటి మరణాలు మళ్లీ సంభవించకూడదని నియోజకవర్గం వ్యాప్తంగా ఉన్న ప్రైవేట్ ఎలక్ట్రీషియన్లకు సేఫ్టీ కిట్లు పంపిణీ చేశారు. అలాగే వారికి రూ. 4 లక్షల పరిహారం అందేలా ఏర్పాట్లు చేస్తున్నార”న్నారు.
కాకినాడ జిల్లా కలెక్టర్ సగిలి షాన్ మోహన్ మాట్లాడుతూ “భవన నిర్మాణ కార్మికుల కోసం సంక్షేమ బోర్డును పునరుద్ధరించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కార్మికులకు ప్రైవేటు ఇన్సురెన్స్ లేకపోయినా ఈ బోర్డు నుంచి పరిహారం ఇచ్చేలా ఏర్పాట్లు చేస్తోంది. అలాగే ఈ రంగంలో పని చేసే యువతకు ప్రత్యేకంగా జాబ్ మేళా ఏర్పాటు చేస్తామ”న్నారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version