పలు రైళ్లకు అదనపు స్టాపేజీలు

0

  • 14 స్టేషన్లలో రైళ్లకు అదనపు స్టాపేజీలు కేటాయించిన రైల్వేశాఖ
  • ఎక్స్ వేదికగా ప్రకటించిన కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి
  • తన విజ్ఞప్తి మేరకు రైల్వే శాఖ అదనపు స్టాపేజీలు ఇచ్చిందని వెల్లడి

 కేంద్ర పర్యాటకశాఖ మంత్రి కిషన్‌రెడ్డి తెలంగాణ రైల్వే ప్రయాణికులకు శుభవార్త చెప్పారు. ప్రయాణికుల సౌకర్యార్థం పలు రైళ్లకు 14 స్టేషన్లలో అదనపు స్టాపేజీలను కల్పించినట్టు తెలిపారు. తన వినతి మేరకు రైల్వేశాఖ ఈ నిర్ణయం తీసుకుందని వెల్లడించారు. సికింద్రాబాద్‌, హైదరాబాద్‌, గుంటూరు రైల్వే డివిజన్ల పరిధిలో ఈ స్టేషన్లు ఉన్నాయని ‘ఎక్స్‌’ వేదికగా శుక్రవారం ప్రకటించారు.


అదనపు స్టాపేజీలు సికింద్రాబాద్‌ డివిజన్‌ పరిధిలోనే 9 ఉన్నాయని కిషన్ రెడ్డి వివరించారు. సికింద్రాబాద్‌-భద్రాచలం రోడ్‌ కాకతీయ ఎక్స్‌ప్రెస్‌ తడికలపూడిలో, రేపల్లె-సికింద్రాబాద్‌ ఎక్స్‌ప్రెస్‌ రామన్నపేటలో, గుంటూరు-సికింద్రాబాద్‌ ఎక్స్‌ప్రెస్‌ ఉందానగర్‌లో, కాజీపేట-బల్లార్ష ఎక్స్‌ప్రెస్‌ రేచ్ని రోడ్‌లో, తిరుపతి-సికింద్రాబాద్‌ పద్మావతి ఎక్స్‌ప్రెస్‌ నెక్కొండలో, భద్రాచలం రోడ్‌-సికింద్రాబాద్‌ కాకతీయ ఎక్స్‌ప్రెస్‌ బేతంపూడి స్టేషన్‌లో ఆగనున్నాయని తెలిపారు. ఇక కాజీపేట-బల్లార్ష ఎక్స్‌ప్రెస్‌ రాఘవాపురంలో, బల్లార్ష-కాజీపేట ఎక్స్‌ప్రెస్‌ మందమర్రిలో, పుణె-కాజీపేట ఎక్స్‌ప్రెస్‌ మంచిర్యాలలో, దౌండ్‌-నిజామాబాద్‌ ఎక్స్‌ప్రెస్‌ నవీపేటలో, తిరుపతి-ఆదిలాబాద్‌ కృష్ణా ఎక్స్‌ప్రెస్‌ మేడ్చల్‌లో, భద్రాచలంరోడ్‌-బల్లార్ష సింగరేణి మెము ఎక్స్‌ప్రెస్‌ బేతంపూడిలో, నర్సాపూర్‌-నాగర్‌సోల్‌ ఎక్స్‌ప్రెస్‌ మహబూబాబాద్‌లో, సికింద్రాబాద్‌-తిరుపతి వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ మిర్యాలగూడలో ఆగనున్నాయని పేర్కొన్నారు. ప్రయాణికులు ఈ అదనపు స్టాపేజీల ద్వారా సౌకర్యవంతంగా ప్రయాణాలు చేయవచ్చని తెలిపారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version