ఎన్టీఆర్ జిల్లా, జూన్ 28, 2025
పర్యావరణ హిత మార్గాలు.. నవ్య పరిశ్రమలకు సోపానాలు
- ప్లాస్టిక్ ప్రత్యామ్నాయ ఉత్పత్తుల తయారీపై అవగాహన కల్పించాలి
- కొత్త యూనిట్లు ఏర్పాటు దిశగా యువతను, మహిళలను ప్రోత్సహించాలి
- జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ
ప్రపంచానికి ప్లాస్టిక్ కాలుష్యం పెను సవాలుగా మారిన ప్రస్తుత పరిస్థితిలో ప్లాస్టిక్‌కు ప్రత్యామ్నాయ ఉత్పత్తుల తయారీతో ముఖ్యంగా యువత, మహిళలు కొత్త పారిశ్రామిక యూనిట్లను ఏర్పాటు చేయడం ద్వారా, పారిశ్రామికవేత్తలుగా ఎదగొచ్చని, ఈ విషయంపై సమన్వయ శాఖలు అవగాహన కల్పించడంతో పాటు ప్రోత్సహించాలని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ సూచించారు.
ఏపీ కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) ఆధ్వర్యంలో శనివారం కలెక్టరేట్ ప్రాంగణంలో ఏర్పాటుచేసిన ఇగ్నైట్ స్టాళ్లను కలెక్టర్ లక్ష్మీశ సందర్శరించారు. ప్లాస్టిక్ ఇయర్‌బడ్స్, క్యాండీ స్టిక్స్, పాలీస్టరిన్ (థర్మోకోల్) వస్తువులు వంటి నిషేధిత సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువులు, ప్లాస్టిక్‌కు ప్రత్నామ్నాయంగా ఉపయోగించే చెక్క స్పూన్లు, గుడ్డ సంచులు, కంపోస్టబుల్ ప్లాస్టిక్ ఉత్పత్తులు తదితరాలను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ పర్యావరణానికి మేలుచేసే వివిధ ఉత్పత్తులకు మంచి డిమాండ్ ఉందని.. వీటిని ఉత్పత్తి చేసే యూనిట్లను ఏర్పాటుచేసి తమతో పాటు పది మందికి ఉపాధి కల్పించేలా ఔత్సాహికులను ప్రోత్సహించాలన్నారు. ఇప్పటికే పర్యావరణ హిత ఉత్పత్తుల పరిశ్రమలను విజయవంతంగా నడుపుతున్నవారితోనూ అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని సూచించారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువుల వినియోగాన్ని పూర్తిగా అరికట్టడంతో పాటు ఎకో ఫ్రెండ్లీ ఉత్పత్తుల వినియోగంపై ప్రజలకు అవగాహన కల్పించాలని ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీశ అధికారులను ఆదేశించారు. కాలుష్యం లేని ఆహ్లాదకర వాతావరణాన్ని భవిష్యత్తు తరాలకు కానుకగా ఇచ్చే దిశగా పీసీబీ తీసుకుంటున్న చర్యలు, గాలిలో పీఎం10 సూక్ష్మ ధూళికణాల స్థాయిని విశ్లేషించేందుకు ఉపయోగించే ఆధునిక సాంకేతికత పరికరాలను కూడా కలెక్టర్ లక్ష్మీశ పరిశీలించారు. కలెక్టర్ వెంట జిల్లా ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ పి.శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.