విజయవాడ: 25-06-2025 నెల్లూరులో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మరియు పట్టణాభివృద్ధి శాఖ (MA & UD) మంత్రివర్యులు పొంగూరు నారాయణ ఆద్వర్యం లో ప్రయోగాత్మకంగా ప్రారంభించిన తృప్తి క్యాంటీన్ కు, ప్రజల నుంచి ఆదరణ బాగుండడంతో విశాఖపట్నం, విజయవాడలో మరో నాలుగు క్యాంటీన్లు ప్రారంభించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. పట్టణ స్వయం సహాయక సంఘాల సభ్యుల ఉపాధి కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న అనేక వినూత్న కార్యక్రమాల్లో తృప్తి క్యాంటీన్ ఒకటి. బ్యాంకుల నుంచి సంఘాలకు పెట్టుబడి నిధి కింద రుణాలు అందించి వాటితో తృప్తి క్యాంటీన్లు ప్రారంభించాలన్నది పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ ప్రణాళిక. విజయవాడలో 4 క్యాంటీన్లను త్వరలో ఏర్పాటు చేయనున్నారు. ఇందుకు సంబంధించి కంటెయినర్ల సమీకరణ, కిచెన్ ఎక్విప్మెంట్ మొదలగు ఏర్పాటు చేస్తున్నారు. ఒక్కో క్యాంటీన్ ఏర్పాటుకు రూ. 14.8 లక్షలు అవసరం అవుతుందని అంచనా. జనసమ్మర్థం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో నగరపాలక సంస్థకు చెందిన ఖాళీ స్థలంలో స్వయం సహాయక సంఘాల సభ్యుల ద్వారా వీటిని ఏర్పాటు చేయడము జరుగుతుంది.గౌరవనీయులైన మిషన్ డైరెక్టర్ శ్రీ ఎన్.తేజ్ భరత్, IAS, MEPMA, ఆంధ్రప్రదేశ్ వారు, విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలోని పంజా సెంటర్, షాదీఖానా సమీపంలోని తృప్తి క్యాంటీన్‌ను సందర్శించారు. జూన్ 25, 2025న భారత ఓవర్సీస్ బ్యాంక్, విజయవాడ ప్రాంతీయ కార్యాలయం ద్వారా తృప్తి క్యాంటీన్ SHG మహిళా లబ్దిదారులకు ఋణ మంజూరు లేఖల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో IOB అధికారులు, విజయవాడ నగరపాలక సంస్థ, ప్రాజెక్ట్ ఆఫీసరు (యు.సి.డి), MEPMA అధికారులు పాల్గొన్నారు.