నువ్వు నిజంగానే దేవుడివయ్యా.. సూర్యపై ప్రశంసలు

0
0

నువ్వు నిజంగానే దేవుడివయ్యా.. సూర్యపై ప్రశంసలు..!!

నటుడు సూర్య నిర్వహిస్తున్న స్వచ్ఛంద సేవా సంస్థ అగరం ఫౌండేషన్‌. ఈ ఫౌండేషన్‌ ద్వారా అనేక మంది పేద విద్యార్థులకు విద్యాదానం చేస్తున్నారు. కాగా అగరం ఫౌండేషన్‌ స్థాపించి 15 వసంతాలు పూర్తి అయిన సందర్భంగా చెన్నైలోని ఒక ప్రైవేట్‌ కళాశాలలో వేడుకను నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో నటుడు శివకుమార్, సూర్య, కార్తీ, జ్యోతిక, దర్శకుడు జ్ఞానవేల్, వెట్రిమారన్‌ నిర్మాత కలైపులి ఎస్‌ ధాను, డ్రమ్స్‌ శివమణి ప్రముఖులు పాల్గొని, అగరం ఫౌండేషన్‌ విద్యా సేవలను కొనియాడారు. ఈ వేడుకకు నటుడు, మక్కల్‌ నీతిమయ్యం పార్టీ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు కమలహాసన్‌ ముఖ్య అతిథిగా విచ్చేశారు.

ఈ సందర్భంగా నటుడు సూర్య మాట్లాడుతూ ఇది అగరం ఫౌండేషన్‌ 15వ వార్షికోత్సవం అని విద్య అనేది ఆయుధం అన్నదే అగరం ఫౌండేషన్‌ నమ్మకం అని, అది ఈరోజు నిజం అయ్యిందని పేర్కొన్నారు. విద్య అనేది చదువు మాత్రమే కాదని విద్యార్థులకుమన సాంప్రదాయాన్ని నేర్పించేదన్నారు. వారి ప్రతిభను వెలికి తీసే పనిని అగరం ఫౌండేషన్‌ చేస్తోందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో కష్టపడే విద్యార్థులకు అగరం ఫౌండేషన్‌ విద్యాసేవలు అందిస్తుందని, విద్య ఎంత మార్పు తీసుకొస్తుందన్నది గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థులకు తెలియజేయాలన్నదేఆగరం ఫౌండేషన్‌ ప్రయత్నం అని సూర్య పేర్కొన్నారు.

15 ఏళ్ల ప్రయాణం..51 మంది వైద్యులు
కాగా అగరం ద్వారా ఈ 15 ఏళ్లలో 51 మంది విద్యార్థులు వైద్యవిద్యను అభ్యసించి, వైద్యులు అయ్యారని నిర్వాహకులు తెలిపారు. ఇప్పటి వరకు ఈ సంస్థ నుంచి సుమారు 8 వేలకు పైగానే విద్యార్థులు తమ విద్యను పూర్తి చేసుకుని వివిధ రంగాల్లో రాణిస్తున్నారని పేర్కొన్నారు. రెట్రో సినిమా లాభాల్లోంచి రూ.10 కోట్లు అగరం ఫౌండేషన్‌కు సూర్య విరాళంగా ఇచ్చారు. పేదవారికి అండగా నిలబడుతున్న సూర్య నిజంగానే దేవుడు అంటూ సోషల్‌మీడియాలో ప్రశంసలు కురిపిస్తున్నారు.

ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న కమలహాసన్‌ మాట్లాడుతూ విద్య,ప్రేమ ఒకే చోట లభించడం సాధ్యం కాదన్నారు. అయితే అది అమ్మ వద్ద, అగరం వద్ద లభిస్తాయన్నారు. సమాజంలో ఇలాంటి సేవా కార్యక్రమాలు చేసే వారికి లభించేది ముళ్ల కిరీటాలేన్నారు. తాను విద్యను నేర్చుకునే తీరుతాను, ఇతరులకు నేర్పించే తీరుతాను అనేది ఒక సాగదీత ప్రక్రియగా పేర్కొన్నారు. 2017 తర్వాత విద్యార్థుల వైద్యవిద్య అనేది కొనసాగలేక పోతోందన్నారు. కారణం నీట్‌ పరీక్ష అని పేర్కొన్నారు. అందుకే నీట్‌ పరీక్షలు వద్దని తాము చెబుతున్నామన్నారు. అందుకు చట్టాన్ని మార్చే బలం విద్యకే ఉందన్నారు. విద్య అనేది ఈ యుద్ధంలో ఆయుధంగా మాత్రమే కాదని, దేశాన్ని చక్కదిద్దేది కూడా అని అన్నారు. సనాతన సంకెళ్లను, సర్వాధికార సంకెళ్లను నుగ్గు నుగ్గు చేసే ఆయుధం విద్య అని కమలహాసన్‌ పేర్కొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here