ఎన్‌టీఆర్ జిల్లా, జులై 14, 2025
నిమ్న వర్గాల అభ్యున్నతి లక్ష్యంగా అడుగులేయండి..
- ఎస్‌సీ, ఎస్‌టీ అట్రాసిటీ యాక్ట్ ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలి
- పథకాలను సద్వినియోగం చేసుకునేలా చేయిపట్టి నడిపించండి
- బ్యాంకు రుణాల మంజూరుతో పేదవాని ఇళ్లను నిలబెట్టండి
- స్వయం ఉపాధి కార్యక్రమాలపై ప్రత్యేకంగా దృష్టిసారించాలి
- పీ4 విధానంతో అణగారిన వర్గాల జీవితాల్లో కొత్త వెలుగులు
- జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యులు వడ్డేపల్లి రాంచందర్
రాజ్యాంగ అధికరణ 338 ప్రకారం ఏర్పడిన జాతీయ ఎస్సీ కమిషన్.. షెడ్యూల్డు కులాల సాంఘిక, ఆర్థిక అభివృద్ధిలో విశేష కృషిచేస్తోందని.. అధికారులు కూడా క్రమశిక్షణ, నిబద్ధతతో నిమ్న వర్గాల అభ్యున్నతి లక్ష్యంగా అడుగులేయాలని జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యులు వడ్డేపల్లి రాంచందర్ అన్నారు.
సోమవారం కలెక్టరేట్ శ్రీ ఏవీఎస్ రెడ్డి వీసీ హాల్‌లో జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యులు వడ్డేపల్లి రాంచందర్, డైరెక్టర్ డా. జి.సునీల్ కుమార్‌బాబు.. కలెక్టర్ డా. జి.లక్ష్మీశతో కలిసి జిల్లా సమీక్షా సమావేశం నిర్వహించారు. జిల్లాలో ఎస్సీ జనాభా (2011 సెన్సస్ ప్రకారం 18.32 శాతం), ఎస్సీ వర్గాల్లో అక్షరాస్యత, వివిధ పథకాల అమలు, ఆరోగ్యం, పోషణ, భూ పంపిణీ, నవోదయం తదితర అంశాలను కలెక్టర్ లక్ష్మీశ పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు. ఎక్కడా ఎప్పుడూలేని విధంగా పేదరిక నిర్మూలన లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పీ4 విధానాన్ని అమలుచేస్తోందని.. జిల్లాలో మార్గదర్శుల ద్వారా బంగారు కుటుంబాల అభివృద్ధికి ప్రణాళిక ప్రకారం చొరవ చూపుతున్నట్లు వివరించారు. తల్లికి వందనం పథకం అమలుతో పాటు మెగా పీటీఎం ఫలితాలను వివరించారు. కమిషన్ సభ్యుల విలువైన సూచనలను పరిగణనలోకి తీసుకొని ఎస్సీ సంక్షేమంలో జిల్లాను నెం.1గా నిలిపేందుకు సమష్టిగా కృషిచేయనున్నట్లు తెలిపారు. సాంఘిక సంక్షేమం, ఉపాధి కల్పన, నైపుణ్యాభివృద్ధి, పాఠశాల విద్య, గ్రామీణ నీటి సరఫరా, డ్వామా, గృహ నిర్మాణం తదితర శాఖలు తమ పరిధిలో ఎస్సీల సమగ్రాభివృద్దికి అమలుచేస్తున్న కార్యక్రమాల ప్రగతిని అధికారులు వివరించారు. అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీ చట్టం కింద నమోదైన కేసులు, వాటిలో పురోగతిని, గ్రామాల్లో సైతం సీసీ కెమెరాల ద్వారా నిఘా వంటి విషయాలను సీపీ ఎస్‌వీ రాజశేఖరబాబు వివరించారు.
ఫిర్యాదులపై తక్షణం స్పందించాలి:
ఈ సందర్భంగా జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యులు వడ్డేపల్లి రాంచందర్ మాట్లాడుతూ అట్రాసిటీకి సంబంధించి ఎస్సీల నుంచి ఫిర్యాదు అందిన వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేసి అరెస్టుకు చర్యలు తీసుకోవాలని అన్నారు. మూడు నెలలకోసారి తప్పనిసరిగా డిస్ట్రిక్ట్ లెవెల్ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశాలు నిర్వహించాలని సూచించారు. చట్ట ప్రకారం పరిహారం, ఉపాధి కల్పన తదితరాలపై చర్యలు తీసుకోవాలన్నారు. గౌరవ ప్రధానమంత్రి దార్శనికతకు అనుగుణంగా పీఎం ఆవాస్ యోజన ద్వారా పేదలకు ఇళ్లు నిలబెట్టేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆర్థిక మద్దతుకు అదనంగా బ్యాంకులు త్వరితగతిన రుణాలు మంజూరు చేయాలన్నారు. పీఎంఈజీపీ, స్టాండప్ ఇండియా, పీఎం ముద్రా యోజన తదితర పథకాలకు బ్యాంకు రుణాల మంజూరుకు బ్యాంకర్లు చొరవచూపాలని, క్రెడిట్ గ్యారెంటీ ఫండ్ ట్రస్ట్ ఫర్ మైక్రో అండ్ స్మాల్ ఎంటర్‌ప్రైజెస్ (సీజీటీఎంఎస్ఈ) కవరేజీ ద్వారా పూచీకత్తులు లేని రుణాల మంజూరుకు చర్యలు తీసుకోవాలన్నారు. స్వయం ఉపాధిపై ప్రత్యేకంగా దృష్టిసారించాలన్నారు. బ్యాక్‌లాగ్ ఖాళీల భర్తీ, ఉద్యోగుల పదోన్నతుల విషయంలో ఎట్టిపరిస్థితుల్లోనూ జాప్యం ఉండరాదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వినూత్నంగా ప్రారంభించిన పీ4 విధానంతో పేదల జీవితాల్లో కొత్త వెలుగులకు అవకాశం ఉందని రాంచందర్ పేర్కొన్నారు. ఎస్సీ రైతులను ఉద్యాన పంటల సాగు దిశగా ప్రోత్సహించడం ద్వారా మెరుగైన ఆదాయాలు పొందేలా చూడొచ్చన్నారు.
సమావేశంలో డీఆర్‌వో ఎం.లక్ష్మీనరసింహం, విజయవాడ ఆర్‌డీవో కావూరి చైతన్య, జిల్లా షెడ్యూల్డు కులాల సంక్షేమాధికారి జి.మహేశ్వరరావు, డీసీపీ కేజీవీ సరిత, వివిధ శాఖల జిల్లాస్థాయి అధికారులు పాల్గొన్నారు.