
ఎన్‌టీఆర్ జిల్లా, నవంబర్ 22, 2025
దేశ సేవకు అత్యున్నత మార్గం.. అగ్నివీర్
- అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి
- విజయవాడ ఆర్‌డీవో కావూరి చైతన్య
భారత వాయుసేనలో అగ్నివీర్ ద్వారా దేశ సేవకు అత్యున్నత మార్గం అందుబాటులో ఉందని.. ఈ అవకాశాన్ని యువత సద్వినియోగం చేసుకోవాలని విజయవాడ ఆర్‌డీవో కావూరి చైతన్య శనివారం ఓ ప్రకటనలో పిలుపునిచ్చారు.
అగ్నివీర్ ఉద్యోగ అవకాశాలపై ఇప్పటికే లయోలా కళాశాలలో అవగాహన సదస్సు నిర్వహించామని.. భారత వాయుసేన అధికారి వింగ్ కమాండర్ షేక్ యాకూబ్ అలీతో కలిసి అర్హత, ఎంపిక విధానం, దేహదారుఢ్య ప్రమాణాలు తదితర అంశాలను క్షుణ్నంగా వివరించినట్లు తెలిపారు. వివిధ కళాశాలలకు చెందిన దాదాపు 2,500 మంది విద్యార్థినీ విద్యార్థులు ఈ అవగాహన సదస్సులో పాల్గొన్నారన్నారు. ఇంటర్/డిప్లొమా విద్యార్హతలతోనే అగ్నివీర్ -వాయుగా భారత వాయుసేనలో చేరవచ్చని చెప్పారు. 17 1/2 సంవత్సరాల నుంచి 21 ఏళ్ల వయసుగల యువతీ, యువకులు దీనికి అర్హులన్నారు. ఆన్‌లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. చిన్న వయసులోనే దేశానికి సేవచేసే అవకాశం లభిస్తుందని, దీనిని యువత అందిపుచ్చుకోవాలని ఆర్‌డీవో కావూరి చైతన్య తెలిపారు.
![]()
