08-08-2025
‘దీర్ఘాయుష్మాన్’ యాప్‌ను ప్రారంభించిన సీఎం నారా చంద్రబాబు నాయుడు
ప్రతీ ఇంటికి వైద్య సేవలే లక్ష్యంగా రూపకల్పన
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము సమక్షంలో ‘దీర్ఘాయుష్మాన్’ యాప్‌ను అధికారికంగా ప్రారంభించినట్లు సంస్థ వ్యవస్థాపకుడు మద్దినేని రవిచంద్ర ప్రకటించారు. ప్రతీ ఇంటికీ వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో ఈ యాప్‌ను రూపొందించినట్లు ఆయన తెలిపారు.
వైద్యం అత్యంత ఖరీదైన ఈ రోజుల్లో, సామాన్య మరియు మధ్యతరగతి ప్రజలకు అందుబాటు ధరల్లో నాణ్యమైన వైద్యసేవలు అందించాలనే సంకల్పంతో దీర్ఘాయుష్మాన్‌ను ప్రారంభించామని రవి మద్దినేని వివరించారు. ప్రస్తుతం ఈ యాప్ ద్వారా విజయవాడ మరియు గుంటూరు నగరాల్లో అత్యవసర వైద్య సేవలను అందిస్తున్నామని తెలిపారు.
ఈ యాప్ ద్వారా వినియోగదారులు బైక్ అంబులెన్స్ వంటి అత్యవసర వైద్య సేవలను బుక్ చేసుకోవడంతో పాటు, వైద్య విభాగానికి సంబంధించిన అనేక ఇతర సేవలను నేరుగా ఇంటికే పొందే అవకాశం కల్పించామని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా రవిచంద్ర మద్దినేని మాట్లాడుతూ… “భారతదేశంలో వైద్య సేవల రూపాన్ని మార్చడం మా లక్ష్యం. ఆసుపత్రి నుంచి బయటకు వచ్చిన తర్వాత రోగి ఆరోగ్యాన్ని కాపాడేందుకు దీర్ఘాయుష్మాన్ ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుంది. ఆధునిక వైద్య సాంకేతికతను కరుణతో కలిపి, ఇంటి వద్ద, సమాజంలో, ఎక్కడ అవసరమైతే అక్కడ వైద్య సేవలను అందించేందుకు మేము కట్టుబడి ఉన్నాం. అమరావతిలో మా మెడికల్ యూనిట్ ప్రారంభం ఈ లక్ష్యానికి తొలి అడుగు మాత్రమే” అన్నారు.
వృద్ధులు గౌరవంతో జీవించేందుకు సహాయం చేయడం, శస్త్రచికిత్స అనంతర పునరావాసానికి మద్దతు ఇవ్వడం, దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యల నిర్వహణ, అలాగే వినూత్నమైన బైక్ అంబులెన్స్ ద్వారా అత్యవసర సహాయం అందించడం – ఇవన్నీ దీర్ఘాయుష్మాన్ సేవల్లో భాగమని ఆయన వివరించారు.