జిల్లాలో తొమ్మిది ల‌క్ష‌ల మందికి యోగాను చేరువ‌చేశాం

0

ఎన్‌టీఆర్ జిల్లా, జులై 02, 2025

జిల్లాలో తొమ్మిది ల‌క్ష‌ల మందికి యోగాను చేరువ‌చేశాం

  • స‌మ‌ష్టి కృషి ఫ‌లిత‌మైన ఈ విజ‌యాన్ని స్ఫూర్తిగా తీసుకుందాం
  • అంద‌రి జీవితాల్లో యోగా భాగ‌మ‌య్యేలా ప్రోత్స‌హిద్దాం
  • అమ‌రావ‌తి యోగా జిల్లాకు ఓ మంచి సంప‌ద‌
  • జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌

యోగాంధ్ర‌-2025 ద్వారా జిల్లాలో తొమ్మిది ల‌క్ష‌ల మందికి యోగాను చేరువ‌చేశామ‌ని.. స‌మ‌ష్టి కృషి ఫ‌లిత‌మైన ఈ విజ‌యంలో అమ‌రావ‌తి యోగా అండ్ ఏరోబిక్స్ అసోసియేష‌న్ కీల‌క భాగ‌స్వామ్యం అందించింద‌ని జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ అన్నారు.
అమ‌రావ‌తి యోగా అండ్ ఏరోబిక్స్ అసోసియేష‌న్ ఆధ్వ‌ర్యంలో ఏప్రిల్ 24 నుంచి జూన్ 12 వ‌ర‌కు ఉచిత వేస‌వి యోగా శిక్ష‌ణ శిబిరం జ‌రిగింది. ఈ శిబిరంలో పాల్గొన్న 108 మందికి స‌ర్టిఫికెట్లు అందించే కార్య‌క్ర‌మం బుధ‌వారం ఇందిరాగాంధీ మునిసిప‌ల్ కార్పొరేష‌న్ స్టేడియంలోని అసోసియేష‌న్ కార్యాల‌యంలో జ‌రిగింది. కార్య‌క్ర‌మానికి క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ ముఖ్య అతిథిగా హాజ‌రై స‌ర్టిఫికెట్లు ప్ర‌దానం చేశారు. ఈ సంద‌ర్బంగా ఆయ‌న మాట్లాడుతూ జిల్లాలో యోగాంధ్ర కార్య‌క్ర‌మాన్ని ముందుకు తీసుకెళ్ల‌డంలో, బీఆర్‌టీఎస్ యోగా స్ట్రీట్‌లో ప్ర‌త్యేక యోగా శిబిరాలు నిర్వ‌హించ‌డంలో అమ‌రావ‌తి యోగా కీల‌క‌పాత్ర పోషించింద‌ని.. ఈ సంస్థ జిల్లాకు ఓ మంచి సంప‌ద అని పేర్కొన్నారు. ఆరోగ్య‌క‌ర స‌మాజ నిర్మాణానికి స్వ‌చ్ఛ‌మైన, మంచి ఆలోచ‌న‌లు అవ‌స‌ర‌మని.. గొప్ప ఆలోచ‌న‌ల‌కు ఆస్కారం క‌ల్పించేలా శారీర‌క‌, మాన‌సిక ఆరోగ్యాన్ని పెంపొందించే స‌త్తా యోగాకు ఉంద‌ని.. ఇంత మంచి సందేశాన్ని ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్తున్నందుకు అసోసియేష‌న్‌కు ధ‌న్య‌వాదాలు తెలియ‌జేస్తున్న‌ట్లు తెలిపారు.
నెగెటివ్ ఆలోచ‌న‌లు దూరం: యోగా సాధ‌న వ‌ల్ల నెగెటివ్‌ ఆలోచనలు దూర‌మై.. త‌నువు, మ‌న‌సంతా పాజిటివిటీతో నిండిపోతుంద‌ని.. దీనిద్వారా ఆరోగ్య‌క‌ర స‌మాజ నిర్మాణం జ‌రుగుతుంద‌ని క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ అన్నారు. జిల్లాలో ఖాళీ స్థలాలు, పార్కుల్లో యోగా సాధ‌నకు ఏర్పాట్లు చేయాల‌ని అధికారుల‌ను ఆదేశించిన‌ట్లు తెలిపారు. యోగాను ఒక వ్యాయామంగా మాత్ర‌మే కాకుండా జీవితంలో ఒక భాగంగా చూడాలని గౌర‌వ ముఖ్యమంత్రి చెబుతుంటార‌ని.. శారీరకంగా ఆరోగ్యంగా ఉండటమే కాకుండా మానసికంగానూ బలంగా ఉండాలంటే అది ఒక్క యోగాతోనే సాధ్య‌మ‌ని క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ పేర్కొన్నారు.
కార్య‌క్ర‌మంలో అమరావతి యోగా అండ్‌ ఏరోబిక్స్‌ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ మిరియాల వెంకటేశ్వరరావు, వైస్ ప్రెసిడెంట్ దాసరి కాశీవిశ్వనాథ్, రిటైర్డ్‌ డీసీపీ హరికృష్ణ, కార్యదర్శి పీవీ రమణ, కోశాధికారి ఎ.లావణ్యకుమార్, యోగా గురువు అంకాల సత్యనారాయణతో పాటు యోగా సాధకులు, అసోసియేషన్‌ సభ్యులు త‌దిత‌రులు పాల్గొన్నారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version