గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తున్న‌ ఆప్కాబ్ మంత్రి కింజ‌రాపు అచ్చెన్నాయుడు

0

గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తున్న‌ ఆప్కాబ్

సహకార వ్యవస్థను మరింత శక్తివంతం చేసి..ప్రతి రైతు కుటుంబాన్ని ఆర్థికంగా నిలదొక్కుకునేలా చేయడమే లక్ష్యం

సాంకేతిక ప్రగతితో సహకార బ్యాంకుల సేవలను ప్రజలతో మమేకం చేసే దిశగా అడుగులు

ఘనంగా ఆప్కాబ్ 62వ వ్యవస్థాపక దినోత్సవ వేడుక‌లు

ముఖ్య అతిథిగా హ‌జ‌రైన వ్య‌వ‌సాయ శాఖ మంత్రి కింజ‌రాపు అచ్చెన్నాయుడు

అమ‌రావ‌తి/ విజ‌య‌వాడ – ఆగ‌స్ట్ 4: ఆప్కాబ్ రాష్ట్రంలోని సహకార రంగాన్ని బలోపేతం చేస్తూ, గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు నాడి వంటి సేవలందిస్తోందని రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్ శాఖ‌ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. విజ‌య‌వాడ‌లో గ‌వ‌ర్న‌ర్ పేట‌లోని ఎంబీ విజ్ఞాన కేంద్రంలో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర సహకార బ్యాంక్‌ (APCOB) 62వ స్థాపన దినోత్సవ వేడుక‌లు ఘ‌నంగా నిర్వ‌హించారు. ఈ కార్య‌క్ర‌మానికి మంత్రి అచ్చెన్నాయుడు ముఖ్య అతిథిగా హ‌జ‌రయ్యారు. ఈ సంద‌ర్భంగా మంత్రి మాట్లాడుతూ బ్యాంక్‌ ద్వారా ప్రయోజనం పొందుతున్న రైతులకు, మహిళా సమాఖ్యలకు, యువతకు, సహకార సంఘాల సభ్యులకు, అధికారులు, సిబ్బందికి శుభాకాంక్షలు తెలియజేశారు. రైతులకు విత్తనాలు, ఎరువులు, పెట్టుబడుల కోసం సకాలంలో రుణాలు అందిస్తూ, వ్యవసాయ అభివృద్ధికి ముఖ్య భుజంగా ఆస్కాబ్ నిలుస్తోందని తెలిపారు. సహకార వ్యవస్థను మరింత శక్తివంతం చేసి, ప్రతి రైతు కుటుంబాన్ని ఆర్థికంగా నిలదొక్కుకునేలా చేయడమే కూట‌మి ప్ర‌భుత్వ‌ లక్ష్యమని అన్నారు. ఈ బ్యాంకు వ్యవస్థ పట్ల ప్రభుత్వం సంపూర్ణ నిబద్ధతతో ఉందని, సాంకేతిక ప్రగతితో సహకార బ్యాంకుల సేవలను మరింత ప్రజలతో మమేకం చేసే దిశగా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. డిసీసీబి, పిఏసిఎస్‌, ఆప్కాబ్‌లు వంటి సంస్థలు కమర్షియల్ బ్యాంకులు రాని గ్రామీణ ప్రాంతాలలో ఎన్నో సంవత్సరాలుగా సేవలు అందిస్తున్నాయని కొనియాడారు.

పేద వ‌ర్గాల అభివృద్ధికి ప్ర‌త్యేక చొర‌వ‌

గ్రామాల్లో పేదవారికి ఆర్ధిక తోడ్పాటు ఇవ్వ‌డం, వారి అభివృద్ధికి ఆప్కాబ్ వ్యవస్థ ఎంతో దోహ‌దం చేసింద‌న్నారు. ఈ విష‌యాన్ని మనందరం గుర్తుకు తెచ్చుకోవాలని అన్నారు. ఒకప్పుడు కేంద్రంలో ఈ వ్యవస్థకి వీడిగా మంత్రిత్వ శాఖ ఉండేది కాదని, 2014లో మోడీ ప్రధానమంత్రి అయిన తర్వాత ఈ శాఖ యొక్క విలువ‌ల‌ను తెలుసుకొని ఒక ప్రత్యేకమైనటువంటి మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేశార‌ని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యంత ప్రాధాన్యత కలిగిన రంగాలు వ్యవసాయం, కోపరేటివ్ అని ఈ రెండు రంగాలను అభివృద్ధి చేయాలంటే ఆర్థికంగా వారికి సహాయం చేయాల‌ని, ఆర్థికంగా సహాయం చేయాలంటే ఆప్కాబ్ చాలా ముఖ్యమైనటువంటి వ్యవస్థగా రూపుదిద్దుకోంద‌ని తెలిపారు. ఒకప్పుడు రుణాలు ఇవ్వడానికి మాత్ర‌మే ఉప‌యోగించుకునే ఆప్కాబ్ నేడు రైతుల‌కు ఎరువులు, విత్తనాలు, పురుగుమందులు అందిస్తూ మ‌రొక ముంద‌డుగు వేసి మెడికల్ షాపులు, పెట్రోల్ బంకులు నిర్వ‌హ‌ణ వ‌ల‌న ఈ వ్యవస్థ బోలోపేతానికి చాలా ఎక్కువగా కృషి చేస్తున్నామ‌ని అన్నారు.

విజ‌న‌రీ నేత చంద్ర‌బాబుతోనే టెక్నాల‌జీ సాకారం

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడైనా సరే టెక్నాలజీ రంగంలో నూత‌న ఆవిష్క‌ర‌ణ‌లు చేయాల‌న్నా, స‌రికొత్త టెక్నాల‌జీని ప్ర‌జ‌ల‌కు ప‌రిచ‌యం చేయాలంటే విజ‌నరీ నేత‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆధ్వర్యంలో అమ‌లు జ‌రిగింద‌న్నారు. గ‌తంలో పేదవాడికి సహాయపడినటువంటి ఈ వ్యవస్థకు జ‌వాబుదారీత‌నం లేక‌, స‌రైన రికార్డ్స్ లేకపోవడం వల్ల ప‌లు అవినీతి కార్య‌క‌లాపాలు జ‌రిగాయ‌ని, అందుకే కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈ మూడు వ్యవస్థల్ని కంప్యూటరైజేష‌న్ చేయాలని నిర్ణయం తీసుకుని సీఎంగా చంద్రబాబు నాయుడు ఆధ్వ‌ర్యంలో ఈ దేశంలో అన్ని రాష్ట్రాల కంటే మన రాష్ట్రంలోనే పీఏసీఎస్ ల‌ను కంప్యూట‌రైజేష‌న్ చేయ‌డం జ‌రిగింద‌న్నారు. కమర్షియల్ బ్యాంక్స్ అన్నీ కూడా నేడు కంప్యూటరైజేష‌న్ అయిన కార‌ణంగా మనం ఎందుకు చేయలేకపోతున్నామ‌ని భావించి కేంద్ర ప్రభుత్వ స‌హాకారంతో ఈ మ‌హాయ‌జ్ఞాన్ని పూర్తిచేసామ‌న్నారు. ప్ర‌స్తుతం జ‌రుగుతున్న‌టువంటి ఆడిటింగ్ ప‌ని పూర్త‌వ్వ‌గానే ఆన్లైన్లో ట్రాన్సాక్షన్స్ అదే విధంగా కొత్తగా మెంబర్స్ ను చేర్చుకునే కార్యక్రమాన్ని డీసీసీబీ, పీఏసీలు మొద‌లుపెట్టాల‌ని సూచించారు. ప్రతి కౌలు రైతు తప్పనిసరిగా ఒక మెంబర్ గా సొసైటీలో ఉండే విధంగా జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు.

డ్రాక్రా గ్రూప్ లావాదేవీలు జ‌రిగేలా ప్ర‌త్యేక చ‌ర్య‌లు

రాష్ట్రంలో మహిళలకు ఆర్ధిక భ‌రోసాను ఇచ్చేందుకు డ్వాక్రా వ్య‌వ‌స్థ‌ని సీఎం చంద్ర‌బాబు ప్ర‌వేశ‌పెట్టార‌ని నేటికి ఆ కార్య‌క్ర‌మం విజ‌య‌వంతంగా జ‌రుగుతోంద‌న్నారు. దేశానికి ఒక ఆదర్శవంతమైనటువంటి వ్యవస్థగా తయారు చేసి, దాదాపుగా కోటి మంది మహిళలు ఈ వ్యవస్థలో భాగ‌స్వామ్యులుగా ఉంటూ 42 వేల కోట్ల రూపాయల లావాదేవీలు జ‌రుగుతున్నాయ‌ని తెలిపారు. అయితే ఈ లావాదేవీలు ఎక్కువ‌గా ప్రైవేట్ బ్యాంక్స్ లో జ‌రుగుతున్నాయ‌ని, ఆప్కాబ్ బ్యాంకుల‌లో మ‌రింత వేగంగా ట్రాన్ఫ‌ర్స్ అయ్యేలా, డ్రాక్రా లావాదేవీలు జ‌రిగేలా చ‌ర్య‌లు చేప‌ట్టేందుకు సీఎం చంద్ర‌బాబు తో మాట్లాడి ప్రణాళిక రూపొందిస్తామ‌ని హమీ ఇచ్చారు. ప్రైవేట్ బ్యాంక్ ల కంటే తక్కువగా మ‌హిళ‌ల‌కు త‌క్కువ వడ్డీకి రునాలు అందేలా పూర్తిస్థాయిలో కృషి చేద్దామని అన్నారు. అంద‌రం కలిసికట్టుగా ఈ రంగాన్ని పూర్తిగా ముందుకు తీసుకెళ్లడానికి కృషి చేద్దామ‌ని పిలుపునిచ్చారు. APCOB సేవలు రాష్ట్ర అభివృద్ధిలో అమూల్యమైనవని, భవిష్యత్‌లో మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని మంత్రి అచ్చెన్నాయుడు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఆప్కాబ్ చైర్మ‌న్ జీ వీరాంజ‌నేయులు, స్పెషల్ చీఫ్ సెక్ర‌ట‌రీ బీ. రాజశేఖర్, ఆర్సీఎస్ అమర్ బాబు, ఆప్కాబ్ ఎండీ శ్రీనాథ్ రెడ్డి , నాబార్డ్ సీజీఎం గోపాల్ , జిల్లాల డిసిసిబి చైర్మన్లు, పీఏసీఎస్ చైర్మ‌న్లు, సిబ్బంది, పాల్గొన్నారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version