18-07-2025
క్వాంటమ్ వ్యాలీతో యువతకు ఉజ్వల భవిష్యత్తు-రాష్ట్రంతో పాటు దేశ ముఖచిత్రమే మారబోతోంది : ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని)
కేశినేని ఫౌండేషన్, ఎ.పి.ఎస్.ఎస్.డి.సి ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా
పిబి సిద్ధార్ధ కాలేజీలో జాబ్ మేళా ను ప్రారంభించిన ఎంపీ కేశినేని, ఎమ్మెల్యే గద్దె, కలెక్టర్ లక్ష్మీశా
స్వర్ణాంధ్ర, వికసిత్ భారత్‌లకు యువతే రథసారథులు
ఉద్యోగాలతో పాటు పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకూ ప్రభుత్వం కృషి
ఒక కుటుంబం-ఒక పారిశ్రామికవేత్త కింద నైపుణ్య శిక్షణకు పెద్దపీట
విజయవాడ : ముఖ్యమంత్రి దార్శనికతకు ప్రతిరూపమైన క్వాంటమ్ వ్యాలీతో రాష్ట్రంతో పాటు దేశ ముఖచిత్రమే మారబోతోందని, దీంతో యువతకు ఉజ్వల భవిష్యత్తు సొంతమవుతుందని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) అన్నారు.
కేశినేని ఫౌండేషన్ , ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ (ఏపీఎస్ఎస్‌డీసీ),ఆధ్వర్యంలో శుక్రవారం నగరంలోని పీబీ సిద్ధార్థ ఆర్ట్స్, సైన్స్ కళాశాలలో మెగా జాబ్ మేళాను ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు, కలెక్టర్ డా. జి.లక్ష్మీశ.. కళాశాల ప్రిన్సిపల్ డా. ఎం.రమేష్, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి ప్రారంభించారు. ఈ జాబ్‌మేళాలో 40కుపైగా సంస్థలు పాల్గొన్నాయి. ఎస్ఎస్‌సీ, ఇంటర్, ఐటీఐ, డిప్లొమా, ఏదైనా డిగ్రీ, బీటెక్, పీజీ విద్యార్హతలతో ఉద్యోగాలు ఇచ్చేందుకు సంస్థలు ఇంటర్వ్యూలు నిర్వహించాయి.
ఈ సందర్బంగా కేశినేని చిన్ని మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగావకాశాల కల్పనతో పాటు ప్రతి ఇంటి నుంచి ఒక పారి శ్రామికవేత్త కావాలనే ఉద్దేశంతో సీడాప్ (ఎస్ఈఈడీఏపీ) ద్వారా పెద్దఎత్తున నైపుణ్య శిక్షణ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఉచితంగా భోజనం, వసతి కల్పిస్తూ నైపుణ్య శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటుచేయనున్నట్లు వెల్లడించారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చిన వికసిత్ భారత్, ముఖ్యమంత్రి నేతృత్వంలోని స్వర్ణాంధ్రకు యువతే రథసారథులు అని, ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలను సద్వినియోగం చేసుకుంటూ ప్రతిఒక్కరూ ఎంటర్‌ప్రెన్యూర్ దిశగా అడుగులేయాలని సూచించారు. విజయవాడ అంటేనే ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌నకు మారుపేరని, ట్రేడ్ సిటీగా పేరుందని.. ఇక్కడి నుంచే ఎంతోమంది ఉన్నత స్థానాలకు ఎదిగారని పేర్కొన్నారు. రూ. 500తో ఓ చిన్న ఉద్యోగిగా కెరీర్ ప్రారంభించి, స్వయంకృషితో ఎంటర్‌ప్రెన్యూర్‌గా, రాజకీయ నేతగా ఎదిగిన శాసనసభ్యులు, గద్దెరామ్మోహన్, ఓ రైతు కుటుంబంలో జన్మించి ఐఏఎస్‌గా ఎదిగిన మన జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ వంటివారిని స్ఫూర్తిగా తీసుకొని ముందడుగు వేయాలని సూచించారు.
జాబ్ మేళాలో ప్రతిఒక్కరికీ ఉద్యోగం రావాలని కోరుకుంటున్నానని.. ఒకవేళ ఏదైనా కారణంతో ఉద్యోగం రాకపోయినా, నిరుత్సాహపడకుండా కమ్యూనికేషన్ స్కిల్స్ వంటి కీలక నైపుణ్యాలు పరంగా సరిదిద్దుకొని కొత్త ఉత్సాహంతో తర్వాతి ఇంటర్వూలకు, జాబ్ మేళాలకు హాజరుకావాలని సూచించారు. ఇందుకు తన సహాయసహకారాలు ఎప్పుడూ ఉంటాయని ఎంపీ కేశినేని శివనాథ్ అన్నారు. ప్రతి మూడు నెలలకు ఒకసారి ఎన్టీఆర్ జిల్లా లోని ఒక నియోజకవర్గంలో కేశినేని ఫౌండేషన్ , ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ, ఎన్టీఆర్ వికాస ఆధ్వర్యంలో జాబ్ మేళా నిర్వహిస్తామని తెలిపారు. ఈ జాబ్ మేళాను నిర్వహించేందుకు అవకాశం కల్పించిన పి.బి. సిద్దార్ధ కాలేజీ ప్రిన్సిపాల్ రమేష్ కి ధన్యవాదాలు తెలిపారు.
వైబ్రెంట్ విజయవాడలో ప్రతిభకు కొదవలేదు: కలెక్టర్ డా. జి.లక్ష్మీశ
వైబ్రెంట్ విజయవాలో ప్రతిభకు కొదవలేదని.. అవకాశాలను అందిపుచ్చుకొని యువత కెరీర్ పరంగా ఉన్నత అవకాశాలను చేజిక్కించుకోవలని కలెక్టర్ డా. జి.లక్ష్మీశ సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు యువతకు ఉద్యోగావకాశాల కల్పన, నైపుణ్యాభివృద్ధిపై ప్రత్యేకంగా దృష్టి సారించరన్నారు. ఇంతమంచి కార్యక్రమాన్ని ఏర్పాటుచేసిన కేశినేని ఫౌండేషన్‌కు, హాజరైన సంస్థలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు తెలిపారు. కలెక్టరేట్‌లోనూ ఎన్‌టీఆర్ వికాస ద్వారా ఉద్యోగ మేళాలు నిర్వహిస్తున్నామని, నిరుద్యోగులు ఎప్పుడైనా ఇక్కడివచ్చి రిజిస్టర్ చేసుకోవచ్చన్నారు. ప్రతి నియోజకవర్గంలోనూ జాబ్ మేళాలు ఏర్పాటు చేయడం జరుగుతుందని కలెక్టర్ లక్ష్మీశ తెలిపారు.
అయిదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు లక్ష్యం: ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌రావు
రాష్ట్రంలో అయిదేళ్లలో 20 లక్షల ఉద్యోగాల కల్పనను రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకొందని, ఈ లక్ష్య సాధనకు వివిధ రకాల పాలసీలు తీసుకురావడం జరిగిందని శాసనసభ్యులు గద్దె రామ్మోహన్‌రావు అన్నారు. ప్రభుత్వ విధానాలతో రూ. లక్షల కోట్ల పెట్టుబడులతో పెద్దపెద్ద కంపెనీలు రాష్ట్రానికి వస్తున్నాయన్నారు. విజయవాడ తూర్పు నియోజకవర్గంలోనూ ఎప్పటికప్పుడు జాబ్ మేళాలు నిర్వహించడం జరుగుతోందని, యువత మంచి ఉద్యోగాలు పొందేందుకు జాబ్ మేళాలు మంచి వేదికలని పేర్కొన్నారు. భవిష్యత్తులోనూ మరిన్ని జాబ్ మేళాలు నిర్వహించనున్నామని, యువత వీటిని సద్వినియోగం చేసుకోవాలని శాసనసభ్యులు రామ్మోహన్‌రావు తెలిపారు.
పీబీ సిద్ధార్థ కళాశాల ప్రిన్సిపల్ డా. ఎం.రమేష్ మాట్లాడుతూ మెగా జాబ్ మేళాకు కళాశాల వేదిక అయినందుకు చాలా ఆనందంగా ఉందని, విద్యార్థులు అకడమిక్ నైపుణ్యాలతో పాటు జాబ్ నైపుణ్యాలు కూడా సముపార్జించుకోవాలని.. అప్పుడే నచ్చిన కొలువు సొంతమవుతుందని సూచించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి ఎస్.శ్రీనివాసరావు, డీఆర్‌డీఏ పీడీ ఏఎన్‌వీ నాంచారరావు, జిల్లా ఉపాధికల్పన అధికారి సీహెచ్ మధుభూషన్‌రావు, ఏపీ స్టేట్ బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ అడ్వైజరీ కమిటీ చైర్మన్ గొట్టుముక్కల రఘురామరాజు, రాష్ట్ర కార్యదర్శి చెన్నుపాటి గాంధీ, కార్పొరేటర్లు చెన్నుపాటి ఉషారాణి, ముమ్మనేని ప్రసాద్, రాష్ట్ర నాయకులు వల్లభనేని నరసింహా చౌదరి, మాదిగాని గురునాథం, టి.ఎన్.టి.యు.సి రాష్ట్ర ఉపాధ్యక్షుడు పరుచూరి ప్రసాద్, మాజీ ప్లోర్ లీడర్ ఎరుబోతు రమణరావు , జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు సొంగా సంజయ్ వర్మ, ఎన్టీఆర్ జిల్లా తెలుగు యువత అధ్యక్షుడు షేక్ నాగుర్, టి.ఎన్.ఎస్.ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి పి.చరణ్ సాయి యాదవ్, టి.ఎన్.ఎస్.ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రేపాకుల శ్రీనివాస్, తూర్పు నియోజకవర్గ ఎస్సీ సెల్ అధ్యక్షుడు ఆంజనేయులు, టి.ఎన్.ఎస్.ఎఫ్ నాయకులు వడ్లమూడి వంశీ, విజయ్, రాజేష్, అనిల్ లతో పాటు వివిధ శాఖల అధికారులు, కళాశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.